శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులుకు హైకోర్టులో దక్కని ఊరట

శిరోముండనం కేసులో విశాఖ కోర్టు తనకు విధించిన శిక్షను నిలుపుదల చేయాలంటూ వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూ విచారణను మే 1కి వాయిదా వేసింది. వైసీపీ ఎమ్మెల్సీ, ఆ పార్టీ మండపేట అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి అయిన తోట త్రిమూర్తులుకు విశాఖ కోర్టు శిరోముండనం కేసులో 18 నెలల జైలు శిక్ష, రెండు లక్షల రూపాయల జరిమానా విధించిన సంగతి తెలిసిందే.  అసలింతకీ ఈ శిరోముండనం కేసు ఏమిటి? ఎప్పుడు జరిగింది అన్న వివరాలలోకి వెడితే.. 

1982 ఎన్టీఆర్  తెలుగుదేశం పార్టీని  స్థాపించినప్పుడు   తోట త్రిమూర్తులు ఆ పార్టీలో చేరారు. అసెంబ్లీకి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే అప్పట్లో ఎన్టీఆర్ ఆయనకు అవకాశం ఇవ్వలేదు. దీంతో తోట త్రిమూర్తులు 1994లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా రామచంద్రపురం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అప్పుడు ఆయనకు ఎన్నికల సంఘం గంట గుర్తు కేటాయించింది. అప్పట్లో రామచంద్రపురం నియోజకవర్గంలో త్రిముఖ పోటీ జరిగింది. తెలుగుదేశం, బీఎస్పీ అభ్యర్థులకు తోట త్రిమూర్తులు గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా మూడు వేల ఓట్లపైచిలుకు మెజారిటీతో విజయం సాధించారు. అయితే పోలింగ్ సమయంలో తోట త్రిమూర్తులు రిగ్గింగుకు పాల్పడుతున్నారంటూ ఐదుగురు యువకులు (వీరు బీఎస్సీ బూత్ ఏజెంట్లు) అభ్యంతరం తెలిపారు.  అప్పట్లో పెద్ద ఎత్తున వాగ్వాదం జరిగింది.  పోలింగ్ ముగిసింది. తోటత్రిమూర్తులు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.  రిగ్గింగ్ అంటూ అభ్యంతరం వ్యక్తం చేసిన యువకులపై మాత్రం తోట త్రిమూర్తులు ఆగ్రహం పెంచుకున్నారు.  వారిపై వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలోనే 1996 డిసెంబర్ 29న ఆ ఐదుగురు యువకులనూ తోట త్రిమూర్తులు అనుచరులు పట్టుకుని ఈవ్ టీజింగ్, ఫెన్సింగ్ ధ్వంసం వంటి ఆరోపణలతో వారిని ఊళ్లో ఊరోగించారు. ఆనంతరం వారిలో ఇరువురికి శిరోముండనం చేయించి, కనుబొమ్మలు కూడా గీయించారు. ఈ సంఘటన అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. శిరోముండనం బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ద్రాక్షారామం కేసులో 1997 జనవరి 1న తోట త్రిమూర్తులుపై శిరోముండనం కేసు నమోదైంది. అప్పట్లో ఈ కేసులో అరెస్టైన తోట త్రిమూర్తులు మూడు నెలల పాటు జైలులో కూడా ఉన్నారు. 

 ఐదుగురు దళితయువకులను ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు మనుషులు పట్టుకున్నారు. పొలం చుట్టూ ఫెన్సింగ్ ధ్వంసం, ఈవ్ టీజింగ్ కారణాలు చెప్పి ఆ ఐదుగురు కుర్రాళ్లను ఊళ్లో అవమానిస్తూ ఊరేగించారు. అంతటితో ఆగకుండా అందులో ఇద్దరు కుర్రాళ్లకు గుండు కొట్టించి కనుబొమ్మలు గీయించారు. ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు చేయించిన ఈ పని అప్పట్లో సంచలనంగా మారిపోయింది. ఆ బాధితులైన కుర్రాళ్లు పోలీసులను ఆశ్రయించారు. 1997 జనవరి 1న ద్రాక్షారామం పోలీస్ స్టేషన్ లో మొదటికేసుగా దళితుల శిరోముండనం కేసు నమోదైంది. ఆ తరువాత కేసు దర్యాప్తును పక్కన పెట్టేశారు. అయితే బాధితులు మాత్రం తమకు న్యాయం చేయాలంటూ పోరాటాన్ని కొనసాగించారు. శిరోముండనానికి గురైన ఇద్దరిలో ఒకరు మరణించారు. అయితే మిగిలిన వారు మాత్రం న్యాయపోరాటాన్ని కొనసాగించారు. ఈ కేసుకు సంబంధించి 24 మంది సాక్ష్యులలో 11 మంది మరణించారు. బాధితులు న్యాయం కోసం హైకోర్టును ఇశ్రయించారు. హైకోర్టు కేసును విశాఖ ఎస్సీఎస్టీ కోర్టుకు బదలాయించింది. 

 ఇలా ఉండగా త్రిమూర్తులు ఆ యువకులు దళితులు కాదంటూ ఎస్సీఎస్టీ కేసులో వాదించారు. వారు దళితులు కానందున కేసు విచారణ ఎస్సీఎస్టీ కోరులో జరగడం సరికాదని చెప్పారు. అయితే కోర్టు మాత్రం యువకుల వాదనతో ఏకీభవించి ఇటీవల సంచలన తీర్పు ఇచ్చింది. తోట త్రిమూర్తులకు 18 నెలలు జైలు, రెండు లక్షల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.  ఈ నేపథ్యంలోనే శిక్ష నిలుపుదల కోరుతూ తోట త్రిమూర్తులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే శిక్ష నిలుపుదల చేయాలన్న తోట త్రిమూర్తులు అభ్యర్థనను కోర్టు తిరస్కరించి కేసు విచారణను మే 1కి వాయిదా వేసింది.