వైసీపీకి షాక్.. ఎంపీ నందిగం సురేష్ పై రఘురామరాజు ప్రివిలేజ్ నోటిస్
posted on Sep 17, 2020 5:59PM
కొద్ది రోజులుగా వైసిపి కి చుక్కలు చూపిస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు తాజాగా తన తోటి వైసిపి ఎంపీ పై ప్రివిలేజ్ నోటిస్ ఇచ్చారు. బాపట్ల వైసిపి ఎంపీ నందిగం సురేశ్‌పై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఎంపీ రఘురామకృష్ణ రాజు ఫిర్యాదు చేశారు. ఎంపీ సురేష్ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ తనను అసభ్య పదజాలంతో దూషించారని పేర్కొంటూ రఘురామరాజు స్పీకర్ ను కలిసి ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చారు. ఈ సందర్భంగా నందిగం సురేశ్ మీడియాతో మాట్లాడిన వీడియో టేపును అయన స్పీకర్‌కు అందజేశారు. సురేష్ తనను అసభ్య పదజాలంతో కించపరిచేవిధంగా వ్యాఖ్యలు చేశారని స్పీకర్‌కు రఘురామరాజు తెలిపారు.
ఈరోజు మధ్యాహ్నం పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడిన నందిగం సురేశ్ ఎంపీ రఘురామరాజుపై తీవ్రస్థాయిలో మండిపడ్డ సంగతి తెలిసిందే. తమ పార్టీ ఎంపీల గురించి, అలాగే తమ ముఖ్యమంత్రిని ఉద్దేశించి పిచ్చివాగుడు వాగితే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతామని రఘురామరాజునుద్దేశించి సురేశ్ హెచ్చరించారు. రఘురామరాజు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని కూడా సురేష్ ఈ సంసంర్భంగా వ్యాఖ్యానించారు. మిథున్ రెడ్డి మళ్ళీ పోటీ చేస్తే నాలుగు ఓట్లు కూడా రావని రఘురామరాజు అంటున్నారని... అయితే ఢిల్లీలో గలీజు పనులు, మోసగాడు, చీటర్ లాంటి పదవులకు పోటీ పడితే ఎంపీల ఓట్లన్నీ ఆయనకే పడతాయని సురేష్ ఎద్దేవా చేశారు. తాజాగా సురేష్ చేసిన ఈ వ్యాఖ్యలపై రఘురామరాజు ప్రివిలేజ్ నోటిస్ ఇచ్చారు.