వారాహియాత్ర కు ముందు పవన్ ముందస్తు మాట!

ఏపీలో ముందస్తు ముచ్చటకు తెరపడటం లేదు. నిర్ణీత గడుపు మేరకే ఎన్నికలకు వెడతాం అని వైసీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ విస్పష్టంగా తేల్చేసినా ఇటు జనాలు కానీ, అటు రాజకీయ నాయకులు కానీ ఆయన మాటలను విశ్వసించడం లేదు.

ఆయన ఏం చెప్పినా చేసేది మాత్రం చెప్పిన దానికి సరిగ్గా విరుద్ధంగా ఉంటుందంటూ సోదాహరణంగా వివరిస్తున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు తథ్యమని అన్నారు. ఆయన తన వారాహి యాత్ర ప్రారంభించడానికి రోజుల ముందు చేసిన ఈ ప్రకటన రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా పెద్ద ఎత్తున చర్చకూ తావిచ్చింది. ముందస్తు ఆలోచనే లేదనీ, ఎన్నికలకు ఇంకా తొమ్మిది నెలలు గడువు ఉందనీ, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు ఉంటాయనీ, ఇటీవలి కేబినెట్ సమావేశంలో జగన్ కుండబద్దలు కొట్టిన చందంగా విస్పష్టంగా చెప్పారు.

అయితే ఆయన మాటలను విపక్షాలు, జనమే కాదు, సొంత పార్టీ నేతలు కూడా పెద్దగా నమ్మడం లేదనడానికి వైసీపీలో కూడా సాగుతున్న ముందస్తు చర్చే నిదర్శనం.  తాజాగా ఏపీ లో ముందస్తు ఎన్నికలు ఉంటాయంటూ జనసేనాని పవన్ కల్యాణ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చే శారు. జగన్ చెప్పినట్లు తొమ్మిది నెలలు కాదనీ, ఆరు నెలల్లోనే అంటే ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటే ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగే అవకాశాలే మెండుగా ఉన్నాయనీ పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.  మంగళగిరి లోని పార్టీ కేంద్ర కార్యాలయానికి భూమిపూజ  సోమవారం (జూన్ 12) భూమి పూజ చేసిన పవన్ కల్యాణ్  ఏపీ, తెలంగాణలలో ఒకే సమయంలో ఎన్నికలు జరుగుతాయనీ, రెండు రాష్ట్రాలలోనూ జనసేన పోటీ చేస్తుందనీ స్పష్టత ఇచ్చారు.

 ఇక రెండు రాష్ట్రాలలోనూ కూడా జనసేన పొత్తులతోనే ఎన్నికల బరిలో దిగుతుందని కూడా క్లారిటీ ఇచ్చేశారు. ఏపీలో అయితే తెలుగుదేశంతో  జనసేన కలిసి నడుస్తుందన్న క్లారిటీ వచ్చేసింది. తెలంగాణలో కూడా తెలుగుదేశం, జనసేన మధ్య పోటీ ఉంటుందన్న సంకేతాలను పవన్ కల్యాణ్ తన తాజా ప్రకటన ద్వారా ఇచ్చేశారు. సీట్ల ఒప్పందం సహా అన్ని విషయాలూ చర్చించుకునే పొత్తుల విషయంలో ముందుకు వెళతామన్న పవన్ కల్యాణ్  ఈ విషయంలో తాను వినా పార్టీలో ఎవరూ మాట్లాడవద్దని కూడా ఈ సందర్భంగా చెప్పారు.

ఇక ముందస్తు ముచ్చట విషయానికి వస్తే జగన్ ఏ ముహూర్తంలో హస్తిన నుంచి అత్యవసర మంత్రివర్గ భేటీకి నిర్ణయం తీసుకున్నారో ఆ క్షణం నుంచే రాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది చివరిలోనే ఎన్నికలు జరుగుతాయని రాజకీయ సర్కిల్స్ లో మొదలైన చర్చ జగన్ స్వయంగా ముందస్తు ఉండదని స్పష్టం చేసినా ఆగడం లేదు.  తెలుగుదేశం నేతలైతే రాష్ట్రానికి పట్టిన శని ముందస్తుగా వదిలిపోవాలంటే ముందస్తు ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాయి. పరిశీలకులైతే.. కేంద్రంలోని బీజేపీ అండదండలు అందించకుంటే ఆగస్టు తరువాత ఒక్క రోజు కూడా జగన్ ప్రభుత్వాన్ని నడపలేరనీ, ఆర్థిక పరిస్థితే అందుకు కారణమని అంటున్నారు. తాజాగా కాళహస్తిలో నడ్డా, విశాఖలో అమిత్ షా మాటలను బట్టి చూస్తే.. కేంద్రం నుంచి ఇక జగన్ సర్కార్ కు తోడ్పాటు అందే అవకాశాలు అంతంతమాత్రమేనని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ కు ముందస్తు వినా మరో మార్గం లేదని అంటున్నారు.వాస్తవానికి కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించేసింది. ఆగస్టులో తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికల అధికారులను పరిశీలనకు పంపనుంది. దీంతో ఇప్పటికిప్పుడు జగన్ నిర్ణయం తీసుకుని అసెంబ్లీ రద్దుకు ప్రతిపాదనలు పంపినా తెలంగాణ అసెంబ్లీతో ఏపీ ఎన్నికలు జరిగే అవకాశాలు లేవు. అయినా జగన్ మాటలపై విశ్వసనీయత లేకపోవడం వల్లనే ఏపీలో ముందస్తుపై చర్చ ఎడతెగకుండా జరుగుతూనే ఉంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu