మోడీ హ్యాట్రిక్ ధీమా వెనుక ఉన్నది ప్రజాభిమానం కాదు.. విపక్షాల వైఫల్యమే!

కేంద్రంలో వరుసగా మూడో సారి మోడీ సర్కార్ కొలువుదీరడం ఖాయమన్న విశ్వాసాన్ని బీజేపీ వ్యక్తం చేస్తున్నది. అయితే  ఆ విశ్వాసం, ధీమా ప్రజాభిమానాన్ని చూరగొనడం వల్ల వచ్చింది కాదనీ, కేవలం విపక్షాల వైఫల్యంతో వచ్చిందేననీ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. దేశంలో  సార్వత్రిక ఎన్నికల ప్రచారం హీట్ పెరిగింది. మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీ హ్యాట్రిక్  విజయాల కోసం, కాంగ్రెస్ రెండు ఓటముల తరువాత ఎలాగైనా గెలిచి అధికారంలోకి రావాలన్న పట్టుదలతో  చెమటోడుస్తున్నాయి. ప్రచారం తీరు, దూకుడు చూస్తే ఎవరైనా కేంద్రంలో మోడీ మరో సారి అధికారంలోకి రావడం ఖాయమనే అంటున్నారు. అయితే పరిశీలకులు, రాజకీయ పండితులు మాత్రం అదంత వీజీ కాదంటున్నారు. వరుసగా పదేళ్ల పాటు అధికారంలో ఉన్న మోడీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి మిత్రపక్షాలను దూరం చేసుకుంది. మళ్లీ ఎన్నికల ముందు మిత్రపక్షాలతో పొత్తు కోసం వెంపర్లాడింది. ఏకపక్ష విజయం పట్ల నిజంగానే అంత ధీమా ఉంటే.. పొత్తుల కోసం ఎందుకు తహతహలాడుతుందన్న ప్రశ్న సహజంగానే అందరిలో ఉదయిస్తుంది. మరో వైపు ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు కాంగ్రెస్ వెనుక ర్యాలీ అయ్యే విషయంలో ముందు వెనుకలాడుతున్నాయి. దీంతో సహజంగానే ఎన్డీయే బలంగా ఉంది. ఇండియా కూటమి బలహీనంగా ఉందన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తం అవుతోంది.

అయితే పరిస్థితి బయటకు కనిపించేంత క్రిస్టల్ క్లియర్ గా లేదనీ బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేకు హ్యాట్రిక్ విజయం సునాయాసంగా దక్కే అవకాశాలు అంతగా కనిపించడం లేదనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

దేశంలో ప్రభుత్వ వ్యతిరేకత చాపకింద నీరులా విస్తరిస్తోందంటున్నారు.  2004లో బీజేపీ భారత్ వెలిగిపోతోంది అనే నినాదంతో  ముందస్తు ఎన్నికలకు వెళ్లిన   బీజేపీకి పరాభవం ఎదురైన సంగతి గుర్తు చేస్తున్నారు. అప్పుడు ఉన్నదీ ఎన్డీయే నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వమే. మిత్రధర్మాన్ని పాటించడంలో కానీ, ప్రజామోద పాలన విషయంలో కానీ మోడీ సర్కార్ కంటే వాజ్ పేయి సర్కారే బెటరనీ పరిశీలకులు చెప్పడమే కాదు. అప్పటి ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నాయకులు కూడా ఎలాంటి  సంకోచం లేకుండా చెబుతారు. అయినా అప్పటి వాజ్ పేయి  ప్రభుత్వం పై వ్యతిరేకత  కాంగ్రెస్ కు కలిసి వచ్చింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్ అధికారంలోకి వచ్చింది. అప్పట్లో వాజ్ పేయి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను ఎన్నికల తరువాత పరిశీలకులు నిశ్శబ్ద విప్లవం అని అభివర్ణించారు.  ప్రస్తుతం మోడీ నేతృత్వంలోని ప్రభుత్వంపై కూడా ప్రజా వ్యతిరేకత నిశ్శబ్ధ ఉందనీ, జనం బాహాటంగా ఆ విషయాన్ని వెల్లడించకపోయినా.. ఎన్నికలలో ఆ వ్యతిరేకత ప్రభావం కనిపించే అవకాశం ఉందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అయోధ్య రామమందిర ని్మాణం,  హిందూత్వ అజెండా,  ఉమ్మడి పౌరస్మృతి వాగ్దానం, తలాక్ రద్దు, జమ్మూ కాశ్మీర్ వంటి అంశాలు తమను మరో సారి అధికార పీఠంపై కూర్చోపెడతాయన్న విశ్వాసం మోడీలో స్పష్టంగా గోచరిస్తోంది.

