రాహుల్ గాంధీ మళ్ళీతన గూట్లోకి వెళ్ళిపోయారా?

 

కాంగ్రెస్ ప్రభుత్వమంటేనే డిల్లీ నుండి రిమోట్ కంట్రోల్ తో ఆపరేట్ చేయబడే ప్రభుత్వమని అర్ధం. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్నాకూడా ముఖ్యమంత్రులు డిల్లీ పరిగెత్తాల్సిందే తప్ప స్వయంగా తీసుకోవడానికి వీలులేదని అందరికీ తెలిసిన విషయమే. కానీ, రాహుల్ గాంధీ పార్టీ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చెప్పటిన తరువాత పార్టీలో అధికార వికేంద్రీకరణం జరిగి, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పార్టీ వ్యవహారాలలో అధిష్టానం కలుగజేసుకోకూడదని ఆయన కాస్త గట్టిగానే చెప్పారు. అయితే, ఇటువంటి ఆలోచనలు, ఆశయాలు కాంగ్రెస్ సంస్కృతికి సరిపడవని ఆయనకీ ఈ పాటికే అర్ధం అయిఉంటుంది. ఆయన ఉపాధ్యక్షుడిగా బాద్యతలు తీసుకొన్నపటి నుండి ఇంతవరకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ లెక్కలేనన్ని సార్లు డిల్లీ ప్రదక్షిణలు చేసారు, చేస్తున్నారు, చేస్తూనే ఉంటారు కూడా.

 

రాహుల్ గాంధీ పార్టీ బాధ్యతలు చేపట్టి చాలా కాలమే అయినప్పటికీ ఆయన ఇంతవరకు పార్టీపై తనదైన ముద్ర వేయలేకపోయారు. 'ఒక వ్యక్తికి ఒకే పదవి' అని ఆయన తెచ్చిన ప్రతిపాదనను కూడా కనీసం ఆయన ఇంతవరకు పార్టీలో అమలు చేయలేకపోవడమే అందుకు ఒక చిన్న ఉదాహరణ. ఆయన రాబోయే ఎన్నికల తరువాత ప్రధాని పీటం అధిష్టిస్తారని అందరూ భావిస్తున్నారు. కానీ ఆయన అందుకు తగ్గట్లుగా వ్యవహరించడం లేదనే చెప్పాలి.

 

ఆయన ఇంతవరకు ఎటువంటి కీలక సమస్యలపై తన అభిప్రాయం వ్యక్తం చేయలేదు. కనీసం పరిష్కారం కనుగొనే విషయంలో చొరవ కూడా చూపలేదు. ఇప్పటికీ, రాష్ట్ర నేతలు డిల్లీ వెళ్ళి సోనియా గాంధీని ఆజాద్ ని కలిసి రాష్ట్ర సమస్యలపై చర్చిస్తారు తప్ప, రాహుల్ గాంధీతో చర్చించరు. ఆయన కూడా పెద్దగా చొరవ తీసుకోనట్లు కనబడటం లేదు.

 

దీనిని బట్టి ఆయనకు నిజంగానే ప్రధాని పదవిపై వ్యామోహం లేదని అర్ధం అవుతోంది. అంతే కాకుండా, కాంగ్రెస్ పార్టీని మార్చడం తనవల్ల కాదనే చేదు నిజం కూడా ఆయనకు బహుశః అర్ధమయినందునే, నైరాశ్యతకులోనయి మళ్ళీ తన గూట్లోకి వెళ్ళిపోయినట్లున్నారు.