రాహుల్ ఆలోచనా పరిమితికి అదే గొప్ప ఉదాహరణ
posted on May 27, 2015 12:27PM
పదేళ్ళు దేశాన్ని, సమైక్య ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎన్నికల తరువాత మరింత దయనీయంగా మారింది. అటు కేంద్రంలో కానీ ఇటు రెండు తెలుగు రాష్ట్రాలలోగానీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనబడటం లేదు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల నుండి పార్టీని బయటపడేయాలంటే అందుకు మంచి సమర్దుడయిన నాయకుడిని ఎన్నుకోవలసి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీని నడిపించడంలో చాలా ఘోరంగా విఫలమయిన సోనియాగాంధీ, పార్టీ భవిష్యత్ కంటే కొడుకు రాజకీయ భవిష్యత్తే చాలా ముఖ్యమని భావిన్నారేమో తెలియదు. పుత్రవాత్సల్యంతో ఆమె తన కొడుకుకే పార్టీ పగ్గాలు కట్టబెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒక ప్రాంతీయ పార్టీ అధినేతకుండే నాయకత్వ లక్షణాలు, రాజకీయ చతురత కూడా లేని రాహుల్ గాంధీ కాంగ్రెస్ పగ్గాలు చేప్పట్టాలని ఉవ్విళ్ళూరుతున్నారు. అందుకు ఆయనకున్న ఏకైక అర్హత ఏమిటంటే నెహ్రు కుటుంబ వారసత్వమే. ఆ విషయం గురించి ఇదివరకు ఆయనే స్వయంగా చెప్పుకొన్నారు కూడా. పార్టీలో కొందరు సీనియర్ నేతలు రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలను చేప్పట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ, ‘రాహుల్ గాంధీ ఈ ఏడాదిలోనే పార్టీ పగ్గాలు చేపడతారని’ జైరామ్ రమేష్ వంటి సీనియర్ నేతలు ద్రువీకరిస్తున్నారు.
పార్టీ పగ్గాలు చేప్పట్టాలని ఉవ్విళ్ళూరుతున్న రాహుల్ గాంధీ అందుకు అవరోధాలు ఎదురవుతుంటే, వాటిని ఎదుర్కొని పరిష్కరించుకొని తన నాయకత్వ లక్షణాలను నిరూపించుకొనే ప్రయత్నం చేసి ఉండి ఉంటే అందరూ హర్షించేవారు.నరేంద్ర మోడీ కూడా ఒకప్పుడు సరిగ్గా ఇటువంటి పరిస్థితులనే ఎదుర్కొని దైర్యంగా నిలబడి పోరాడి పార్టీపై పట్టు సాధించారు. నిజం చెప్పాలంటే ఆయన ఇప్పుడు రాహుల్ ఎదుర్కొంటున్న దాని కంటే చాలా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొని, విజయం సాధించి తన నాయకత్వ లక్షణాలను, సమర్ధతను చాటుకొన్నారు. కానీ రాహుల్ గాంధీ అటువంటి ప్రయత్నాలేవీ చేయకుండా పార్టీ మీద అలిగి రెండు నెలల పాటు విదేశాలలో చక్కర్లు కొట్టివచ్చేరు. అప్పుడు మీడియా అడిగే ప్రశ్నలకు, ప్రతిపక్షాల అవహేళనతో కాంగ్రెస్ పార్టీ తలదించుకోవలసి వచ్చింది. అయినప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించేందుకు తనను తాను సిద్దం చేసుకొనేందుకు, కాంగ్రెస్ పార్టీకి దిశా నిర్దేశం చేసేందుకు అవసరమయిన భవిష్యత్ ప్రణాళికలు సిద్దం చేసుకొనేందుకే శలవు తీసుకొన్నారని పాపం సమర్దించుకోవలసివచ్చింది.