అయితా ఓ తాజా సర్వే భారతీయులు హిందుత్వ కంటే సర్వమత సామరస్యాన్నే కోరుకుంటున్నారనీ, రామ భక్తి సామ్రాజ్యం కంటే ప్రజాస్వామ్య భారతాన్ని ఇష్టపడుతున్నారనీ తేల్చింది. జనాభాలో దాదాపు 79శాతం మంది బీజేపీ అజెండా హిందుత్వ అయినా తాము బహు మత భారత ప్రజాస్వామ్యాన్నే కోరుకుంటున్నామని కుండ బద్దలు కొట్టేశారు. ఆ తాజా తీసుకున్న శాంపిల్స్ తక్కువే అయి ఉండొచ్చు. కానీ మెజారిటీ ప్రజల మనోభావాలను స్పష్టంగా ప్రతిఫలించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

 ఈ సందర్భంగా 2004 ఎన్నికల ఫలితాన్ని గుర్తు చేస్తున్నారు. అప్పటి ఎన్నికలలో యూపీఏ ప్రధాని అభ్యర్థిగా సోనియా అన్న నినాదంతోనే ఎన్నికలు వెళ్లంది. అప్పట్లో సోనియా విదేశీయతను బీజేపీ చాలా ప్రముఖ అంశంగా ప్రచారం చేసింది. అయినా జనం సోనియా విదేశీయత అంశాన్ని పట్టించుకోలేదు.  ఇప్పుడు అయోధ్య రామమందిర నిర్మాణాన్ని మోడీ సాధించిన ఘన విజయంగా చెప్పుకుంటూ బీజేపీ ప్రజలలోకి వెడుతోంది. అదే సమయంలో మోడీ సర్కార్ వైఫల్యాలను ప్రజలలోకి తీసుకువెళ్లడంలో కాంగ్రెస్, కూటమి  పార్టీలూ పెద్దగా సఫలం కావడం లేదు. అయినా ప్రజలలో రామ మందిర నిర్మాణం పట్ల సానుకూలత కంటే  దేశంలో పెచ్చరిల్లుతున్న విద్వేష భావనల పట్లే ఎక్కువ ఆందోళన వ్యక్తమౌతోందని పరిశీలకులు అంటున్నారు. 

ఇప్పటి ఇండియా ఫ్రంట్ నేతలు, ముఖ్యంగా రాహుల్ గాంధీ బీజేపీ వైఫల్యాలు ప్రజలలోకి తీసుకు వెళ్లడంలో విఫలం అవుతున్నారు.గత ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ యంత్రాలపై విమర్శలు వచ్చాయి. కొన్ని యంత్రాలు కనిపించకండా పోయాయనే వార్తలు వచ్చాయి. దేశంలో విలయతాండవం చేస్తున్న నిరుద్యోగ రక్కసి కారణంగా మధ్యతరగతి ప్రజలలో మోడీ సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమౌతోందని, అలాగే రైతుల ఆదాయం రెట్టిపు అన్న నినాదంతో అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్.. రైతులను దగా చేసిందన్న అభిప్రాయం కూడా బలంగా వ్యక్తం అవుతోంది. ఎలాంటి రాజకీయ మద్దతు లేకుండానే రైతులు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్నారు. మోడీ సర్కార్ ను నిలదీస్తున్నారు. 

నిత్యావసరాల ధరలు ఆకాశానికి చేరుతున్నాయి.వీటిని అదుపు చేయలేక ప్రభుత్వం చేతులెత్తేసింది.  ఉత్పత్తి రంగాలు కార్పొరేట్ల చేతిలోకి వెళ్లాయి.వారికి ప్రభుత్వం అండ ఉండడంతోపాటు ఆర్ధికవ్యవస్థ ను గుప్పిట్లో పెట్టుకొని ఉన్నారు.ఫ లితంగా వారు నిర్ణయించినదే ధరగా మారుతోంది. దీంతో అదుపులేకుండా నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. దీనితో అన్ని వర్గాలలోనూ కేంద్రంలోని మోడీ సర్కార్ పట్ల ఏదో స్థాయిలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అదే సమయంలో  ఈ విషయాలపై ప్రజలలోకి బలంగా దూసుకెళ్లాల్సిన కాంగ్రెస్, దాని మిత్రపక్షాలూ ఘోరంగా విఫలమయ్యాయి.   పంజాబ్,హర్యానాలో రైతుల్లో గిట్టుబాటు బాటు ధర,రైతు చట్టాలు ఉపసంహరణ చేయకపోవడంపై అసంతృప్తి ఉంది. సీఏఏ   అమలులోకి తేవడం వల్ల పౌరసత్వం పై మైనార్టీలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మేధావులు ప్రభుత్వ తీరును విమర్శ చేస్తే అర్బన్ నక్సలైట్లు గా పిలుస్తూ అరెస్టు చేయడంతో ఆయా వర్గాల్లోనూ ఆగ్రహం వ్యక్తం అవుతోంది.   అయితే కేంద్రంలోని మోడీ సర్కార్ పై వ్యక్తమౌతున్న ప్రజాభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో కాంగ్రెస్ కూటమి, ఇతర బీజేపీయేతర పార్టీలూ విఫలం కావడం బీజేపీకి కలిసి వచ్చే అంశంగా మారిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.