ప్రణబ్ ధిక్కార స్వరం

రాష్ట్రపతి పదవి తెల్ల ఏనుగుతో సమానం అని భారతీయుల ప్రగాఢ నమ్మకం. ప్రజల్లో ఈ నమ్మకం ఎక్కడ తొలగిపోతుందోనని ఆ పదవిని చేపట్టేవారు కూడా బహు జాగ్రత్త వహిస్తుంటారు. విదేశాల చుట్టూ గిరగిరా తిరగడం దగ్గర్నుంచీ వీలైనన్ని బహుమానాలు సేకరించడం వరకూ సాధారణ పౌరులకి ఈర్ష్య కలిగే స్థాయిలో వీరి చర్యలు సాగుతుంటాయి. ఎక్కడో అబ్దుల్ కలాం వంటి వారే దీనికి మినహాయింపుగా కనిపిస్తుంటారు. కాబట్టి పెద్ద నోట్ల రద్దు విషయంలో ప్రణబ్‌ చేసిన హెచ్చరిక ఇవాళ పతాక శీర్షికలలో నిలిచింది.

 


కాంగ్రెస్‌ కురువృద్ధుడైన ప్రణబ్‌ ముఖర్జీ రాజకీయవేత్తగా తలపండినవాడే. రక్షణ, ఆర్థిక, విదేశీ వ్యవహారాలు, వాణిజ్య శాఖలకు మంత్రిగా తనేమిటో నిరూపించుకున్నవాడే. ఒకదశలో ప్రణబ్‌ ప్రధానమంత్రి కాదగిన వ్యక్తిగా దేశం భావించింది. తనకి హిందీ సరిగా రాకపోవడంతో, ప్రధానమంత్రిని కాలేకపోయానంటూ ప్రణబ్‌ ఛలోక్తులు విసురుతుంటారు. ప్రధానమంత్రి కాకపోతనే ఏం! ఆ పదవిలో ఎవరున్నా కూడా ప్రభుత్వంలో నెం.2 స్థాయి వ్యక్తిగా ఆయన అధికారం బాగానే చెల్లింది. ఇక కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోవడంతో రాష్ట్రపతి హోదాని సైతం అందుకున్నారు.

 


నిజానికి మన దేశ రాష్ట్రపతికి ఉండే అధికారాలు చాలా తక్కువ. ఆయన చట్టాన్ని ఆమోదించాల్సి ఉన్నా, తన నిర్ణయంతో ప్రభుత్వాన్ని ధిక్కరించే అధికారం లేదు. కీలకమైన నియామకాలు చేయవలసి ఉన్నా, అవన్నీ కూడా ప్రభుత్వ సలహా సూచనలతోనే సాగించాల్సి ఉంటుంది. అందుకనే ఆయన నుంచి దేశ ప్రజలు పెద్దగా ఆశించేది ఉండదు.

 


ప్రభుత్వాన్ని ధిక్కరించడం వల్ల రచ్చ కావడమే తప్ప తన మాట నెగ్గదన్న విషయమూ రాష్ట్రపతికి కూడా తెలుసు. అందుకనే అలంకార ప్రాయమైన తన పదవిని సుతారంగా కాపాడుకుంటూ ఐదేళ్ల కాలాన్ని ముగించేస్తుంటారు. ప్రణబ్‌కు కూడా ఈ విషయం ఎరుకే కనుక తన పరిధిని మీరి ఎప్పుడూ దూకుడుని ప్రదర్శించలేదు. అసలే నెహ్రూ కుటుంబానికి విధేయునిగా ఉన్నవాడు కనుక, తన పై వారితో ఏ తీరున మెలగాలో లౌక్యం తెలిసినవాడు. కానీ అవసరం వచ్చినప్పుడు తన వాణిని వినిపించేందుకు ఆయన వెనుకడుగు వేయలేదు. దేశం అంతటా అసహనం మీద చర్చ జరుగుతున్నప్పుడు, అసహనం పెరిగిపోతున్న మాట వాస్తవమే అంటూ ప్రణబ్ వ్యాఖ్యానించారు. దాంతో అధికార పక్షం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇప్పుడు తాజాగా పెద్ద నోట్ల రద్దు మీద గళం విప్పిన ఆయన, దాని వలన పేదలు ఇబ్బందిపడే ప్రమాదం ఉందంటూ చేసిన హెచ్చరిక సంచలనంగా మారింది.

 


పెద్దనోట్ల రద్దు వల్ల ఆర్థిక రంగం మందగించే అవకాశం ఉందనీ, ఈ సందర్భంగా కష్టాల పాలవుతున్న నిరుపేదలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందనీ ప్రణబ్‌ తేల్చి చెప్పారు. దీంతో ఇప్పటికే పెద్దనోట్ల రద్దు నిర్ణయం మీద విమర్శలు ఎదుర్కొంటున్న కేంద్రం మరోసారి తన చర్యను సమర్థించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ప్రణబ్‌ వ్యాఖ్యలను నిర్మాణాత్మక సూచనగా భావిస్తే నిజంగానే నోట్ల రద్దు వల్ల ఇక్కట్లు పడుతున్న పేదల కోసం ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవచ్చు. ఎలా చూసినా కూడా ప్రణబ్ మాటల వల్ల ఆయన పదవికీ, ఇటు ప్రజాస్వామ్యానికీ కాస్తలో కాస్త ఊరట లభించినట్లయ్యింది.