సాయం విలువ!

 

చలికాలం. పైగా ఆ రోజు మంచు కూడా విపరీతంగా కురుస్తోంది. ఉదయం ఎనిమిదిగంటలైనా కూడా వెలుగు జాడ కనిపించడం లేదు. జనం ఇళ్లలోంచి అడుగుపెట్టే సాహసమే చేయడం లేదు. ఎవరి ఇంట్లో వాళ్లు అలా వెచ్చగా ఉండగా ఒక నడివయసు మనిషి మాత్రం వీధి పక్కనే కూర్చుని వణుకుతూ ఉన్నాడు. ఇంతలో...ఎక్కడి నుంచో ఒక కారు వచ్చి అక్కడ ఆగింది. అందులోంచి ఒక యువతి బయటకు దిగింది. ఆ నడివయసు మనిషి వంక చూడగానే ఆమె మనసు కరిగిపోయినట్లుంది. నిదానంగా అతని దగ్గరకు వెళ్లింది. ‘‘మీరు చలికి బాగా వణికిపోతున్నట్లు ఉన్నారు!’’ అని అడిగింది ఆ యువత. ఆ మాటలకి పెద్దాయన ఉలిక్కిపడ్డాడు. తనని పలకరించిన యువతిని ఓమారు తేరిపార చూశాడు. ‘సమస్యే లేదు. ఈవిడ బాగా డబ్బున్నావిడే. నా పేదరికాన్ని ఎగతాళి చేయడానికే ఇలా అడుగుతోంది,’ అనుకున్నాడు. అందుకే ‘‘ఆహా బ్రహ్మాండంగా ఉన్నాను. మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోతే ఇంకా ప్రశాంతంగా ఉంటాను,’’ అంటూ ఈసడించుకున్నాడు.

ఆ మాటలకు ఆమె పెద్దగా బాధపడినట్లు లేదు. పైగా ‘‘మీరు ఆకలిగా ఉన్నారా!’’ అని అడిగింది. ఆ ప్రశ్నకి పెద్దాయన మరింత మండిపడ్డాడు. ‘‘అబ్బే ఇప్పుడే కడుపునిండా భోజనం చేసి వచ్చాను. నేను వదలేసిన తిండితో ఇంకో నలుగురు కడుపు నిండుతుంది,’’ అని నిష్టూరమాడాడు. పెద్దాయన ఎగతాళిని ఆ యువతి అంతగా పట్టించుకోలేదు సరికదా... ఆయన దగ్గరకి వెళ్లి భుజం మీద చేయి వేసి ‘‘పదండి. ఆ హోటళ్లో తింటూ మాట్లాడుకుందాం!’’ అంటూ ఎదురుగుండా ఉన్న హోటల్లోకి ఆయనను నడిపించుకుని వెళ్లింది.

ఆ యువతి చర్యతో పెద్దాయనకి నోటమాట రాలేదు. హోటల్ మేనేజరు కూడా ఏదో అనబోయాడు. కానీ యువతి ఖరీదైన దుస్తులు చూసి లేని మర్యాదని తెచ్చిపెట్టుకున్నాడు. ‘‘ఏం కావాలి మేడం!’’ అంటూ వారి టేబుల్‌ దగ్గరకి వచ్చి వినయాన్ని ఒలకబోశాడు. ‘‘ఈయనకి ఏం కావాలో అన్నీ తీసుకురండి,’’ అని హుకుం జారీచేసింది యువతి.

యువతి చలవతో పెద్దాయన కడుపునిండా తిన్నాడు. ఆకలి తీరాక, కాస్త వేడివేడి టీ నోట్లో పోసుకున్నాడు. ‘‘ఇదంతా మీరు నాకెందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు!’’ అన్నాడు పెద్దాయన కాస్త కుదుటపడిన తర్వాత. ‘‘మీరు ఇంకా నన్ను గుర్తుపట్టినట్లు లేదు జేమ్స్!’’ అంది యువతి చిరునవ్వుతో.

ఆ యువతి తనని పేరు పెట్టి పిలవడంతో పెద్దాయన ఆశ్చర్యపోయాడు. ఆయన ఆశ్చర్యం నుంచి తేరుకునేలోగా ఆ యువతి తన కథని ఆయనకు గుర్తుచేసేందుకు సిద్ధపడింది. ‘‘సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం నేను కాలేజి చదువు ముగించుకుని, ఉద్యోగం కోసం ఈ ఊరికి వచ్చాను. ఎంత తిరిగినా నాకు ఉద్యోగం దొరకనేలేదు. చేతిలో ఉన్న డబ్బు కాస్తా అయిపోయింది. అద్దె కట్టలేదని ఒకరోజు ఇంట్లోంచి కూడా నడివీధిలోకి గెంటేశారు. నిలువ నీడ లేదు, విపరీతమైన ఆకలి. ఆ ఆకలిలో ఏం చేయాలో తెలియక ఇదే హోటల్‌ ముందుకి వచ్చి నిలబడ్డాను...’’ ‘‘అవును ఆ రోజు నాకు గుర్తుంది. అప్పుడు నేను ఇదే హోటల్లో చిన్న ఉద్యోగం చేస్తున్నాను. నీకు ఏదన్నా ఆహారం పెడదామంటే దానికి హోటల్‌ నిబంధనలు ఒప్పుకోవని చెప్పాను...’’ అంటూ గుర్తుచేసుకున్నాడు పెద్దాయన.


‘‘అయినా మీరు నన్ను ఈసడించుకోలేదు. నాకు ఆహారం ఇచ్చి, ఆ బిల్లు మీ జేబులోంచి చెల్లించారు. అనుకోకుండా నాకు ఓ చిన్న ఉద్యోగం దొరికింది. ఆ ఉద్యోగంలో అంచెలంచెలుగా ఎదుగుతూ సొంతగా ఓ కంపెనీ పెట్టుకునే స్థాయికి ఎదిగాను. ఈ ఇరవై ఏళ్లలో ఇటువైపుగా వచ్చిన ప్రతిసారీ మీరు కనిపిస్తారేమో కృతజ్ఞతలు చెప్పుకుందామని అనుకున్నాను. మీ గురించి ఎంతగా వాకబు చేసినా లాభం లేకపోయింది. చివరికి ఇవాళ మీరు కనిపించారు. ఇక నుంచి మీకు ఏ లోటూ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది,’’ అంటూ తన విజిటింగ్ కార్డుని అతని చేతిలో పెట్టింది ఆ యువతి.

‘‘అబ్బే ఆ రోజు నేను నీకు చేసిన సాయం చాలా చిన్నదే! అలాంటి సాయం నేను చాలామందికి చాలాసార్లు చేశాను. అంత చిన్న సాయానికి నువ్వు ఎందుకింతగా తిరిగి చెల్లించుకోవాలని అనుకుంటున్నావు?’’ అని అడిగాడు పెద్దాయన.

‘‘కొన్ని సాయాలు మనకి చాలా చిన్నవిగానే తోచవచ్చు. కానీ ఆ చిన్న పనుల ఇతరుల మనసులో కొత్త ఆశలని నింపుతాయి. ఆ రోజు జరిగిన సంఘటనలతో నాకు మానవత్వం మీద నమ్మకం పోయింది, జీవితం మీద విరక్తి కలిగింది. కానీ మీరు చేసిన పనితో మనుషులలో మంచితనం ఇంకా మిగిలి ఉంది అన్న నమ్మకం కలిగింది. ఎలాగైనా జీవించాలన్న ఆశ ఏర్పడింది. మీరు కల్పించిన ఆశకీ, నమ్మకానికీ తిరిగి ఎంత చెల్లించినా తక్కువే కదా!,’’ అంటూ చిరునవ్వుతో బదులిచ్చింది ఆ యువతి. నిజమే కదా!!!

(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)