పేపర్ బ్యాగ్స్ తీసుకుందామా?

మనిషి విజ్ఞానపరంగా అభివృద్ధి చెందేకొద్ది ఎన్నో గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేసాడు. నిత్యం అన్నిరకాలుగా ఉపయోగించుకుంటున్న ప్లాస్టిక్ అలాంటిదే. అయితే కాలం గడిచేకొద్దీ ఆ ప్లాస్టిక్ ఎంత ప్రమాదకరమైనదో తెలిసొచ్చింది. దానికి ప్రత్యామ్నాయంగా ఎన్నెన్నో ప్రయోగలు చేశారు. ప్రకృతికి హాని కలిగించకుండా ఉండాలని చేసిన ఆ ప్రయత్నాలలో ఆవిష్కారం అయ్యిందే పేపర్ బ్యాగ్. పండ్లు తీసుకోవలన్నా, పూలు తీసుకోవలన్నా, కూరగాయలు, సరుకులు, చివరికి చెత్త పడేయడానికి కూడా ప్లాస్టిక్ వాడటం వల్ల చాలా పెద్ద నష్టాలే ఎదురయ్యాయి. ఇప్పుడు మాత్రం ప్లాస్టిక్ బ్యాన్ చేసి పేపర్ బ్యాగ్ వైపు మొగ్గుచూపారు. 

పేపర్ బ్యాగ్ పుట్టుక!

ప్రతి సంవత్సరం జూలై 12న పేపర్ బ్యాగ్ డేగా జరుపుకుంటారు. ప్లాస్టిక్‌కు బదులు పేపర్ బ్యాగుల వాడకంపై అవగాహన కల్పించే సమావేశాలు, కార్యకలాపాలు చేపడతారు.    పర్యావరణానికి  ప్లాస్టిక్ సంచుల వల్ల జరిగే  దుష్ప్రభావమే పేపర్ బ్యాగుల వినియోగానికి దారితీసింది. మనం ఉపయోగించి పడేసే ప్లాస్టిక్ కుళ్ళిపోవడానికి సంవత్సరాలు పడుతుంది, అయితే కాగితపు సంచుల ద్వారా ఈ కాలుష్యాన్ని తగ్గించవచ్చు. అంతేకాకుండా ఈ పేపర్ బ్యాగులను తిరిగి రీసైకిల్ చేయడం లేదా వీటిని సులువుగా నేలలో కలిసిపోయేలా చేయచ్చు.  ప్రజలు స్థిరమైన జీవనశైలిని ఎంచుకుంటున్న దశలో పర్యావరణం గురించి ఆలోచించి ప్లాస్టిక్ ను దూరం పెట్టి పేపర్ బ్యాగ్ లను వాడితే ఎంతో మంచి పరిణామాలు చోటుచేసుకుంటాయి.  

 పేపర్ బ్యాగ్ చరిత్ర:

ప్లాస్టిక్ వినియోగం వల్ల ఎదురవుతున్న నష్టాలకు పరిష్కారంగా పేపర్ బ్యాగ్ ల వాడకం మొదలైనా, పేపర్ బ్యాగ్ ల  పుట్టుక మాత్రం ఇప్పటిదేమీ కాదని చరిత్ర చెబుతోంది. భారతదేశ ప్రాచీనులు వస్త్రాలతో తయారుచేసిన సంచులు, జనపనార, టెంకాయ పీచు వంటి వాటితో తయారుచేసిన  చేతి సంచులు వాడేవాళ్ళు. అయితే 1852లో ఫ్రాన్సిస్ వోల్లే అనే అమెరికన్ ఆవిష్కర్త మొదటి పేపర్ బ్యాగ్ మెషీన్‌ను స్థాపించాడు.  తరువాత 1871లో మార్గరెట్ ఇ నైట్ ఫ్లాట్-బాటమ్ పేపర్ బ్యాగ్‌లను ఉత్పత్తి చేసే మరొక యంత్రాన్ని అభివృద్ధి చేసింది.  ఆమె "the mother of the grocery bag"గా ప్రసిద్ధి చెందింది. ఆ తరువాత అనేక సంవత్సరాలుగా, చార్లెస్ స్టిల్‌వెల్ మరియు వాల్టర్ డ్యూబెనర్ వంటి అనేక మంది ఆవిష్కర్తలు మెరుగైన డిజైన్‌లు మరియు మాన్నికైన కాగితపు సంచులను ఉత్పత్తి చేశారు. 

