అంత డబ్బు ఎక్కడి నుండి వస్తుంది పవన్...?
posted on Oct 28, 2017 6:14PM

2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలో దిగనున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే పవన్ ఇప్పటినుండే వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన పవన్.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో తమ పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్, అమరావతిలో 5 ఎకరాల విస్తీర్ణంలో పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. అలాగే మిగతా జిల్లా కేంద్రాల్లో రెండెకరాల విస్తీర్ణంలో జనసేన కార్యాలయాలు నిర్మించనున్నారు. ప్రస్తుతం పార్టీ సభ్యత్వాలపై దృష్టిపెట్టిన పవన్ జనసేన కార్యాలయాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని యోచిస్తున్నారు. తెలంగాణలో తొలిదశలో ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లోనే కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. రెండో దశలో కొత్తగా ఏర్పడిన అన్ని జిల్లాల్లోనూ జనసేన కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. ఇందుకు సంబంధించి పార్టీలోని కొంత మందికి బాధ్యతలు అప్పజెప్పారు.
ఇదిలా ఉండగా.. ఇప్పుడు అందరికీ కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. అసలు నా దగ్గర డబ్బులే లేవు అని ఎప్పుడూ చెప్పే పవన్ కు ఇప్పుడు అన్ని చోట్లా ఆఫీస్ లు పెట్టడానికి అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది అని అంటున్నారు. అంతేకాదు అమరావతిలో ఇప్పుడు భూమి ధరలు బాగా పెరిగిన నేపథ్యంలో 5 ఎకరాలు కొనడం అంటే మాటలుకాదు. ఎంత ఫండ్స్ నుండి డబ్బులు వచ్చినా హైదరాబాద్లో, అమరావతిలో, ఇంకా అన్నిజిల్లాల్లో ఆఫీస్ లు నిర్మించాలంటే తడిసిమోపెడవుతుంది. మరి వాటికి అంత డబ్బు ఎక్కడి నుండి వస్తుంది అని చర్చించుకుంటున్నారు. మరి అన్ని మారినట్టే పవన్ నిర్ణయం ఈ విషయంలో కూడా మారుతుందా..? ఏం జరుగుతుందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.