ఇండియా-పాక్ చర్చలపై సర్వే....షాకింగ్ రెస్పాన్స్
posted on Jan 7, 2017 9:36AM

ఉడీ దాడితో ఇండియా- పాకిస్థాన్ ల మధ్య జరగాల్సిన ద్వైపాక్షిక చర్చలకు భంగం కలిగిన సంగతి తెలిసిందే. రెండు దేశాల మధ్య చర్చలు జరిగే సమయం దగ్గర పడిన నేపథ్యంలో పాక్ ఉగ్రవాదులు ఉడీ దాడి జరిపారు. అంతే ఈ దాడులకు గాను రగిలిపోయిన భారత్ సర్జికల్ స్ట్రైక్స్ జరిపింది. అప్పటినుండి రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికీ రెండు సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఈ పరిణామాల మధ్య ఇరు దేశాల చర్చలు గట్టేక్కాయి. అయితే ఇప్పుడు ఈ చర్చల గురించి పాక్ జరిపిన సర్వేలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ప్రపంచ ప్రఖ్యాత గాలప్ సర్వే సంస్థ తన పాకిస్థాన్ శాఖ ద్వారా సర్వే నిర్వహించింది. పాకిస్థాన్ పంజాబ్, సింధ్, బలూచ్, ఖైబర్ ఫక్తునక్వా రాష్ట్రాల్లోని పలు గ్రామాలు, పట్టణాల్లో... సుమారు 2000 మందిని ‘ఇండియాతో చర్చలకు మీరు అనుకూలమేనా?’ అన్న ప్రశ్నను అడిగారు. దీనికి 68 శాతం మంది ‘అవును’అనే సమాధానం ఇచ్చారు. చర్చల ద్వారా మాత్రమే ఇరు దేశాల్లో శాంతి నెలకొంటుందని, భారత్-పాక్ భాయిభాయి అనుకుంటే దక్షిణాసియాలో ఎదురే ఉండదని మెజారిటీ పాకిస్థానీలు అభిప్రాయపడ్డారు. మరి పాక్ చర్చలకు భారత్ ఎప్పుడు అంగీకరిస్తుందో చూడాలి.