అదానీ వ్యాపార సామ్రాజ్య విస్తరణ అవినీతి మయం.. అనుమానాలే కాదు.. ఆధారాలూ ఉన్నాయా?
posted on Nov 22, 2024 8:43AM
అదానీ వ్యాపార సామ్రాజ్యం అత్యంత వేగంగా విస్తరించడం వెనుక రాజకీయ అండదం డలున్నాయన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ఆయన వ్యాపార లావాదేవీల్లో పారదర్శకత తరచూ ప్రశ్నార్థకమౌతూనే ఉంది. ఇప్పుడే కాదు గతంలోనూ అదానీ అవినీతి వ్యవహారాలపై పలు ఆరోపణలు వచ్చాయి. అమెరికాకు చెందిన హిడెన్ బర్గ్ అనే పరిశోధనా సంస్థ గతంలో పలు మార్లు అదానీ వ్యాపార సామ్రాజ్యం అతి వేగంగా విస్తరించడం వెనుక మనీలాండరింగ్, సెక్యూరిటీల ఫోర్జరీ వంటి నేరాలు ఉన్నాయని ఆరోపిస్తూ నివేదికలు వెలువరించింది. తన నివేదికలకు ఆధారంగా స్విట్జర్ ల్యాండ్ విచారణ నిగ్గు తేల్చిన అంశాలను ప్రస్తావించింది. స్విట్జర్ ల్యాండ్ ఆ దేశంలో అదానీ గ్రూపునకు చెందిన పలు బ్యాంక్ అక్కౌంట్లను సీజ్ చేసిందని పేర్కొంది. అలా స్విట్జర్ ల్యాండ్ లో సీజ్ అయిన అదానీ అక్కౌంట్లలో 2600 కోట్ల రూపాయలు ఉన్నాయని హిడెన్ బర్గ్ గతంలో పేర్కొంది. అందుకు ఆధారంగా అక్కడి అంటే స్విట్జన్ ల్యాండ్ క్రిమినల్ కోర్డు రికార్డుల నుంచి సేకరించిన సమాచారాన్ని పేర్కొంది. అంతే కాకుండా వర్జిన్ ఐలాండ్స్, మారిషస్, బెర్ముడాలో కూడా అదాని అనుబంధ సంస్థ పెట్టుబడులు ఉన్నాయనీ, అవన్నీ కూడా మనీల్యాండరింగ్, సెక్యూరిటీల ఫోర్జరీల ద్వారా జమ చేసినవేనని ఆరోపించింది.
అయితే సహజంగానే అదానీ గ్రూపు ఆ ఆరోపణలను ఖండించింది. అయితే అప్పట్లో హిడెన్ బర్గ్ నివేదిక వెలువడిన తరువాత మార్కెట్ లో అదానీ షేర్ల విలువ భారీగా పతనమైంది. అప్పట్లోనే.. అంటే హిడెన్ బర్గ్ నివేదిక వెలువడడానికి ముందు వరకూ ప్రపంచ కుబేరుల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న అదాని, ఆ నివేదిక వెలువడిన స్వల్ప వ్యవధిలోనే 26వ స్థానానికి పడిపోయారు. అలాగే అదానీ గ్రూప్ షేర్ల విలువ కూడా భారీగా పతనమైంది. నివేదిక వెలువడిన నెల రోజుల వ్యవధిలో అదానీ సంపద 11లక్షల కోట్లకు పైగా ఆవిరైంది. అప్పట్లో అదానీపై హిడెన్ బర్గ్ అక్కౌంటింగ్ ఫ్రాడ్, షేర్ల విలువ కృత్రిమంగా పెంచడం, మనీ ల్యాండరింగ్, అవినీతి వంటి ఆరోపణలు చేసింది.
ఇప్పుడు అమెరికాలో అదానీపై నమోదైన కేసులో కూడా ఇవే అంశాలు ఉన్నాయి. లాభాల కోసం ఒప్పందాలు చేసుకోవడానికి ముడుపులు చెల్లించారనీ, చెల్లించడానికి అంగీకారం తెలిపారన్న అభియోగాలపై అమెరికాలో అదానీపై కేసు నమోదైంది. సహజంగానే ఇప్పుడు కూడా అదానీ గ్రూప్ ఆ ఆరోపణలను ఖండించింది. అభియోగాలు, ఖండనల సంగతి ఎలా ఉన్నా.. ఒకే వ్యాపారిపై తరచుగా అవినీతి ఆరోపణలు రావడాన్ని బట్టి అదానీ వ్యాపార సామ్రాజ్యం విస్తరణ వెనుక మతలబు ఉందన్న భావనే సర్వత్రా వ్యక్తం అవుతుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే నిప్పు లేనిదే పొగరాదు. ఎంత మంది, ఎన్ని శక్తులు అండగా, దండగా నిలబడినా నిజం నికలకడ మీద తేలక తప్పదు.