ఇవి తింటే పీడకలలు ఖాయం!

 

మనిషికి ఏమున్నా లేకపోయినా ఫర్వాలేదు కానీ ఆహారం, నిద్రా లేకపోతే మాత్రం బతకడం కష్టమే. అందుకే ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖమెరుగదు అంటారు పెద్దలు. నిజమే! హాయిగా పడుకోవాలనీ, ఆ నిద్రలో ఎలాంటి పీడకలలూ రాకుండా ఉండాలని ఎవరికి మాత్రం తోచదు. కానీ కొన్ని రకాల ఆహారపదార్థాలను తింటే మాత్రం పీడకలలు వస్తాయని అంటున్నారు నిపుణులు. మరి అవి ఏంటో…

 

మద్యం:-

చాలామంది మందు కొడితే హాయిగా నిద్రపట్టేస్తుంది అనుకుంటారు. కానీ మద్యం వల్ల నిద్ర పట్టదు సరికదా! పట్టినా కూడా పీడకలలు ఖాయం అంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే మనం నిద్రపోయేటప్పుడు REM (rapid eye movement) అనే దశ ఉంటుంది. ఈ దశలోనే మనం కలలను కంటాము. మోతాదు మించిన మద్యం ఈ దశని చెడగొడుతుందట. ఫలితంగా పీడకలలు తప్పవంటున్నారు.

 

చాక్లెట్‌:-

పడుకునే ముందు హాయిగా ఓ చాక్లెట్‌ని ఆస్వాదించి పడుకుందామని చాలామంది అనుకుంటారు. కానీ చాక్లెట్‌లో కెఫిన్‌ అనే పదార్థం చాలా అధికంగా ఉంటుందనీ... ఆ కెఫిన్ మన నిద్రను పాడుచేస్తుందన్న విషయాన్ని మర్చిపోతారు. ఆ మాటకి వస్తే చాక్లెట్‌ మాత్రమే కాదు- కెఫిన్‌ అధికంగా ఉండే టీ, కాఫీ, కూల్‌డ్రింక్స్ లాంటి పదార్థాలన్నీ కూడా పీడకలలకు దారితీస్తాయి.

 

మషాళాలు:-

ఈ రోజుల్లో చాలామంది మంచిగా పార్టీ చేసుకుని ఓ బిర్యానీ పొట్లాన్నీ పొట్టన వేసుకుని పడుకుంటున్నారు. బిర్యానీనే కాదు వేపుళ్లు, మషాళాలు, బేకరీ పదార్థాలు లాంటివాటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎందుకంటే మన జీర్ణవ్యవస్థకీ నిద్రకీ చాలా దగ్గర సంబంధం ఉంది. కష్టమైన ఆహారాన్ని జీర్ణం చేసుకునేందుకు శరీరం ఇబ్బందిపడుతుంటే, మెదడు సుఖంగా ఎలా ఉంటుంది. దాని మానాన అది పీడకలలు కంటుంది కదా!

 

ఐస్‌క్రీం:-

రోజంతా పడ్డ శ్రమకి ప్రతిఫలంగా ఓ కప్పుడు ఐస్‌క్రీంని ఆస్వాదిద్దాం అనుకుంటాం. కానీ చల్లగా కనిపించే ఐస్‌క్రీం మన బుర్రని వేడెక్కించేయగలదు. అందుకు కారణాలు లేకపోలేవు. ఐస్‌క్రీంని పాలతో తయారుచేస్తారు. వయసు పెరిగేకొద్దీ మనలో ఈ పాలపదార్థాలని జీర్ణం చేసుకునే సామర్థ్యం తగ్గిపోతుంటుంది. పైగా ఐస్‌క్రీంలో తీపి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అది మనలోని మెటబాలిజం (జీవక్రియలు) మీద ప్రభావం చూపుతుంది. ఇక చల్లటి ఐస్‌క్రీంని ఒంటికి తగినట్లు వేడిగా మార్చుకునేందుకు కూడా శరీరం ఇబ్బంది పడుతుంది. వీటన్నింటి ఫలితం – పీడకలలే!

అదండీ సంగతి! కమ్మటి కలలు కనే నిద్ర పట్టాలంటే మనం పడుకునే ముందు ఏ ఆహారం తీసుకుంటున్నామో కూడా ముఖ్యమే. ఆ ఆహారం కూడా నిద్రపోయేందుకు ఓ రెండు గంటల ముందరే తినేయాలని సూచిస్తున్నారు!

- నిర్జర.