ఉగ్రవాదంపై పోరులో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ : ప్రధాని
posted on Apr 29, 2025 8:34PM
.webp)
జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం లో జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలోనూ ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. దేశ అంతర్గత భద్రతకు సంబంధించిన అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఉగ్రవాద ముప్పును ఎదుర్కోవడానికి భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలపై కీలక వ్యూహరచన జరిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత సాయుధ బలగాల శక్తి సామర్థ్యాలపై తనకు పూర్తి విశ్వాసం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించడమే జాతీయ సంకల్పమని ప్రధాని పునరుద్ఘాటించారు.
ఈ లక్ష్య సాధనలో భాగంగా, ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడానికి భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. పహల్గామ్ దాడికి పాల్పడిన వారికి తగిన రీతిలో గట్టి బదులిస్తామని కూడా ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో అంతం చేస్తామని ప్రధాని తెలిపారు. ఈ సమావేశంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్, త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు.