రాహుల్ గాంధీ కబుర్లు
posted on Aug 9, 2014 3:34PM
.jpg)
ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని దాదాపు భూస్థాపితం చేసిన యువరాజవారి నాయకత్వం, సమర్ధత గురించి ఇప్పుడు బయటవారే కాదు పార్టీలో నేతలు సైతం తెగ ఇదయిపోతున్నారు. ఆ ఇది కారణంగానే రాజావారు లోక్ సభలో పార్టీకి నాయకత్వం వహించేందుకు నో చెప్పేసి వెనుక బెంచీలలో కమ్మగా కునుకు తీయడం అలవాటు చేసుకొన్నారు. ఆయన మానాన ఆయన ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా పడుకొన్నప్పటికీ గిట్టనివాళ్ళ నోళ్ళు ఊరుకోవు కదా? ఆయనలో రాజకీయ నాయకుడుకి ఉండాల్సిన ‘ఫైర్’ లేదంటూ ఏవో అవాకులు చవాకులు వాగి ఆయనకు నిద్రాభంగం చేసారు. దానితో ఆయన నిజంగానే లోక్ సభలో ఏదో ఎఫైర్ మీద చర్చ జరుగుతుంటే ఫైర్ అయిపోయారు. తోటి యంపీలు సభలో ఏవో నినాదాలు చేస్తుంటే యువరాజవారు కూడా వారి ముందు నిలబడి తను గొంతు సవరించుకొన్నారు. అయితే ఆ ఫైర్ తనకు నిద్రాభంగం కలిగించినందుకా లేక తనలో ఆ ఫైర్ ఉందని నిరూపించుకోనేందుకా? అనే డౌట్ మళ్ళీ లేవనేత్తేసేసరికి నిజంగానే యువరాజవారికి ఆవేశం వచ్చేసింది. ఎన్నికలలో గెలిచి ఉండి ఉంటేనా...నా తడాఖా చూపించేవాడిని...అని మనసులోనే అనుకొన్నారు.
కానీ పార్టీలో అందరూ ఇప్పుడు ఆయనను పక్కన బెట్టి అక్కయ్య ప్రియాంక భజన అందుకోవడంతో రాజావారి పని ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు తయారయింది. పోనీ వారి కోరిక ప్రకారం అక్కయ్యనే కాంగ్రెస్ పార్టీని ఏలుకోమని చెపుదామంటే, తను ఏమిచేయాలో పాలుపోని పరిస్థితి. అలాగని తనను ఎన్నికలలో చెయ్యి పట్టుకొని నడిపించిన అక్కయ్యను పార్టీ వ్యవహారాలలో కలుగజేసుకోవద్దని చెప్పడమూ కష్టమే.
ఈ సందిగ్ధంలో యువరాజావారు నలిగిపోతుంటే, అదేమీ పట్టని కాంగ్రెస్ జనాలు, “ఆమె వచ్చేస్తోంది...ఆమె వచ్చేస్తోంది...మనల్ని చల్లగా చూసుకొనేందుకు ఆమె వచ్చేస్తోదంటూ..ఎక్కడికక్కడ .ప్రియంకక్క పోస్టర్లు తగిలించి మరీ భజన జోరు పెంచేశారు. అది చూసి మీడియావాళ్ళు కూడా ఆవురావురుమంటూ గబగబా నాలుగు కమ్మటి కధలు అల్లేసి జనాలను రంజింప జేయడం మొదలుపెట్టేసారు. ఇదంతా చూసి చివరికి ప్రియంకమ్మే మీడియాను పిలిచి, ‘నేను రాజకీయాలలోకి రావట్లేదు,’ అని సింగల్ లైన్ స్టేట్ మెంటు ఒకటి ఇచ్చేసి బ్రాతాశ్రీకి ఉపశమనం కలిగించే ప్రయత్నం చేసారు. కానీ ఈ కాంగ్రెసోళ్ళు ఆయనను ఆ చిన్నపాటి ఆనందానికి కూడా నోచుకోకుండా చేస్తున్నారు.
పదేళ్ళ పాటు పవర్ లో ఉంటేనే దిక్కు లేకుండాపోయింది. ఇప్పుడు ఐదేళ్ళపాటు ప్రతిపక్ష బెంచీలలో కునుకు తీసేందుకు సిద్దమయిపోయిన రాజావారి శల్యసారద్యంలో కాంగ్రెస్ పార్టీ ఏమయిపోతుందో...ఆయనను నమ్ముకొంటే మా బ్రతుకులు ఏమయిపోతాయో...అంటూ భారంగా నిటూర్పులు విడుస్తున్నారు. తమ్ముడు చేతిలో నుండి అక్కయ్య పగ్గాలు తీసుకోకపోతే, ఆయన కాంగ్రెస్ పార్టీని కనబడకుండా మాయం చేసేస్తారని వాళ్ళు ఓ..ఒకటే తెగ ఇదయిపోతున్నారు. ప్చ్...ఈ కాంగ్రెసోళ్ళ కష్టాలు ఏమిటో..అవెప్పుడు తీరేనో...యువరాజవారు ప్రధానమంత్రి ఎప్పుడు అయ్యేనో ఏమిటో...ఎవరికీ అర్ధం కావడం లేదు...ప్చ్..ప్చ్..