కాగితపు సంచులు లేదా పేపర్ బ్యాగ్స్ ఎందుకు వాడాలి?

కాగితపు సంచులు ఎందుకు వాడాలి అనేదానిపై చెప్పుకోవాల్సిన మొదటి విషయం పర్యావరణానికి హాని కలిగించకపోవడం. వాడేసి పడేసిన తరువాత తొందరగా భూమిలో కలిసిపోవడం, లేదా రీసైకిల్ చేయడానికి అనువుగా ఉండటం.  పేపర్ బ్యాగ్స్ వాడటం వల్ల అన్ని రకాల కాలుష్యాలను  తగ్గించవచ్చు. 

పేపర్ బ్యాగ్స్ ను ఒక్కసారి వాడి పడేయకుండా రియూజ్ చేసుకోవచ్చు. అంటే ఓకేదాన్ని  మళ్ళీ ఉపయోగించుకోవడం. 

ఒకసారి వాడేసిన పేపర్ బ్యాగ్ పరిస్థితిని బట్టి వంటగదిలో వాడొచ్చు. నూనెలో వేయించిన పకోడీలు ఇతర పదార్థాలను శుభ్రంగా ఉన్న పేపర్ బ్యాగ్ లపై వేస్తే నూనెను పీల్చుకుంటాయి. కిచెన్ నాప్కిన్స్ కొనే ఖర్చు కాస్త అయినా తగ్గుతుంది.

గాజు, పింగాణీ వంటి వస్తువులను ప్యాక్ చేయడానికి పేపర్ బ్యాగ్స్ బాగా ఉపయోగపడతాయి. వీటి వల్ల వస్తువులు విరిగిపోకుండా ఉంటాయి.

పేపర్ బ్యాగ్స్ లో కార్బన్ మూలం ఉంటుంది. కాబట్టి కంపోస్టు ఎరువుగా మార్చడానికి బాగా అనువుగా ఉంటుంది. ఈ ఎరువు మొక్కలకు మంచి పోషకంగా ఉపయోగపడుతుంది.

ఉల్లి వెల్లుళ్లు వంటి వాటిని పేపర్ బ్యాగ్స్ లో వేసి పొడి ప్రదేశాలలో ఉంచితే నెలల తరబడి పాడుకాకుండా ఉంటాయి. అంతేకాకుండా ఆకుకూరలు వంటివి పేపర్ బ్యాగ్స్ లో వేసి ఫ్రిజ్ లో ఉంచితే అదనపు తేమను పీల్చుకుని ఆకుకూరలు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.

◆ ఎక్కడికి వెళ్లినా ఓ పేపర్ బాగ్ మనతో ఉంచుకుంటే ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. లేకుంటే సింపుల్ గా రికైల్ కోసం వాడేయచ్చు కూడా.

పేపర్ బ్యాగ్స్ ను ఏవిధంగా వాదుకున్నా వీటి నుండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ, నష్టాలు కానీ ఉండవు. ధర విషయంలో మరీ అంత ఎక్కువగా ఏమి ఉండవు. 

కాబట్టి పర్యావరణానికి మంచి చేసే పేపర్ బ్యాగ్స్ వైపు అడుగులు వేసి కాసింత ఈ భూమిని, ప్రకృతిని కాపాడుకోవాలి అందరూ.

                                 ◆వెంకటేష్ పువ్వాడ.

 

Related Segment News