మరో కోణం..ఎమ్మెల్యే కాళ్లకు మొక్కిన కిరణ్‌బేడీ..!
posted on Jun 7, 2016 5:34PM
దేశ తొలి మహిళా ఐపీఎస్‌గా అసాంఘిక శక్తులను ఉక్కుపాదంతో అణచివేశారు కిరణ్‌బేడీ. తన ఉద్యోగ జీవితంలో ఎన్నో ప్రశంసలు పొందిన ఈ ఉక్కుమహిళ తాజాగా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. పదవిలోకి వచ్చి రాగానే కిరణ్ బేడీ తనదైన మార్క్ చూపిస్తున్నారు.
వీఐపీలు, రాజకీయ నేతల కార్లకు ఎలాంటి సైరన్లు ఉండరాదని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, రాజకీయ నేతలకు మినహాయింపు ఇవ్వొద్దని ఆదేశించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అక్కడి పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పుదుచ్చేరి వీధులను శుభ్రం చేశారు. తాజాగా ఆమెను కలిసేందుకు పుదుచ్చేరి ఎమ్మెల్యేలు వచ్చి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయవేణి..కిరణ్ బేడీకి సాలువా కప్పి పాదాభివందనం చేసింది. ఆమెను కాళ్లుపట్టుకోవద్దని లేవదీసి ఆత్మగౌరవంతో బతకాలని ఎవరి కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం లేదని ఉపదేశించారు. అక్కడితో ఆగకుండా సదరు ఎమ్మెల్యేకు తాను కూడా పాదాభివందనం చేశారు. దీంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో సంచారం చేస్తోంది.