నొప్పులన్నీ ఆడవారికేనా?

నొప్పి అన్న మాట రాగానే ప్రసవ వేదనే గుర్తుకువస్తుంది. ఆడవారు పడే ప్రసవవేదన ముందు ఎలాంటి నొప్పయినా బలాదూరే అని చెబుతూ ఉంటారు. ఆ సంగతేమో కానీ... మగవారితో పోలిస్తే ఆడవారు పడే నొప్పి తీవ్రం అంటున్నారు పరిశోధకులు.

 


అమెరికాలోని జార్జియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు నొప్పిని ఎదుర్కోవడంలో ఆడవారికీ, మగవారికీ మధ్య ఏమన్నా తేడా ఉందేమో అని గమనించారు. ఈ సందర్భంగా కొన్ని అనూహ్యహైన ఫలితాలు వెల్లడయ్యాయి. తీవ్రమైన నొప్పులను ఎదుర్కొనేందుకు ఇచ్చే మార్ఫిన్‌ అనే మందు స్త్రీల విషయంలో అంతగా పనిచేయడం లేదని తేలింది. మగవారికి ఇచ్చే మార్ఫిన్‌ కంటే రెట్టింపు మోతాదుని ఇస్తేకానీ ఆడవారికి ఆ మందు పనిచేయకపోవడాన్ని గమనించారు.

 


ఒకటే మందు అటు మగవారిలో ఒకలాగా, ఇటు ఆడవారిలో ఒకలాగా పనిచేయడానికి కారణం ఏమిటా అని శోధన మొదలైంది. ఇందుకు కారణం మెదడులో ఉంటే microglia అనే కణాలు అని తేలింది. ఈ కణాలు శరీరంలో ఎలాంటి నొప్పి, ఇన్ఫెక్షన్‌వంటివి ఉన్నాయోమో గమనిస్తూ ఉంటాయట. శరీరంలో నొప్పి ఉందని ఈ microglia కణాలు నిర్థారిస్తే తప్ప... సదరు నొప్పిని నివారించే మందులు ముందుకు పోలేవు. మరోమాటలో చెప్పాలంటే microglia కణాల అనుమతి లేకపోవడం వల్లే ఆడవారిలో మార్ఫిన్‌ వంటి మందులు పనిచేయకుండా పోతున్నాయి.

 


నొప్పినివారణ మందులను స్వీకరించడంలో స్త్రీ మెదడు భిన్నంగా వ్యవహరించడానికి కారణం తెలియడం లేదు. కానీ ఇక మీదట వారిలోని microglia కణాలను కూడా ప్రభావితం చేసేలా మాత్రలు రూపొందిస్తే కానీ ఫలితం ఉండదని మాత్రం తేలిపోయింది. అసలే ఆడవారిలో నరాలకు, కీళ్లకు సంబంధించిన వ్యాధులు అధికం. ఇక రుతుక్రమం కారణంగా ఏర్పడే సమస్యలు సరేసరి! ఈ నొప్పులన్నీ వారి జీవితాలని నరకం చేస్తుంటాయి. ఇక వీటికి తోడు తీవ్రమైన నొప్పులకు వాడే మందులు కూడా వారిమీద పనిచేయవు అని తేలడం నిజంగా దురదృష్టకరం! మరి ఈ పరిస్థితిని విజ్ఞానరంగం చూసీ చూడనట్లు ఊరుకుంటుందా... లేకపోతే ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనే దిశగా పరిశోధన సాగిస్తుందా అన్నది వేచి చూడాల్సిందే!

 

- నిర్జర.