భక్తిలో మెదడు మారిపోతుంది


ఈ రోజుల్లో మన మెదడులో మెదిలే ప్రతి భావాన్నీ పసిగట్టే అవకాశం ఉంది. అత్యాధునిక స్కానింగ్‌ పరికరాల ద్వారా శాస్త్రవేత్తలు మన మెదడు లోతుల్లో ఏం జరుగుతోందో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి భక్తిలో మునిగితేలే వారి మెదడులో ఎలాంటి చర్యలు ఏర్పడుతూ ఉండవచ్చు? అన్న ప్రశ్న వచ్చింది కొందరు పరిశోధకులకి. వచ్చిందే తడువుగా క్రైస్తవంలో ‘Mormon’ అనే శాఖకి చెందిన కొందరు భక్తుల మీద ఓ ప్రయోగాన్ని చేశారు. ఆ ప్రయోగం తీరు ఇలా సాగింది...

 

భక్తిని రేకెత్తించారు

ప్రయోగంలో భాగంగా క్రమం తప్పకుండా చర్చికి వెళ్లే ఒక 19 మంది భక్తులను ఎన్నుకొన్నారు. వీరిలో 12 మంది మగవారు, ఏడుగరు ఆడవారు ఉన్నవారు. ఒక గంటపాటు వీరి మెదడుని పరీక్షించే ప్రయత్నం చేశారు. ఈ గంటలో కొంతసేపు వారి చర్చి గురించిన విశేషాలు చెప్పారు, కాసేపు ప్రపంచ ప్రసిద్ధ గురువుల మాటలు వినిపించారు, కొన్ని నిమిషాలు బైబిల్‌ నుంచి కొన్ని సన్నివేశాలు చూపించారు, ఇంకొంతసేపు తమ ప్రార్థనా పుస్తకం నుంచి సూక్తులు చదివారు... ఇలా రకరకాలుగా వారిలో భక్తిభావనలు రేకెత్తే ప్రయత్నం చేశారు.

 

పరిశుద్ధాత్మను గమనించారా!

అభ్యర్దులలోని భక్తిని ఒక స్థాయికి రేకెత్తించిన తరువాత - మీకోసం వచ్చే రక్షకుడి గురించీ, మీ కుటుంబాల గురించీ, మీరు చేరుకోబోయే స్వర్గం గురించీ ఊహించుకుంటూ... భక్తి పారవశ్యంలో మునిగిపొమ్మంటూ సూచించారు. ఇలాంటి ప్రతీ సందర్భం తరువాత ‘మీకు పరిశుద్ధాత్మ చేరువలో ఉన్నట్లు భావిస్తున్నారా?’ అంటూ వారిని అడిగి చూశారు. చేరువలో ఉన్నట్లు భావిస్తే ఎలాంటి అనుభూతి కలుగుతోందో తెలియచేయమన్నారు.

 

స్పందనలను గమనించారు

చర్చిలో జరిగే ప్రార్థనా సమావేశంలో చాలాసేపు పాల్గొన్న తరువాత భక్తులు ఎలాంటి అనుభూతికి లోనవుతారో... ఈ ప్రయోగం తరువాత ఇంచుమించుగా అదే తరహా మనఃస్థితికి చేరుకున్నారు. మనసులో ప్రశాంతతని అనుభవించడం, కంటి నుండి నీరు ధారలు కట్టడం వంటి భక్తి పారవశ్యపు స్థితికి అనుభవించారు. ఈ సందర్భంగా వారి శరీరంలోనూ, మెదడులోనూ అనేక మార్పులు జరగడాన్ని గమనించారు పరిశోధకులు. శ్వాస మరింత గాఢంగా మారడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి భౌతిక మార్పులు కనిపించాయి. ఇక మెదడులో అయితే nucleus accumbens, medial prefrontal cortex అనే భాగాలలో స్పష్టమైన స్పందనలు కనిపించాయి. ఇందులో nucleus accumbens భాగాన్ని ఉత్తేజానికి కేంద్రంగా భావించవచ్చు. సంగీతాన్ని వింటున్నప్పుడు, ప్రేమలో మునిగి తేలుతున్నప్పుడు... మనుషులు ఉద్వేగానికి లోనవడానికి కారణం ఈ కేంద్రమేనట. ఇక medial prefrontal cortex అయితే విచక్షణ, విశ్లేషణ, నిర్ణయాధికారం వంటి లక్షణాలను ప్రభావితం చేస్తాయి.

 

అదీ విషయం! మంచో చెడో మనలోని ఆలోచనల తీరు, విచక్షణా శక్తి... భక్తి వల్ల ప్రభావితం అవుతాయని తేలిపోయింది. అయితే ఒకో మతంలోని ఆచారాన్ని బట్టి ఈ తీరు మారే అవకాశం ఉందంటున్నారు పరిశోధకులు. ఉదాహరణకు హిందు, బౌద్ధ మతాలలో ప్రార్థనా రీతులు వేరుగా ఉంటాయి. ఏదైతేనేం... భక్తిభావం అనేది మన మెదడు మీద ప్రభావం చూపుతుందన్న విషయం మాత్రం సుస్పష్టం!          

 

 - నిర్జర.