పారిశుద్యం నిర్వహణలో రాజీపడవద్దు! కమీషనర్లకు ఆదేశాలు!
posted on Mar 28, 2020 7:40PM
రాష్ట్రంలోని మున్సిపల్ కమిషనర్లతో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ అర్వింద్‌కుమార్, పురపాలక శాఖ కమిషనర్ డాక్టర్ ఎన్.సత్యనారాయణతో కలిసి శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పారిశుద్ధ్య నిర్వహణ అంశాలపై మున్సిపల్ కమిషనర్లకు మార్గనిర్దేశనం చేశారు.
పారిశుద్యం నిర్వహణ(శానిటేషన్ మెయింటెనెన్స్) విషయంలో ఎక్కడా కూడా లోపం రాకుండా చూడాలని ఆదేశించారు. అందుబాటులో ఉన్న మున్సిపల్ నిధులను వినియోగించుకుంటూ మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని ప్రజల్లో అవగాహన, చైతన్యాన్ని పెంచేందుకు ప్రయత్నించాలని సూచించారు.
స్థానిక పోలీసు అధికారుల సహకారంతో నిత్యవసర సరుకుల కొరత ఏర్పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు.
నిత్యవసర వస్తువుల విక్రయ కేంద్రాలు, షాపులు, పెట్రోల్ బంకుల తదితర ప్రాంతాల్లో సోషల్ డిస్టెన్స్ పాటించే విధంగా నిర్వహకులను సంప్రదించి తదనుగుణంగా ఏర్పాట్లు చేయాలని నిర్దేశించారు.
పేదలు, దినసరి కూలీలకు నిత్యావసర సరుకుల కొరత రాకుండా చూడాలని, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిదిలో పనిచేస్తున్న అన్నపూర్ణ భోజన కేంద్రాల వద్ద ప్రతిరోజు శానిటేషన్ నిర్వహించి షోషల్ డిస్టెన్స్ పాటించే విధంగా చూడాలని కోరారు.
గత నెల రోజులుగా విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించడంతో పాటు వారి కుటుంబసభ్యుల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని కమిషనర్లను ఆదేశించారు.
ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) విస్తీర్ణంలోని ఐదు జిల్లాలు(రంగారెడ్డి, మేడ్చెల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి, యాదాద్రి, మెదక్) పరిధిలో గల 36 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఇవ్వాల్సిన ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) నిధులు రూ.181.50 కోట్లు విడుదల చేసినట్లు అర్వింద్‌కుమార్ వెల్లడించారు.