కల్వకుంట కవితమ్మకి చాలా టాలెంట్ ఉందండోయ్!

తిమ్మిని బమ్మిని చేసి, మాటలతో మాయ చేసే తండ్రి సపోర్టు బాగా వుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏం మాట్లాడినా నడిచింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆడింది ఆట, పాడింది పాట. మరి ఇలాంటి  పరిస్థితిలో వున్న వారికి తెలివితేటలు సహజంగానే బాగా పెరిగిపోతాయి. ప్రస్తుతం తీహార్ జైల్లో రెస్టు తీసుకుంటున్న కల్వకుంట్ల కవితకి కూడా అలాగే తెలివితేటలు పెరిగిపోయాయి. అందుకే, ఓ ఇంటర్వ్యూలో తాను ముఖ్యమంత్రి అయితే లిక్కర్ని బంద్ చేస్తానని చెప్పిన ఈమె ఆ తర్వాత చక్కగా లిక్కర్ వ్యాపారంలోకే దిగారు. ఆ లిక్కర్ వ్యాపారం ఇక్కడా అక్కడా కాకుండా ఏకంగా ఢిల్లీలో చేయాలని అనుకున్నారు. వందకోట్లు పెట్టుబడి పెట్టి, వెయ్యికోట్లు సంపాదించాలని అనుకున్నారు. అయితే ఆప్లాన్స్ అన్నీ బెడిసికొట్టి ప్రస్తుతం శ్రీకృష్ణ జన్మస్థానానికి చేరుకున్నారు. 
జైలుకు వెళ్ళక ముందు నుంచి దర్యాప్తు సంస్థలకు సహకరించే విషయంలో చాలా తెలివితేటలు ప్రదర్శించిన కల్వకుంట్ల కవిత, ఓ సందర్భంలో తనకు సంబంధించిన 10 సెల్ ఫోన్లను దర్యాప్తు అధికారులకు అందించారు. తాను చాలా పారదర్శకంగా వున్నానని, అందుకే సెల్ ఫోన్లు దర్యాప్తు సంస్థలకు ఇచ్చానని ప్రచారం చేసుకున్నారు. తాను తాను సంప్రదాయినీ, సుప్పినీ, సుద్దపూసనీ కాబట్టే భయం లేకుండా సెల్ ఫోన్లు ఇచ్చానని చెప్పుకొచ్చారు. ఒక మనిషికి పది సెల్ ఫోన్లేంట్రా బాబూ అని చాలామంది అనుకున్నప్పటికీ, ఏమోలే డబ్బున్నవాళ్ళు కదా అనుకుని ఊరుకున్నారు.
ప్రస్తుతం తీహార్ జైల్లో వున్న కవిత బెయిల్ కోసం చేయని ప్రయత్నాలు లేవు. తన కొడుకు టెన్త్ పరీక్షలు రాస్తున్నాడు కాబట్టి నేను తల్లిగా పక్కనే వుండాలనే పాయింట్ పైకి తెచ్చారు. వర్కవుట్ కాలేదు. ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి, తన పార్టీలో తాను స్టార్ కాంపైనర్ కాబట్టి, తాను ప్రచారం చేస్తే జనం కళ్ళు మూసుకుని తమ పార్టీకి ఓటేస్తారు కాబట్టి బెయిల్ ఇవ్వాలని కోరారు.. ఇదీ వర్కవుట్ కాలేదు.. కవితకి చాలా పెద్ద నెట్ వర్క్ వుందని, ఆమెకి బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తును ప్రభావితం చేసే ప్రమాదం వుందని దర్యాప్తు సంస్థలు కోర్టు ముందు వాదిస్తున్నాయి. సోమవారం నాడు ఢిల్లీ కోర్టులో ఇదే తరహా వాదన జరిగింది. ఈ వాదన సందర్భంగా, ఇప్పటి వరకు కల్వకుంట్ల కవితమ్మ సెల్‌ఫోన్లకు సంబంధించిన ఒక రహస్యం బయటపడింది. 
కల్వకుంట్ల కవితమ్మ తన పది సెల్ ఫోన్లను దర్యాప్తు సంస్థలకు ఇచ్చారు కాబట్టి, ఆమె చాలా పారదర్శకంగా వుందని అనుకుంటూ వస్తున్నాం కదా.. అంత సీన్ లేదు.. కవితమ్మ తన ఫోన్లను దర్యాప్తు సంస్థలకు ఇచ్చేముందు ఆ ఫోన్లన యాసిడ్ వేసి క్లీన్ చేసినంత నీట్‌గా ఫార్మాట్ చేసి ఇచ్చారట. సెల్ ఫోన్లు ఎవరైనా ఎందుకు అడుగుతారు? వాటిలో వుండే డేటా ఆధారంగా కేసును దర్యాప్తు చేయడానికి. మరి, సెల్ ఫోన్లని చక్కగా ఫార్మాట్ చేస్తే అందులో ఇంకేం వుంటుంది బూడిద? ఏ తప్పూ చేయకపోతే ఆ ఫోన్లను ఎందుకు ఫార్మాట్ చేసినట్టు? ఈ విషయాన్నే దర్యాప్తు సంస్థలు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇక్కడ కూడా కవిత అండ్ కో తన తెలివితేటల ప్రదర్శన చేసింది. కవితగారు తన ఫోన్లను ఫార్మాట్ చేయలేదని, ఆమె తన 10 ఫోన్లను తన దగ్గర పనిచేసేవారికి ఇచ్చారని, వారు ఫార్మాట్ చేసి ఉపయోగించుకుంటున్నారని చెప్పుకొచ్చారు. అబద్ధం చెప్పినా అతికినట్టు వుండాలన్న విషయం కవిత అండ్ కో మర్చిపోయినట్టుంది. ఫోన్ల విషయంలోనే ఇంత టాలెంట్ చూపించిన కవిత, ఇంకా ఎన్నెన్ని విషయాల్లో తన టాలెంట్ చూపించారో.. ముందు ముందు ఇంకెన్ని బయటపడనున్నాయో!