జడ్జిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజశేఖర్ రెడ్డి అరెస్ట్
posted on Jul 10, 2021 7:25PM
న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కడప జిల్లాకు చెందిన లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అంశంపై హైకోర్టు సుమోటగా కేసు స్వీకరించి సీబీఐకి విచారణకు అప్పగించింది. రాజశేఖరరెడ్డిని గుంటూరు 4వ అదనపు జూనియర్ సివిల్ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. ఈ నెల 23 వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. దీంతో రాజశేఖరరెడ్డిని జిల్లా జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
గతేడాది న్యాయస్థానాలు కొన్ని కేసుల్లో ప్రభుత్వ వ్యతిరేక తీర్పులు ఇవ్వగా, న్యాయమూర్తులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిచ్చాయి. దీనిపై తీవ్రంగా స్పందించిన ఏపీ హైకోర్టు జడ్జిలపై అవమానకర రీతిలో వ్యాఖ్యలు చేసేవారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సీబీఐని ఆదేశించింది. ఈ దర్యాప్తుకు సహకారం అందించాలంటూ ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే తాజా అరెస్ట్ జరిగినట్టు తెలుస్తోంది.