నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల " కుప్ప"

నీళ్లు నకిలీ..పాలు నకిలీ..తినే తిండి నకిలీ ఇలా దేశం "నకిలీ భారతం" అయిపోయింది. ఒరిజనల్‌ను అచ్చుగుద్దినట్టు దించేయడంలో మనవాళ్లు ఎక్స్‌పర్ట్స్‌ అని ప్రపంచం మొత్తానికి తెలుసు. ఒక్క పాలు, నీళ్లే కాదు, సర్టిఫికేట్లు, పాస్‌పోర్ట్‌లు ఇలా ఒక్కటేంటి అన్నిటా నకిలీ..నకిలీ . ఇప్పుడు ఈ కోవలోకి నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌లు వచ్చి చేరాయి. ఈ మాట ఏ సర్వేలోనో తేలింది కాదు. సాక్షాత్తూ కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నోటి వెంట వచ్చిన మాటలు. దేశంలోని డ్రైవింగ్ లైసెన్స్‌ల్లో మూడింట ఒక వంతు నకిలీవేనట. 18 కోట్లకు పైగా లైసెన్స్‌లను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం ..ఇందులో 5.4 కోట్ల లైసెన్స్‌లు నకిలీవేనని తేల్చింది.

 

మనదేశంలో డ్రైవింగ్ లైసెన్స్‌‌లు పొందటం చాలా సులభం. డ్రైవింగ్ రాకపోయినా పర్వాలేదు పచ్చనోటు ఉంటే చాలు లైసెన్స్‌ వచ్చేస్తుంది. రాజకీయ నాయకులో..సెలబ్రిటీలో అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్టీఏ ఆఫీసులకు వెళ్లాల్సిన పని కూడా లేదు.  లైసెన్స్ నేరుగా మీ ఇంటికే వస్తుంది.  లైసెన్స్‌ కోసం చాలా మంది బ్రోకర్లపై ఆధారపడుతుంటారు. ఆర్టీవో కార్యాలయం చుట్టూ తిరగటం ఇష్టం లేనివారు, సమయం దొరకని వాళ్లు, లైసెన్స్ ఎలా పొందాలో తెలియని వాళ్లు అనేక మంది మధ్యవర్తులను ఆశ్రయిస్తుంటారు. వీరు ప్రజల అమాయకత్వాన్ని, అవసరాన్ని సొమ్ము చేసుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. రవాణా శాఖ అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్న కొంతమంది " బ్రోకర్లు " కేవలం గంటల వ్యవధిలోనే లైసెన్స్‌లు ఇప్పిస్తున్నారు.

 

లైసెన్స్ వచ్చిందన్న ఆనందంలో అది అసలుదో..నకిలీదో తెలుసుకునే ప్రయత్నం గాని అవసరం గాని మన జనానికి లేదు. ఒకే సంఖ్యతో కూడిన లైసెన్స్‌లను వివిధ దరఖాస్తుదారులకు జారీ చేసిన సందర్భాలు కూడా ఉన్నట్లు ప్రభుత్వ అధ్యయనంలో వెల్లడైంది. చట్టాల ఉల్లంఘన, ఏజెంట్లు చేసే మోసం, సక్రమంగా లేని ఆర్టీవో డేటాబేస్‌ల కారణంగా డూప్లికేట్ లైసెన్స్‌ల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నట్టు తెలుస్తోంది. దేశంలోని వివిధ రవాణా శాఖ మంత్రులతో ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశంలో నితిన్ గడ్కరీ బోగస్ లైసెన్స్‌ల విషయంలో ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌లు, రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు త్వరలోనే రోడ్డు రవాణా, భద్రత బిల్లును అమలు చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.  ఏటా రోడ్డు ప్రమాదాల్లో 1.5 లక్షల మంది మరణిస్తున్నారని ఆయన అన్నారు. ఈ బిల్లు ద్వారా రోడ్డు రవాణా వ్యవస్థనే సమూలంగా ప్రక్షాళన చేయవచ్చని గడ్కరీ తెలిపారు.

 

అయితే నకిలీ లైసెన్స్‌లతో పట్టుబడిన వారిపై ప్రస్తుతం విధిస్తున్న శిక్షలు ఏ మాత్రం కఠినంగా లేకపోవడంతో పరిస్థితిలో మార్పు రావడం లేదు. ప్రస్తుతానికి బోగస్ డ్రైవింగ్ లైసెన్స్‌లు కలిగిఉన్న వారిపై రూ.500 పెనాల్టీతో పాటు గరిష్టంగా మూడు నెలల జైలుశిక్ష విధిస్తున్నారు.  త్వరలో జరిమానాను రూ.10 వేలకు, శిక్షా కాలాన్ని గరిష్టంగా ఏడాదికి పెంచనున్నారు. ఒక వేళ బాలలు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే వాహన యజమాని లేదా ఆ బాలుడి సంరక్షకులపై గరిష్టంగా రూ. 20 వేల జరిమానాతో పాటు మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించనున్నారు. అంతేకాదు వాహన రిజిస్ట్రేషన్‌ను సైతం రద్దు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నది.