హీరో పై రైడ్ అందుకేనా...
posted on Oct 24, 2017 6:09PM
ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్కు... నేను ఒకడికి ఎదురుగా వెళ్లినా వాడికే రిస్కు అన్నడైలాగ్ ఇప్పుడు ప్రధాని మోడీకి బాగా సూట్ అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ నేతలని కాదు.. కాస్త తేడాగా ఎవరు ప్రవర్తించినా వారిని మోడీ దూరం పెడతారు. తన శత్రువులు అనుకున్నవాళ్లను మోడీ పక్కా ప్లాన్‌తో పక్కన పెట్టేస్తున్నారు. ఎల్‌కె.అద్వానీ, వెంకయ్యనాయుడు లాంటి వాళ్లను మోడీ చాలా తెలివిగా పక్కన పెట్టేశారు. మరి అలాంటి వాళ్లే మోడీ ముందు ఆగలేకపోయారంటే సినిమా హీరోలు ఓ లెక్కా. తాను తీసుకొచ్చిన సంస్కరణలపై ఎవరైనా ఎదన్నా అంటే ఊరుకుంటారా. అలాంటిదే జరిగింది ఇప్పుడు.
తమిళనాడు స్టార్ హీరో విజయ్ నటించిన మెర్సల్ సినిమాపై రేగిన దుమారం గురించి తెలిసిందే. ఈ సినిమాలో జీఎస్టీ, డిజిటల్ ఇండియా గురించి సెటైర్లు వేశారని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. ఇక బీజేపీ నేతలకు వ్యతిరేకంగా..కోలివుడ్ సూపర్ స్టార్స్.. రజనీ కాంత్, కమల్ హాసన్ మద్దతుగా చివరకు రాహుల్‌గాంధీ లాంటి వాళ్లు సైతం మద్దతునిచ్చారు. వీరితోపాటు విశాల్ కూడా విజయ్ కు మద్దుగా నిలిచాడు. అంతేకాదు... తాను మెర్సల్ చిత్ర పైరసీ కాపీని చూశానని బీజేపీ నేత హెచ్ రాజా చెప్పడంతో.. ఆయనపై కూడా విశాల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మీరు మెర్సల్ ఫైరసీ కాపీ చూశానని చెపుతున్నారు…అసలు మీకు సిగ్గుందా ? అంటూ ఫైర్ అయ్యాడు. అంతే విశాల్ అలా చేశాడో లేదో వెంటనే విశాల్ పై జీఎస్టీ బృందం కొరడా ఝుళిపించింది. విశాల్ ఆఫీస్ లో జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహించారు. విశాల్ నిర్మాణ సంస్థకు సంబందించిన లావాదేవిలని అధికారులు పరిశీలించారు. జీఎస్టీ చెల్లింపులో అవకతవకలు జరిగినట్లు సందేహాల నేపథ్యంలో అధికారులు విశాల్ కార్యాలయాన్ని శోధించినట్లు తెలుస్తోంది. దీనితో పాటు బీజేపీ నేత ఒకరు.. దక్షిణ చెన్నై జిల్లా బీజేపీ సాంకేతిక విభాగం ఉపాధ్యక్షుడు సిద్ధార్ధ్ మణి విజయ్‌కి మద్దతుగా నిలవడంతో. ఆయనను కూడా పార్టీ అధిష్ఠానం తాత్కాలికం గా పార్టీ నుంచి తొలగించింది. మొత్తానికి మోడీ తనకు అడ్డు వచ్చిన వాళ్లకి ఎలా సమాధానం చెప్పాలో.. ఇప్పుడు కూడా అదే రూట్ లో వెళుతున్నారు. మరి చూద్దాం ఈ వ్యవహారం ఎంత వరకూ వెళుతుందో...