పవన్ పై పచ్చి బూతులతో విరుచుకుపడ్డ పోసాని..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళీ సంచలన ఆరోపణలు చేశారు. పచ్చి బూతులతో విరుచుకుపడ్డారు. సోమవారం ప్రెస్ మీట్ పెట్టి పవన్ పై వ్యక్తిగతంగా విమర్శలు చేసిన పోసానిపై ఆయన అభిమానులు బెదిరింపులకు పాల్పడ్డారట. దీంతో  పవన్ ఫ్యాన్స్ నుంచి వస్తున్న బెదిరింపులతో మీడియా ముందుకొచ్చిన పోసాని.. జనసేనానిపై తీవ్రమైన వ్యక్తిగత విమర్శలు చేశారు. పవన్ ఫ్యాన్స్ నుంచి తనకు  అమ్మనా బూతులు తిడుతూ వేలాది మెసేజ్ లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్యకు అక్రమ సంబంధం అంటగడుతున్నారని అన్నారు. పవన్ ను విమర్శిస్తే ఆయన అభిమానులు ఏ రకంగా స్పందిస్తున్నారో.. వైఎస్ జగన్ అభిమానిగా తాను అలానే స్పందించానని తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ .. ఇదే పవన్ విమర్శిస్తే 'తుకడా' చేస్తానని హెచ్చరించారని.. అప్పుడు పవన్ ఫ్యాన్స్ ఏమయ్యారని ప్రశ్నించారు. కేసీఆర్ ఇంటికెళ్లి ధర్నా చేశారా? లేక ఆయనకు బెదిరింపు మెసేజీలు పంపించారా? అని నిలదీశారు. పవన్ ఫ్యాన్స్ సైకోలుగా వ్యవహరిస్తున్నారని.. బూతులు తిడుతున్నారని.. గ్యాప్ లేకుండా మెసేజీలు పంపిస్తున్నారని పోసాని మండిపడ్డారు. తన  కుటుంబ సభ్యుల జోలికి వెళ్లొద్దంటూ పవన్ ప్రెస్ మీట్ పెట్టి తన అభిమానులకు పవన్ కళ్యాణ్ ఒక స్పష్టమైన సందేశం ఇవ్వకపోతే తాను అతని కుటుంబ సభ్యుల జోలికి వెళ్తానని అన్నారు.

చిరంజీవి రాజకీయాల్లో ఉన్నప్పుడు మాట్లాడితే తెలుగుదేవం పార్టీ సీనియర్ నేత లోక్ సభ సభ్యుడు కేశినేని ఆయన కుమార్తెపై వివాదాస్పద కామెంట్స్ చేశారని పోసాని ఆరోపించారు. రాజకీయాలకు కుటుంబ సభ్యులకు ఏం సంబంధం ఉందని చిరంజీవి బాధపడ్డారని అన్నారు. మంత్రి కురసాల కన్నబాబు దీనికి సాక్షి అని పోసాని అన్నారు.కురసాల తన ఎదురుగా చిరంజీవి ఆవేదన చెందడాన్ని తాను తట్టుకోలేకపోయానని అన్నారు.  నేరుగా కేశినేని ఇంటికి వెళ్లి ఆయనతో మాట్లాడానని చెప్పారు.  కేశినేని నానికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని.. వారిని ఎవరైనా ఏమైనా అంటే బాధపడరా? అని నిలదీశానని చెప్పారు. దీంతో కేశినేని నాని పశ్చాత్తాప పడ్డారని అన్నారు.

పవన్ కళ్యాణ్ కు కూడా ఒక కుమార్తె ఉన్నదని.. రేపొద్దున ఎవరైనా ఆమెను ఏమైనా అంటే ఆయన బాధపడరా? అని పోసాని ప్రశ్నించారు. తాను బతికే ఉంటానని.. పవన్ కు రక్తకన్నీరు తప్పదని జోస్యం చెప్పారు.  నీ ఇంట్లో ఉండేవాళ్లే ఆడవాళ్లా..? మా ఇంట్లో ఉండే వాళ్లు ఆడవాళ్లు కాదా? అని నిలదీశారు.  తన భార్యను బజారుకు ఈడుస్తూ పవన్ సైకో ఫ్యాన్స్ చేస్తోన్న మెసేజీలు వెంటనే ఆగకపోతే తాను కూడా పవన్ ఇంట్లో ఆడవాళ్లను రోడ్డుకు ఈడ్చేలా తిడతానని పోసాని కృష్ణ మురళీ హెచ్చరించారు. 

ఇక ఓ పంజాబీ అమ్మాయిని కడుపు చేసి రూ.5 కోట్లు ఇచ్చి వాళ్ల నోరు మూయించావ్ అని పోసాని సంచలన ఆరోపణలు చేశారు. ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రముఖుడు ఆమెకు కెరీర్ ఇస్తానంటే ప్రామిస్ చేసి మోసం చేశాడు.. ఆమెను గర్భవతిని చేశాడు. ఈ విషయం ఎవరికి చెప్పొద్దని  బెదిరించాడు. అందుకు 5 కోట్ల రూపాయలు ఇచ్చాడు. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చాడట.. అని పోసాని సంచలన కామెంట్స్ చేశారు. నాకు తెలిసింది చెప్పానని వివరించారు. మానసిక రోగంతో ఆ అమ్మాయి ఎలా డిప్రెషన్ లోకి వెళ్లిందో తెలుసన్నారు.