మళ్లీ కొండా, కూనా..? రేవంత్‌తో రాజకీయ పునరేకీకరణ!
posted on Jul 1, 2021 1:25PM
కాంగ్రెస్ పని ఖతం. ఇప్పట్లో కోలుకోదు. హస్తం పార్టీ తలరాతను ఎవరూ మార్చలేరు. తెలంగాణలో కాంగ్రెస్ శకం ముగిసినట్టే. ఇలా.. తీవ్ర నిరాశ, నిస్పృహ నేతల్లో ఉండేది. వరుస ఓటములు ఆ పార్టీని, నాయకులను వేధించేవి. నాయకత్వ లేమి కొట్టొచ్చినట్టు కనిపించేది. దుబ్బాక, జీహెచ్ఎమ్‌సీ, ఎమ్మెల్సీ, నాగార్జున సాగర్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్స్.. ఇలా వరుస వైఫల్యాలు. కేడర్‌లో తీవ్ర నిరుత్సాహం. గతమెంతో ఘనమైన కాంగ్రెస్‌కు ఇతంటి పరాజయాలను చూసి తట్టుకోలేకపోయారు కొందరు నాయకులు. రేవంత్‌రెడ్డికి పీసీసీ పగ్గాలు అప్పగిస్తేనే పార్టీ బాగుపడుతుందని గట్టిగా వాదించారు. రేవంత్‌ను పీసీసీ ప్రెసిడెంట్‌గా ఎంపిక చేయనీయకుండా సీనియర్లు అడ్డుపడుతుండటం చూసి తట్టుకోలేకపోయారు. ఇక తమ వల్ల కాదంటూ.. కాంగ్రెస్‌లో ఉండలేమంటూ.. వీడలేక వీడిపోయారు. వారిలో ఒకరు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి.. మరొకరు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్.
కొండా, కూనా. వీరిద్దరూ రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితులు. రేవంత్‌కు పీసీసీ పీఠం కట్టబెట్టాలంటూ అందరికంటే ఎక్కువగా డిమాండ్ చేశారు. అది నానాటికీ ఆలస్యం అవుతుండటంతో.. అధిష్టానం తీరుకు విసిగివేసారి.. కాంగ్రెస్‌ను వదిలేసి వెళ్లిపోయారు. ఒకవేళ రేవంత్‌రెడ్డిని పీసీసీ ప్రెసిడెంట్‌గా ప్రకటిస్తే.. తిరిగి పార్టీలో చేరడంపై ఆలోచిస్తానంటూ కొండా ఆనాడే చెప్పారు. విశ్వేశ్వరరెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అత్యంత బలమైన నాయకుడు. ఆయన తాత, మాజీ ముఖ్యమంత్రి రంగారెడ్డి పేరు మీదనే ఆ జిల్లా ఏర్పడింది. గ్రామగ్రామాన ఇప్పటికీ ఆ కుటుంబానికి మంచి పేరుంది. టీఆర్ఎస్‌తో రాజకీయ అరంగేట్రం చేసినా.. కేసీఆర్ నియంతృత్వ పోకడలతో పడలేక.. ఎంపీగా ఉన్నప్పుడే పార్టీని వీడారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. అయితే, చేరాక తెలిసింది. హస్తం పార్టీకి సరైన నాయకుడు లేడని.. రేవంత్‌కు పగ్గాలు అప్పగిస్తేనే కాంగ్రెస్‌కు మనుగడ సాధ్యమని. అందాక తాను కాంగ్రెస్‌లో ఉండలేనంటూ బయటకు వచ్చేశారు. ఇప్పుడు ఆయన తలచినట్టే రేవంత్‌రెడ్డిని పీసీసీ చీఫ్ చేయడంతో కొండా విశ్వేశ్వరరెడ్డి మళ్లీ రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్‌తో కలిసి పని చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఆయన వస్తే.. రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ బలం మరింత పెరగడం ఖాయం. రేవంత్‌కు సైతం మరో నమ్మదగిన అనుచరుడు దొరికినట్టే.
ఇక, మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలంగౌడ్‌ది సైతం సేమ్ ఎపిసోడ్. హైదరాబాద్ కాంగ్రెస్‌లో రేవంత్‌కు రైట్‌హ్యాండ్ లాంటి లీడర్. రేవంత్ హైదరాబాద్‌లో ఎలాంటి కార్యక్రమం చేపట్టినా కూనా పక్కన ఉండాల్సిందే. అలాంటి ప్రధాన అనుచరుడు.. రేవంత్‌కు పీసీసీ పగ్గాలు ఇవ్వడం లేదనే ఆగ్రహంతో కాంగ్రెస్‌ను కాదనుకొని.. బీజేపీలో చేరిపోయారు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు దుబ్బాకలో రెండు వారాలు మకాం వేసి.. పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేశారు. ఇప్పుడు బీజేపీ తరఫున హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ కోసం పని చేస్తున్నారు. అయితే, తన రాజకీయ రోల్‌మోడల్ రేవంత్‌రెడ్డికి తాను ఆశించినట్టే.. పీసీసీ పగ్గాలు దక్కడంతో ఇప్పుడు ఆయన పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది. బీజేపీలోనే కంటిన్యూ కావాలా.. లేక, తన నాయకుడు అధ్యక్షుడిగా ఉన్న కాంగ్రెస్‌లోకి మళ్లీ వచ్చేయాలా అని తెగ మదనపడుతున్నారని ఆయన అనుచరులు చెబుతున్న మాట. హుజురాబాద్ ఎన్నిక ముగిశాక ఆయనో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.
కొండా, కూనాలే కాదు.. రేవంత్‌రెడ్డి పదవితో పలువురు కీలక నేతలు మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. గతంలో టీడీపీలో ఆయనతో కలిసి పని చేసిన నాయకులు.. ప్రస్తుతం కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా లేని నేతలు.. టీఆర్ఎస్, బీజేపీలో అసంతృప్త వర్గాలు.. ఇలా అందరి చూపు ఇప్పుడు రేవంత్ వైపే. గతంలో టీడీపీలో కీలకంగా నేతగా ఉండి.. ఇప్పుడు కాంగ్రెస్‌లో అంతా మర్చిపోయిన.. మాజీ మంత్రి.. నాగం జనార్థన్‌రెడ్డి తాజాగా రేవంత్‌రెడ్డిని కలిసి శుభాకాంక్షలు చెప్పారు. మళ్లీ ఆయనతో కలిసి యాక్టివ్ పాలిటిక్స్ చేసేందుకు ఉత్సాహం కనబరిచారు. కొండా సురేఖ దంపతులు సైతం రేవంత్‌కు జై కొట్టారు. కేసీఆర్ పక్కనపెట్టేసిన పలువురు టీఆర్ఎస్ నేతలు సైతం రేవంత్‌తో టచ్‌లోకి వస్తున్నారని సమాచారం. ఇలా, కాంగ్రెస్‌తో సహా అన్ని పార్టీల, అన్ని వర్గాల నేతలు.. రేవంత్‌రెడ్డితో కలిసి పని చేసేందుకు ఉత్సాహం చూపడం చూస్తుంటే.. కేసీఆర్‌కు వ్యతిరేకంగా రాజకీయ పునరేకీకరణ జరుగుతోందని స్పష్టమవుతోంది. ఈ లెక్కన.. కేసీఆర్‌కు ముందుముందు దబిడి దిబిడే.