ఎంపీ భ‌ర‌త్, ఎమ్మెల్యే రాజాల‌కు జ‌గ‌న్ వార్నింగ్‌.. ఓవ‌ర్ చేస్తే యాక్ష‌న్ త‌ప్ప‌దు..

ఎంపీ మార్గాని భ‌ర‌త్ వ‌ర్సెస్ ఎమ్మెల్యే రాజా. కొన్నిరోజులుగా వీరిద్ద‌రి మ‌ధ్య వార్ ఓ రేంజ్‌లో సాగుతోంది. అధికార పార్టీ నేత‌లే ప‌ర‌స్ప‌ర విమ‌ర్శ‌లు.. అవినీతి ఆరోప‌ణ‌ల‌తో రాజ‌మండ్రిలో ర‌చ్చ రంభోలా చేస్తున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేల మాట‌ల యుద్ధం స్టేట్ వైడ్ చ‌ర్చ‌నీయాంశ‌మైంది. వైసీపీ ప‌రువంతా పోయింది. ఎంపీపై ఎమ్మెల్యే అవినీతి ఆరోప‌ణ‌లు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. క్రిమిన‌ల్స్‌, రౌడీషీట‌ర్స్‌ను వెంటేసుకుని దందాలు చేస్తున్నారంటూ ఎంపీ భ‌ర‌త్‌ను ఎమ్మెల్యే రాజా విమ‌ర్శించ‌డం.. రాజాపై భ‌ర‌త్ సైతం కాంట్ర‌వ‌ర్సీ కామెంట్స్ చేయ‌డంతో.. వారిద్ద‌రి ర‌గ‌డ తాడేప‌ల్లికి చేరింది. 

ఎంపీ, ఎమ్మెల్యేల కుంప‌టిని చ‌ల్లార్చే ప‌నిని తూర్పుగోదావ‌రి జిల్లా ఇంఛార్జి వైవీ సుబ్బారెడ్డికి అప్ప‌గించింది పార్టీ అధిష్టానం. కానీ, వారిని కాంప్ర‌మైజ్ చేయ‌డం సుబ్బారెడ్డి వ‌ల్ల కూడా కాలేదు. వైవీ స‌మ‌క్షంలోనే భ‌ర‌త్‌, రాజాలు నువ్వెంతంటే నువ్వెంతంటూ తిట్టుకోవ‌డం క‌ల‌క‌లం రేపింది. వైవీ సుబ్బారెడ్డి రెండు విడ‌త‌లుగా భ‌ర‌త్‌, రాజాల‌తో మాట్లాడి.. విడివిడిగా వారి నుంచి వివ‌ర‌ణ తీసుకున్నారు. 

మంగ‌ళ‌వారం రోజంతా తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో రాజ‌మండ్రి పంచాయితీ కొన‌సాగింది. భ‌ర‌త్‌, రాజాల‌ను కాంప్ర‌మైజ్ చేయ‌డం త‌న వ‌ల్ల కావ‌టం లేద‌ని వైవీ సుబ్బారెడ్డి చేతులెత్తేయ‌డంతో.. ఇక త‌ప్పేలా లేద‌ని సీఎం జ‌గ‌న్ నేరుగా రంగంలోకి దిగాల్సి వ‌చ్చింది. సీన్‌.. సీఎం ద‌గ్గ‌రికి షిఫ్ట్ అయింది. రాజమహేంద్రవరం ఎంపీ భరత్‌, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను పిలిపించి సీఎం జగన్‌ మాట్లాడారు. పరస్పరం బహిరంగ ఆరోపణలు చేసుకోవడంపై జ‌గ‌న్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ గీత దాటితే క‌ఠిన చర్యలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. ఇంకోసారి మీడియా ముందు గొడ‌వ ప‌డితే యాక్ష‌న్ త‌ప్ప‌ద‌ని.. ఏదైనా ప్రాబ్ల‌మ్స్ ఉంటే పార్టీ అంత‌ర్గత వేదిక‌ల్లో మాత్ర‌మే మాట్లాడాల‌ని గ‌ట్టిగా చెప్పార‌ట సీఎం జ‌గ‌న్‌. దీంతో.. రాజ‌మండ్రి వైసీపీ వ‌ర్గ‌పోరు ప్ర‌స్తుతానికి స‌మ‌సిపోయిన‌ట్టే అంటున్నారు.