పోసాని రాజకీయ సన్యాసం.. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్లేగా?
posted on Nov 22, 2024 9:04AM
పోసాని కృష్ణ మురళి తన విలక్షణ నటనతో తెలుగు సినీ పరిశ్రమలో తనదైన గుర్తింపు పొందారు. ఏదో మేరకు అభిమానులనూ సంపాదించుకున్నారు. అయితే ఎప్పుడైతే ఆయన రాజకీయాలలోకి ప్రవేశించి.. జగన్ పంచన చేరారో అప్పటి నుంచి ఆయన మాట, తీరు, నడక, నడత పూర్తిగా మారిపోయింది. జగన్ అధికారంలో ఉన్నంత కాలం బుర్ర, బుద్ధి అనే వాటితో అవసరం లేదనీ, కేవలం నోటికి పని చేబితే చాలు వైసీపీలో పబ్బం బ్రహ్మాండంగా గడిచిపోతుందనీ కనిపెట్టేశారు.
అంతే అప్పటి నుంచీ పోసాని మంచి చెడు, మర్యాద, మన్నన అనేవి పూర్తిగా మరిచిపోయారు. మీడియా మైకు దొరికితే చాలు అప్పటి విపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లపై అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. కులం పేరు చెప్పి దూషణలకూ పాల్పడ్డారు. జగన్ వ్యతిరేకులను ఎంత ఎక్కువగా తిడితే అంత ఎక్కువగా జగన్ మెప్పు పొందవచ్చని పోసాని ఇష్టారీతిగా రెచ్చిపోయారు. ఆయన అప్పట్లో మాట్లాడిన ప్రతిమాటా ఇప్పుడు రివర్స్ లో తనను చట్టం చక్రబంధంలో ఇరికిం చేయడం ఖాయమని అర్ధమైపోయింది. దీంతో పోసాని ప్లేట్ ఫిరాయించేశారు. ఇక జీవితంలో రాజకీయాల జోలికి వెళ్లను అంటూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ప్రకటించేశారు. తనకు వైసీపీలో ప్రాథమిక సభ్యత్వం కూడా లేదనీ, రాజీనామా చేసేశానని చెప్పేశారు.
జగన్ ఎంపీ, ఎమ్మెల్యేల కంటే తనకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని చెప్పుకున్న పోసాని కృష్ణ మురళి అటువంటి నేతను క్లిష్ట సమయంలో వదిలేని వెళ్లిపోతున్నందుకు పనిలో పనిగా బాధ కూడా వ్యక్తం చేశారు. తాను రాజకీయాలు మాట్లాడితే తిక్క, కోపం అంటూ విమర్శలు చేశారనీ, కానీ తాను ఇంత వరకూ మంచి నాయకులను ఎన్నడూ విమర్శించలేదనీ చెప్పుకున్నారు. రాజకీయ సన్యాసం చేస్తూ కూడా గతంలో తాను చేసిన వ్యాఖ్యలను సమర్ధించుకోవడానికి ప్రయత్నించారు. చింత చచ్చినా పులుపు చావలేదని చాటుకున్నారు. తాను చంద్రబాబు, పవన్ కల్యాణ్ వంటి వారిపై చేసిన విమర్శలు వారి గుణగణాల ఆధారంగానే చేశానని ఏకంగా తన తల్లి మీద ప్రమాణం కూడా చేసేశారు.
ఇప్పుడు కూడా తాను రాజకీయాలకు దూరం కావడం తన కుటుంబ క్షేమం కోసమేనని చెప్పు కొచ్చారు. ఇక పనిలో పనిగా ఆయన తన ట్రేడ్ మార్క్ డైలాగ్ ‘రాజా ఐ లవ్యూ’ రీతిలో జగన్ ఐ లవ్యూ అని కూడా అనేశారు. ఆ వెంటనే ఇక తాను బతికున్నంత వరకూ రాజకీయాలు మాట్లాడనని శపథం చేసేసి, ఇలా అంటున్నానంటే కేసులకు భయపడుతున్నానని కాదనీ చెప్పుకున్నారు. కానీ వాస్తవం మాత్రం అదే అని ఎవరికైనా ఇట్టే అర్ధమైపోతుంది. ఎందుకంటే ఇంత కాలం లేనిది ఇప్పడు తన వాచాలత్వంపై రాష్ట్ర వ్యాప్తంగా 38 కేసులు నమోదైన తరువాత ఒక్క సారిగా జ్ణానోదయమై రాజకీయా సన్యాసం ప్రకటించేయడానికి కారణం అరెస్టు భయం కాక ఇంకేమిటని నెటిజనులు పోసానిని తెగ ట్రోల్ చేస్తున్నారు.