మోదీ పాసవుతారా ఎన్నికల పరీక్ష

 

ఎన్నికల నగారా మరోసారి మోగింది. ఫిబ్రవరి 4 నుంచి మార్చి 8 వరకు దేశంలోని ఐదు రాష్ట్రాలలో పలు దఫాలుగా ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వ పనితీరు మీదా, పెద్ద నోట్ల రద్దు నిర్ణయం మీదా, ప్రధానమంత్రిగా మోదీ పనితీరు మీదా ఈ ఎన్నికలు ఓ రెఫరెండం అని భావిచేవారు లేకపోలేదు. జరగబోయే ఎన్నికలన్నీ కూడా భాజపాకు కీలకమైన ప్రాంతాలలో కావడమే దీనికి కారణం.

 

ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే ముందుగా అందిచూపు ఉత్తర్ప్రదేశ్ వైపే తిరిగింది. అఖిలేష్ నేతృత్వంలోని అక్కడి సమాజ్వాదీ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని అందరూ భావించినా... తండ్రితో సాగుతున్న అఖిలేష్ వైరం చివరికి బీజేపీకే లాభించేట్లు కనిపిస్తోంది. పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చినట్లుగా తండ్రీకొడుకులు పార్టీని పంచుకునేందుకు సాగిస్తున్న కొట్లాట బీజేపీకి ఉపయోగపడుతోందని తాజా సర్వేలు తేలుస్తున్నాయి. అధికారంలో ఉన్న సమాజ్వాదీ పార్టీలో కనుక చీలిక తథ్యమైతే, బీజేపీ విజయం కూడా తథ్యమని విశ్లేషకులు ఘోషిస్తున్నారు.

 

ఉత్తర్ప్రదేశ్లో భాజపాకు అనుకూలంగా ఉన్న గాలి ఉత్తరాఖండ్లో మాత్రం సెగలు కక్కుతోంది. కేంద్ర ప్రభుత్వం అక్కడ అన్యాయంగా రాష్ట్రపతి పాలనని విధించిందని అక్కడి ప్రజలు అభిప్రాయపడుతున్నారు. సాక్షాత్తూ సుప్రీం కోర్టే జోక్యం చేసుకుని అక్కడి కేంద్ర పాలనని ఎత్తివేయడంతో, బీజేపీకి తలకొట్టేసినట్లయ్యింది. దీనికి తోడు ఎలాగైనా అక్కడి ప్రభుత్వాన్ని తొలగించాలనే పట్టుదలతో ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యేలు పన్నిన తంత్రాలు కూడా అక్కడి ప్రజలకు ఏవగింపుని కలిగించాయి. శక్తిమాన్ అనే గుర్రం అక్కడి బీజేపీ చేతిలో బలైపోవడం కూడా వారి స్మృతిలో తాజాగానే ఉంది. దీంతో అక్కడ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నా హరీష్ రావత్ తిరిగి అధికారంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

 

గోవాలో ప్రస్తుతం భాజపానే అధికారంలో ఉంది. అయితే అక్కడ కూడా ఆ పార్టీకి ఏమంత అనుకూలమైన పరిస్థితులు కనిపించడం లేదు. తమిళనాడు ప్రజలకి మల్లే గోవా ప్రజలకి కూడా మార్చి మార్చి పార్టీని ఎన్నుకునే అలవాటు ఉంది. పైగా అక్కడి ప్రస్తుత ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ ఏమంత సమర్థుడైన నాయకుడు కాదన్న అభిప్రాయం వినిపిస్తోంది. పేరుకి పర్సేకర్ ముఖ్యమంత్రే అయినా ఆ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి మనోహర్ పారికర్ చేతిలో రాష్ట్ర ప్రభుత్వం కీలుబొమ్మలా మారిపోయిందన్న విమర్శలూ ఉన్నాయి.

 

ఒకవేళ అక్కడ బీజేపీ పెద్ద పార్టీగా అవతరించినా కూడా హంగ్ అసెంబ్లీ ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి.పంజాబ్లో కూడా బీజేపీ పరిస్థితి అగమ్యగోచరంగానే కనిపిస్తోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ- అకాలీదళ్ కూటమి మరోసారి విజయాన్ని సాధిస్తుందా లేదా అన్నది అనుమానంగానే ఉంది. కొన్ని సర్వేలు బీజేపీకి అనుకూలంగా వినిపిస్తున్నా, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి గట్టి పోటీ ఎదురవనుంది. ఇక మణిపూర్లో మరోసారి కాంగ్రెస్ జయకేతనం ఎగరవేయనుందంటూ స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి.

 

ఇదీ స్థూలంగా ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలలోని పరిస్థితి. నిజానికి అధికారపరంగా 2016 బీజేపీకి ఏమంతగా కలిసిరాలేదు. ఆ ఏడాది ఎన్నికలు జరిగిన తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, పుదుచేరిలలో బీజేపీ ఓటమిపాలైంది. ఒక్క అసోంలో మాత్రమే కమలం వికసించింది. కాబట్టి ఎలాగొలా 2017లో జరగనున్న ఈ అసెంబ్లీ ఎన్నికలలో అయినా పట్టు బిగించాలని ఆ పార్టీ భావిస్తోంది.

 

అసలు పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెనుక ఈ రాష్ట్రాలలో ప్రవహించనున్న దనాన్ని అదుపు చేయడం కూడా ఒక వ్యూహమంటూ విశ్లేషణలు వినవచ్చాయి. డిసెంబరు 31న జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కురిసిన వరాల జల్లు కూడా ఈ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే అన్నవారూ లేకపోలేదు. ఇక ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన తరువాత కూడా కేంద్రం తన బడ్జెటుని ప్రవేశపెట్టాలనుకోవడం కూడా బీజేపీకి లాభించే అంశమే! కేంద్రం ఊహించినట్లుగానే బడ్జెటుని ప్రవేశపెట్టే అవకాశం చిక్కితే అందులో ఇన్కమ్ టాక్స్ పరిమితుల పెంపు దగ్గర్నుంచీ సామాన్యులని ఊరించే సంస్కరణలు ఎన్నో కనిపించవచ్చు.