అదే నిజమనుకొన్నా ప్రస్తుతం ఆయన వ్యవహరిస్తున్న తీరులో, అధికార బీజేపీపై చేస్తున్న విమర్శలలో కాంగ్రెస్ ట్రేడ్ మార్క్ కొట్టవచ్చినట్లు కనబడుతోంది తప్ప ఆయన రెండు నెలలు విదేశాలలో కొత్తగా నేర్చుకొని వచ్చిందేమీ కనబడటం లేదు. కాంగ్రెస్ పార్టీని సంస్కరించాలనుకొంటున్న ఆయన అది సాధ్యం కాదని గ్రహించారో ఏమో తెలియదు కానీ ఇప్పుడు తనే కాంగ్రెస్ స్టైల్ కి మారిపోయారు. ఆయన ప్రతీ మాటలో ఇప్పుడు అచ్చమయిన కాంగ్రెస్ ట్రేడ్ మార్క్ విస్పష్టంగా కనిపిస్తోంది. కానీ నేటికీ పార్టీలో చాలా మంది సీనియర్లు ఆయనకు ఇంకా దూరంగా ఉండటం గమనిస్తే వారికి ఆయన నాయకత్వంపై ఏమాత్రం నమ్మకం ఏర్పడలేదనే విషయం అర్ధమవుతుంది.
అయినా రాహుల్ గాంధీ ఇదేమీ గమనించనట్లు పాదయాత్రలు చేసుకొంటూపోతున్నారు. ఆయన విదేశాల నుండి తిరిగి రాగానే క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తన కాంగ్రెస్ పార్టీని సమూలంగా ప్రక్షాళన చేసి, పార్టీకి జవజీవాలు కల్పించే ప్రయత్నాలు చేసి ఉండి ఉంటే, ప్రజలలో, పార్టీ శ్రేణులలో ఆయనపై కొంచెం గురి కుదిరి ఉండేదేమో. కానీ ఆయన మోడీ సూటుపై తను చేసిన వ్యాఖ్యలు బాగా ప్రేలడంతో, దేశంలో మరే సమస్యలు లేవన్నట్లుగా పదేపదే దాని గురించే ప్రస్తావిస్తూ తన అసమర్ధతను, ఆలోచనా పరిమితులను స్వయంగా చాటుకొంటున్నారు. మోడీ ఆ సూటును విడిచి చాలా కాలమే అయినప్పటికీ రాహుల్ గాంధీ మాత్రం ఇంకా దానినే పట్టుకొని వ్రేలాడుతున్నారని రాజకీయ నాయకులు ముసిముసి నవ్వులు నవ్వుకొంటున్నారు.
ఒక ప్రాంతీయ పార్టీ అధినేతతో కూడా సరితూగలేని వ్యక్తి, తన సమర్ధతను నిరూపించుకొని అఖండ మెజార్టీతో కేంద్రంలో అధికారం చేప్పట్టి సువిశాలమయిన భారతదేశాన్ని ప్రగతి పధం వైపు నడిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి సున్నా మార్కులు వేస్తున్నట్లు గొప్పగా ప్రకటించినప్పుడు, ‘జీరో వాల్యూ ఉన్నవాళ్ళు జీరోలనే గుర్తించగలరు తప్ప అంతకంటే పెద్ద సంఖ్యలను గుర్తించలేరని’ వెంకయ్యనాయుడు చమత్కారంగా చెప్పిన చిన్న జవాబుతో మరింత నవ్వులపాలయ్యారు. కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ రక్షిస్తారని ఎవరూ అత్యాశకు పోవడంలేదు. కానీ ఆయనని రక్షించేందుకు కాంగ్రెస్ పార్టీని, దానిపైనే ఆధారపడిన లక్షలాది కార్యకర్తలను, నేతల జీవితాలను పణంగా పెట్టాల్సిన అవసరం ఉందా? అని కాంగ్రెస్ పార్టీయే ఆలోచించుకోవాలి.