చాహల్ స్పిన్ మ్యాజిక్.. కోల్ కతా నైట్ రైడర్స్ గింగిరాలు
posted on Apr 15, 2025 12:37AM
.webp)
16 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ విజయం
ఐపీఎల్ లో భాగంగా మంగళవారం (ఏప్రిల్ 15) పంజాబ్ కింగ్స్ కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో చాహల్ స్పిన్ తో మ్యాజిక్ చేశాడు. దాంతో కోల్ కతా స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చతికిల పడింది. ఐపీఎల్ అంటేనే బంతిపై బ్యాట్ ఆధిపత్యం.. పరుగుల వరద పారుతుంది. కానీ మంగళవారం ( ఏప్రిల్ 15) జరిగిన మ్యాచ్ అందుకు పూర్తి భిన్నంగా సాగింది. ఈ మ్యాచ్ లో బంతిదే ఆధిపత్యం. పంజాబ్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ లో బౌలర్ల ఆధిపత్యం కొనసాగింది. ఫలితంగా తక్కువ స్కోర్లే నమోదయ్యాయి.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ 15.3 ఓవర్లలో 111పరుగులకే కుప్పకూలింది. కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లలో హర్షిత్ రాణా రాణించాడు. మూడు ఓవర్లు వేసిన హర్షిత్ రాణా కేవలం పాతిక పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. వరుణ్ చక్రవర్తి, నరైన్ లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. వైభవ్ అనిరిచ్ లు ఒక్కో వికెట్ చొప్పున తీశారు. పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్ సిమ్రాన్ సింగ్ 30 పరుగులు, ప్రియాన్స్ ఆర్యా 22 పరుగులు చేశారు.మిగిలిన బ్యాటర్లంతా విఫలమయ్యారు. దీంతో కోల్ కతా ముందు 112 పరుగుల స్వల్ప విజయలక్ష్యం ఉంది. అందరూ కూడా కోల్ కతా నైట్ రైడర్స్ విజయం లాంఛనమే అని భావించారు. అయితే పంజాబ్ బౌలర్లు అందరి అంచనాలనూ తల్ల కిందులు చేశారు. కోల్ కతా నైట్ రైడర్స్ ను వంద పరుగులలోపే కట్టడి చేశారు. ఐపీఎల్ చరిత్రలోఇంత తక్కువ స్కోరును కాపాడుకుని గెలవడం ఇదే ప్రథమం. ఆ విషయంలో పంజాబ్ కొత్త రికార్డు సృష్టించింది.
ఇక పంజాబ్ బౌలర్లలో యుజువేంద్ర చాహల్ మాయ చేశాడు. తన స్పిన్ మాయా జాలంతో కోల్ కతా బ్యాటింగ్ లైనప్ నడ్డి విరిచాడు. నాలుగు ఓవర్లు వేసిన చాహల్ 28 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. చాహల్ తను వేసిన చివరి ఓవర్లో రస్సెల్ రెండు సిక్స్ లు ఓ ఫోర్ బాదడంతో ఆ దశలో కోల్ కతాకు గెలుపుపై ఆశలు చిగురించాయి. అయితే జాన్సన ఆ ఆశలను చిదిమేశాడు. 3.1 ఓవర్లలో కేవలం 17 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో కోల్ కతా నైట్ రైడర్స్ 15.1 ఓవర్లలో కేవలం 95 పరుగులకే ఆలౌట్ అయ్యి 16 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ చాహల్ ను వరించింది.