ఓటేసిన సినీ రాజకీయ, సినీ ప్రముఖులు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ మొదలైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలు ముందు బారులు తీరారు. ఓటు వేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 35 వేల 655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుండగా.. మావోయిస్టు ప్రభావితమైన 13 నియోజకవర్గాలలో సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే జరగనుంది. గతంలో కంటే ఈ సారి ఎక్కువ ఓటింగ్ జరిగేలా ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

కాగా, పోలింగ్ మొదలైన తొలి గంటలోనే రాజకీయ, సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా పోలింగ్ బూత్‌లకు తరలి వచ్చి ఓటు వేశారు.  తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన స్వగ్రామమైన చింతమడకలో ఓటేశారు. మెగాస్టార్ చిరంజీవి తన భార్యతో కలిసి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

సినీ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌తోపాటు భార్య ప్రణతి, తల్లి షాలిని ఓటు  క్యూలైన్‌లో నిలబడి ఓటేశారు. ఓబుల్ రెడ్డి పబ్లిక్ స్కూల్ లో ఎన్టీఆర్ కుటుంబం ఓటు హక్కు వినియోగించుకున్నది. మరోవైపు ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌తోపాటు సుమంత్ కూడా ఓటు వేశారు. సంగీత దర్శకుడు కీరవాణి కూడా ఓటేశారు. 

ఎమ్మెల్సీ కవిత కూడా బంజారాహిల్స్ నందినగర్ లో ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకోవాలని ఆమె కోరారు. ఇక అంబర్ పేటలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకోగా.. వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ఖమ్మంలో కాంగ్రెస్ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు, చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి మంచిర్యాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంత్రి, నిర్మల్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ నియోజకవర్గంలోని తన స్వగ్రామమైన ఎల్లపెల్లిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్టీ కండువాతో ఇంద్రకరణ్ రెడ్డి పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఎన్నికల కోడ్ ఉల్లఘించినట్లు తెలుస్తుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu