ధరణి అద్భుతమంటున్న కేసీఆర్! దరిద్రమంటూ ఆరోపణలు

రెవిన్యూ శాఖలో కీలక సంస్కరణలు తెచ్చింది తెలంగాణ సర్కార్. కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ధరణి పోర్టల్ ను ప్రారంభించారు సీఎం కేసీఆర్. ధరణితో భూవివాదాలకు చెక్ పడిందని చెప్పారు కేసీఆర్. ఇకపై ఎలాంటి లంచాలు లేకుండానే భూముల రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని, వారం రోజుల్లోనే కొత్త పాస్ బుక్ ఇంటికి వస్తుందని చెప్పారు. అయితే ధరణి పోర్టల్ పై రెవిన్యూ నిపుణులు, రియల్ వ్యాపారులు పెదవి విరుస్తున్నారు. ధరణి పోర్టల్ తో ప్రజలకు కొత్తగా ఎలాంటి ప్రయోజనం లేదని చెబుతున్నారు. సీఎం కేసీఆర్ చెబుతున్న ధరణి పోర్టలో దరిద్రం పోర్టల్ అని మరికొందరు విమర్శిస్తున్నారు. 

 

కొత్త సీసాలో పాత సారాలా ధరణి పోర్టల్ ఉందంటున్నారు కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు. పాత సిస్టాన్నే డెవలప్ చేశారని చెబుతున్నారు. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ విధానాలన్ని పాతవే అంటున్నారు. ధరణి వెబ్ సైట్ అద్భుతమని కేసీఆర్ అసత్యాలు చెబుతున్నారని, అసలు ధరణితో ప్రజలకు కొత్తగా కలిగే ప్రయోజనాలేంటో మాత్రం చెప్పడం లేదని కొందరు విమర్శిస్తున్నారు. 

 

ధరణితో ప్రభుత్వ భూములను కాపాడుతామని చెప్పిన కేసీఆర్.. అది ఎలా చేస్తారో మాత్రం చెప్పడం లేదనే విమర్శలు వస్తున్నాయి.  గతంలోనూ సర్కార్ భూముల రిజిస్ట్రేషన్లు జరగలేదు. అయితే అక్రమార్కులు చట్టంలోని లొసుగులను ఉపయోగించుకుని.. ప్రభుత్వ భూములను కబ్జా చేసి.. వాటికి ప్రైవేట్ సర్వే నెంబర్లు ఇచ్చి బోగస్ రిజిస్ట్రేషన్ చేసుకునేవారు. ఈ పద్ధతిలోనే వేలాది ఎకరాల వక్ఫ్, దేవాదాయ భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఈ తరహా కబ్జాలను నివారించేందుకు ధరణిలో ఎలాంటి అవకాశం లేదు. అలాంటప్పుడు ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు ఆపడం అసాధ్యమంటున్నారు నిపుణులు. వక్భ్ , దేవాదయ భూములకు కంచె వేయడంతోనే రక్షించడం సాధ్యమవుతుందని, ఆ పని మాత్రం సర్కార్ చేయడం లేదని చెబుతున్నారు. 

 

వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు తహశీల్దార్ కార్యాలయాల్లో జరుగుతాయని చెప్పిన సర్కార్.. వ్యవసాయేతర భూములపై క్లారిటీ ఇవ్వలేదు. ఓపెన్ ప్లాట్లపైనా ధరణి పోర్టల్ లో స్పష్టత లేదు. ఎల్ఆర్ఎస్ పైనా స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం లక్షలాది మంది ప్రజలు ఎల్ఆర్ఎస్ తో ఇబ్బంది పడుతున్నారు. కొందరు వ్యాపారులు చేసిన మోసంతో లక్షలాది మంది అమాయకులు  ప్రభుత్వ భూముల్లో ప్లాట్లు కొన్నారు. అలాంటి వారిని ఏం చేస్తారో కొత్త చట్టంలో చెప్పలేదు. తమకు తెలియకుండానే సర్కార్ భూముల్లో ఫ్లాట్లు కొన్నవారికి రెగ్యులరైజ్ చేస్తారా లేక అక్కడి నుంచి వెళ్లగొడతారే ప్రభుత్వం చెప్పాలంటున్నారు రెవిన్యూశాఖ నిపుణులు. వ్యవసాయేతర భూముల మార్కెట్ విలువపై క్లారిటీ ఇవ్వలేదని, మార్కెట్ విలువ పెంచిచే ప్రజలపై భారం పడుతుందని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

 

వివాదాస్పద భూములను ఎలా గుర్తిస్తారు..కోర్టు కేసులను ఏం చేస్తారన్న దానిపైనా ధరణి పోర్టల్ లో స్పష్టత ఇవ్వలేదంటున్నారు. లక్షలాది ప్లాట్లలో డబుల్ రిజిస్ట్రేషన్ అయినట్లు తెలుస్తోంది. వాటి సంగతి ఏం చేస్తారు... అందులో ఎవరికి ఆ ప్లాట్ కట్టబెడతారో సర్కార్ చెప్పాలంటున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు. సీఎం కేసీఆర్ అద్భుతమని చెబుతున్న స్లాట్ బుకింగ్ విధానం గతంలోనూ ఉందంటున్నారు. ఆన్ లైన్ లో స్లాట్ బుక్ చేసుకుని చాలా మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని చెబుతున్నారు. డాక్యుమెంట్ రైటర్లకు రేట్ ఫిక్స్ చేస్తామని చెప్పారు సీఎం కేసీఆర్. అయితే ఒక్కో డాక్యుమెంట్ రైటర్ ఒక్కోలా ఉంటారని, వారిని  కంట్రోల్ చేయడం సర్కార్ కు అసాధ్యమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

 

వీఆర్వో  వ్యవస్థ రద్దుతో లంచాల పీడ పోయిందని చెప్పారు సీఎం కేసీఆర్. దీనిపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గతంలో వీఆర్వోలు మాత్రం లంచాలు తీసుకున్నారా.. సర్వేయర్లు, తహశీల్దార్లు, ఆర్డీవోలు సచ్చీలుగా అని ప్రశ్నిస్తున్నారు. కోట్లాది రూపాయలు లంచం తీసుకుంటూ ఎమ్మార్వోలు, ఆర్డీవోలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన విషయం ముఖ్యమంత్రికి కనిపించడం లేదా అని జనాలు నిలదీస్తున్నారు. గతంలో రెవిన్యూ అధికారులు సింగిల్ గా ఎవరికి వారు దోచుకునేవారని, ధరణితో అంతా కలిసి బల్క్ గా దోచుకునే అవకాశం ఇచ్చారనే ఆరోపణలు కొన్ని వర్గాల నుంచి వస్తున్నాయి. 

 

రెవిన్యూ కొత్త చట్టం ప్రకారం భూముల విషయంలో అక్రమాలు జరిగితే  అధికారులతే బాధ్యత అంటున్నారు ముఖ్యమంత్రి. అయితే ఇంతకుముందు జరిగిన అక్రమాలకు అధికారులు బాధ్యులు కారా అన్న ప్రశ్న ప్రజల నుంచి వస్తోంది. గతంలో అక్రమాలు చేసిన వారిని ఏం చేస్తరు.. ఇకపై అక్రమాలు చేస్తే ఏం చేస్తరో సీఎం ఎందుకు చెప్పడం లేదని ఆరోపిస్తున్నారు. మొత్తానికి సీఎం కేసీఆర్ గొప్పగా ప్రచారం చేసుకుంటున్నట్లు ధరణి వెబ్ సైట్ తో ప్రజలకు కొత్తగా కలిగే ప్రయోజనం ఏమి లేదనే  అభిప్రాయమే మెజార్టీ వర్గాల నుంచి వస్తోంది. కొత్త రెవిన్యూ చట్టం, ధరణి పోర్టల్ పై ముఖ్యమంత్రి చెప్పేవన్ని ఉత్తరకుమార మాటలేనని విపక్షాలు మండిపడుతున్నాయి.