భారత్ తలచుకుంటే ప్రపంచ పటంలో పాక్ ఉండదు : సీఎం రేవంత్‌రెడ్డి
posted on May 8, 2025 8:46PM
.webp)
పహల్గమ్ ఉగ్రవాదాడి నేపథ్యంలో భారత సైన్యానికి సంఘీభావంగా హైదరాబాద్‌లో శక్తివంతమైన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ ర్యాలీకి నగరంలోని యువత పెద్ద ఎత్తున తరలి వచ్చింది. సచివాలయం నుంచి నెక్లెస్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, భారత దేశ సార్వభౌమత్వంపై ఎవరైనా దాడి చేస్తే ఊరుకునేది లేదని అన్నారు. తమ శాంత స్వభావాన్ని చేతకానితనంగా భావించవద్దని హెచ్చరించారు. భారత భూభాగంలో కాలు మోపి, తమ ఆడబిడ్డల నుదుటి సిందూరాన్ని తుడిచి వేయాలనుకుంటే 'ఆపరేషన్ సిందూర్' ఇందుకు సమాధానం అని రేవంత్ పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ వంటి వాటి ద్వారా మిమ్మల్ని నేలమట్టం చేసే శక్తి భారత వీర జవాన్లకు ఉందని అన్నారు.
ఆ వీర జవాన్లకు 140 కోట్ల మంది భారతీయులు అండగా ఉంటారని అన్నారు. ఇండియా వైపు కన్నెత్తి చూస్తే మీకు నూకలు చెల్లినట్లేనని హెచ్చరించారు. బ్రిటిష్ వాళ్ల నుంచి శాంతి ద్వారానే భారత్‌తో పాటు పాక్‌కు కూడా స్వేచ్ఛా వాయువులు అందించి మహాత్మా గాంధీ అమరులయ్యారని, ఆయన చేసిన శాంతియుత పోరాటం వల్లే మనం ఈ రోజు స్వేచ్ఛను అనుభవిస్తున్నామని అన్నారు.సెక్రటేరియట్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ అంబేద్కర్ విగ్రహం వరకు సాగి, అక్కడి నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వరకు కొనసాగింది. ర్యాలీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, పౌరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. టెర్రరిస్టుల దాడిలో వీరమరణం పొందిన జవాన్లకు నివాళులు అర్పించడంతో పాటు, వారిని స్మరిస్తూ ఒక నిమిషం మౌనం పాటించారు.