తెలంగాణలో మద్యం విక్రయాలు సరికొత్త రికార్డు

 

తెలంగాణ రాష్ట్రంలో మద్యం విక్రయాలు చరిత్రలోనే సరికొత్త రికార్డులను సృష్టించాయి. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డిసెంబర్ చివరి వారంలో రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలు  ఊహించని స్థాయికి చేరాయి. కేవలం ఆరు రోజుల వ్యవధిలోనే 1,350 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరగడం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ గణాంకాల్లో నమోదైంది. ముఖ్యంగా డిసెంబర్ 30, 31 తేదీల్లో మాత్రమే ₹750 కోట్ల మేర మద్యం అమ్ముడుపోవడం విశేషం. కేవలం ఆరు రోజుల్లోనే ఇన్ని వేల కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరగడంతో అధికారులు ఆశ్చర్య చకితులయ్యారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రాష్ట్రంలోని మద్యం దుకాణాలు, బార్లు జనంతో కిటకిటలాడాయి. ఏ మద్యం షాపు, బార్ల ముందు చూసిన కూడా భారీ క్యూలు, రద్దీ ఉన్న దృశ్యాలే కనిపించాయి.
 
మద్యం దుకాణాల ద్వారా భారీ విక్రయాలు

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,620 మద్యం దుకాణాల ద్వారా సుమారు 8.3 లక్షల ఐఎంఎఫ్ఎల్  కేసులు, 7.78 లక్షల బీర్ కేసులు విక్రయమైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి బీర్ విక్రయాల్లో 107 శాతం పెరుగుదల నమోదు కావడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. నగర యువత, ఐటీ ఉద్యోగులు, న్యూ ఇయర్ పార్టీల కారణంగా బీర్ డిమాండ్ విపరీతంగా పెరిగిందని ఎక్సైజ్ శాఖ అధికారులు పేర్కొంటున్నాయి. ఇక కేవలం డిసెంబర్ నెల మొత్తాన్ని పరిశీలిస్తే, రాష్ట్రంలో మొత్తం మద్యం విక్రయాలు ₹5,102 కోట్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే డిసెంబర్ నెలలో ఈ విక్రయాలు ₹3,500 కోట్లుగా మాత్రమే ఉండగా, ఈసారి భారీగా పెరగడం గమనార్హం. ఇది ప్రజల ఖర్చు ధోరణిలో వచ్చిన మార్పును, అలాగే పండుగలు–వేడుకల ప్రభావాన్ని స్పష్టంగా చూపిస్తోంది.

హైదరాబాద్, రంగారెడ్డి అగ్రస్థానం

మద్యం విక్రయాల్లో రెండు జిల్లాలు ఫోటా పోటీగా పోటీ పడ్డాయి.. లిక్కర్ అమ్మకాలలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు అగ్రస్థానంలో నిలిచాయి. కార్పొరేట్ సంస్కృతి, నైట్ లైఫ్, పెద్ద సంఖ్యలో పార్టీలు జరగడం వల్ల ఈ జిల్లాల్లో విక్రయాలు అత్యధికంగా నమోదయ్యాయని అధికారులు తెలిపారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డిసెంబర్ 31న మద్యం దుకాణాలకు అర్ధరాత్రి వరకు, బార్లకు రాత్రి 1 గంట వరకు పనిచేసేందుకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ ప్రత్యేక అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఎక్సైజ్ శాఖ తీసుకున్న ఈ నిర్ణయమే విక్రయాలపై కీలక ప్రభావం చూపిందని అధికారులు అంచనా వేస్తున్నారు. సరఫరా పరంగా కొన్ని ప్రాంతాల్లో స్వల్ప సమస్యలు తలెత్తినా, సరిపడా నిల్వలు, ప్రత్యేక తనిఖీలు, అదనపు సిబ్బంది ఏర్పాటు చేయడం వల్ల విక్రయాలు సజావుగా జరిగాయని ఎక్సైజ్ అధికారులు స్పష్టం చేశారు.

2024–25 ఆర్థిక సంవత్సరంలో రికార్డు వ్యాపారం

ప్రస్తుత 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు తెలంగాణలో మద్యం విక్రయాలు రూ.34,600 కోట్లకు చేరుకున్నాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా అధికం కావడం రాష్ట్ర ఖజానాకు భారీ ఆదాయం తీసుకొస్తోంది. మొత్తంగా చూస్తే, న్యూ ఇయర్ వేడుకలు తెలంగాణ మద్యం మార్కెట్‌కు బూస్ట్‌గా మారాయని, రాబోయే రోజుల్లో కూడా ఈ ట్రెండ్ కొనసాగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu