లాయర్ నే బురిడీ కొట్టించిన నైజీరియన్ నెరజాణ
posted on Aug 14, 2021 6:31PM
సైబర్ నేరాల గురించి మన పోలీసులు ఎంతగా అప్రమత్తం చేస్తున్నా దాదాపుగా రోజుకో కొత్తరకం నేరం వెలుగుచూస్తూనే ఉంది. అది కూడా పోలీసుల ఇళ్లలోనే దొంగలు పడ్డట్టు... న్యాయవాదుల ఖాతాల్లోంచే తెలివిగా డబ్బులు తస్కరించే కిలాడీలు హైదరాబాద్ లో చాలా బాగా పెరిగిపోయారు. తాజాగా హైదారాబాద్ లోని మేడిపల్లకి చెందిన ఓ మహిళా న్యాయవాది నైజీరియన్ కిలాడీ విసిరిన సైబర్ వలకు చిక్కింది. 12,862 డాలర్లు (రూ. 9.26 లక్షలు) సమర్పించుకుంది. విషయం ఆలస్యంగా తెలిశాక లబోదిబోమనడం ఆ న్యాయవాది వంతయింది.
అసలెలా జరిగిందంటే...
మేడపల్లికి చెందిన మహిళా న్యాయవాది రాధిక బల్లా... ఫేస్ బుక్ లో టీనా హ్యాన్సన్ అనే నైజీరియన్ యువతితో చాటింగ్ మొదలుపెట్టింది. ఆమెతో చాటింగ్ కాస్తా రాధిక ఖాతాకే ఎసరు తెచ్చింది. స్నేహంగా ముందుకెళ్తున్న రాధికను బాగా వాడేయాలని టీనా డిసైడైంది. ఒకానొక సందర్భంలో తన ప్రపోజల్ ను రాధిక ముందు పెట్టింది. తమకు బేస్ లైన్ సొల్యూషన్స్ అనే కంపెనీకి ఉందని, దానికి సంబంధించిన ఓ కేసును కోర్టులో వాదించేందుకు గాను న్యాయవాదిగా వ్యవహరించాలని టీనా కోరింది. అయితే భారీ ఎత్తున పారితోషికం లభించే ఆ కేసు వాదించే అవకాశం రావాలంటే ముందుగా కొంత రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని సూచించింది. టీనా మాటలు నమ్మిన రాధిక ఆమె సూచించిన బ్యాంకు ఖాతాకు అక్షరాలా రూ. 9.26 లక్షలు ట్రాన్స్ ఫర్ చేసింది. ఇక డబ్బు ట్రాన్స్ ఫర్ అయ్యాక ఫోన్ చేస్తే రాధిక ఫోన్ నెంబర్ బ్లాక్ చేసినట్టు చెబుతోంది. ఆ తరువాత ఫేస్ బుక్ లో వెతగ్గా... టీనా అకౌంట్ కూడా డిలీట్ చేసుకున్నట్టు కనిపించింది.
నైజీరియన్ నెరజాణ టీనా హ్యాన్సన్ చేసిన మోసానికి.. న్యాయవాది రాధిక సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. మన సైబరాబాద్ పోలీసులు ఇలాంటి నేరాల గురించి ఎంతో అప్రమత్తం చేస్తున్నా... న్యాయవాదులే బలైపోతుండడం విచిత్రమే.