ప్రముఖ చిత్రకారుడు బాలి మృతి

ప్రముఖ చిత్రకారుడు, కార్టూనిస్ట్‌ బాలి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం(ఏప్రిల్ 17) విశాఖపట్నంలో తుదిశ్వాస విడిచారు. మంగళవారం (ఏప్రిల్ 18)వైజాగ్‌లో ఆయన అంత్యక్రియలు జరుగుతాయి.

బాలి అసలు పేరు మేడిశెట్టి శంకరరావు. చిన్నతనం నుంచి బాలికి చిత్రలేఖనంపై ఆసక్తి మెండు.  హైదరాబాద్‌లో ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌లో క్లర్క్‌గా  ఉద్యోగంలో చేరినా చిత్రలేఖనంపై మక్కువతో ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1974లో ఈనాడు విశాఖపట్నం ఎడిషన్‌లో కార్టూనిస్ట్‌గా చేరారు. 1976లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో స్టాఫ్‌ ఆర్టిస్ట్‌గా చేరారు.  

అప్పటి ఆంధ్రజ్యోతి వారపత్రిక ఎడిటర్‌ పురాణం సుబ్రహ్మణ్య శర్మ  మేడిశెట్టి శంకరరావు పేరును బాలిగా మార్చారు. తెలుగు పత్రికా రంగంలో బాలి బొమ్మలు ఒక ప్రత్యేక శైలికి ఒరవడి దిద్దాయి. ఆయన బొమ్మలు ప్రచురించని తెలుగు పత్రిక లేదంటే అతిశయోక్తి కాదు.  

పలు కథలు, నవలలకు బొమ్మలు వేయడమే కాకుండా వేలాది కార్టూన్లు కూడా బాలి బ్రష్ నుంచి జాలువారాయి.  అంతర్జాతీయ కార్టూన్‌ పోటీలలోనూ బాలి కార్టూన్లు బహుమతులు పొందాయి. బాలి కుమారుడు  గోకుల్‌   ఇటీవల మంచు ప్రమాదంలో చిక్కుకొని మరణించారు.  బాలి కుమార్తె వైశాలి అమెరికాలో ఉంటున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu