రాష్ట్రపతి ప్రసంగంలో పోలవరం

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు శుక్రవారం (జనవరి 31) ప్రారంభమయ్యాయి. ఆ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు గురించి ప్రస్తావించారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరాన్ని నిర్దుష్ట సమయంలో పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు.  ఈ ప్రాజెక్టుకు కేంద్రం  ఇప్పటికే రూ.12,000 కోట్లు కేటాయించింద తెలిపారు.  పోలవరంతో పాటు ఎన్డీయే ప్రభుత్వ లక్ష్యాలు, ఉద్దేశాలను ఆమె తన ప్రసంగంలో వివరించారు. దేశాన్ని గ్లోబల్ ఇన్నోవేషన్ పవర్‌హౌస్ గా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.  అందుకు దోహదం చేసే ఇండియా ఏఐ మిషన్ అన్నారు. ఇ  కృత్రిమ మేధస్సు రంగంలో భారతదేశం పాత్రను పెంచడం లక్ష్యంగా ఆ మిషన్ పని చేస్తున్నదని ముర్ము అన్నారు.  సైన్స్, స్టార్టప్‌ల నుంచి అంతరిక్ష పరిశోధన వరకు వివిధ రంగాలలో భారతీయ యువత అపార నైపుణ్యం చూపుతోందన్నారు.  

అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మించడంలో రైతులు, సైనికులు, సైన్స్‌తో పాటు పరిశోధనలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయన్నారు.  దేశంలోని విద్యా సంస్థల్లో పరిశోధనలను ప్రోత్సహించేందుకు 50 వేల కోట్ల రూపాయల వ్యయంతో నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ స్థాపించినట్లు చెప్పారు. మధ్యతరగతి గృహాలు, గిరిజన సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి సారించిందని, అలాగే చిన్న వ్యాపారులకు సైతం రుణాలను రెట్టింపు చెసినట్లు చెప్పారు.

మహాకుంభమేళాలో మౌని అమావాస్య నాడు జరిగిన ప్రమాదం పట్ల ముర్ము సంతాపం వ్యక్తం చేశారు. అలాగే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు నివాళులర్పించారు. యువతకు విద్య, ఉపాధి కల్పన విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని,  మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తోందని ముర్ము అన్నారు.