జనవరి 3 నుంచి రాష్ట్రపతి నిలయంలో రెండో ఉద్యాన్ ఉత్సవ్

 

ప్రజా భాగస్వామ్యం, పర్యావరణ స్పృహను ప్రోత్సహించే ప్రయత్నాల్లో భాగంగా భారత రాష్ట్రపతి శీతాకాల నివాసమైన  రాష్ట్రపతి భవన్‌లో 2026 జనవరి 3 నుంచి 11 వరకు ‘ఉద్యాన్ ఉత్సవ్’ రెండవ ప్రదర్శన జరగనుంది. రాష్ట్రపతి నిలయాలను పౌర భాగస్వామ్యానికి, పర్యావరణ స్పృహకు కేంద్రాలుగా మార్చాలనే గౌరవ భారత రాష్ట్రపతి ఆకాంక్ష మేరకు ఈ ఉత్సవం నిర్వహిస్తున్నారు. దీనిని రాష్ట్రపతి నిలయం ఆధ్వర్యంలో  వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ నిర్వహిస్తుండగా.. ‘మేనేజ్’ సహకారం అందిస్తోంది.‘ఉద్యాన్ ఉత్సవ్ 2026’లో సుమారు 120 ప్రదర్శకులతో 50 నేపథ్య స్టాళ్లను ఏర్పాటు చేశారు. 


ఇవి వ్యవసాయ రంగంలో ఆవిష్కరణలు, వ్యాపార అవకాశాలు, విలువ ఆధారిత ఉత్పత్తులకు వేదికగా నిలుస్తాయి. ఇక్కడ సందర్శకులు వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించే గ్రీన్‌ నాలెడ్జ్‌ హబ్‌..  పోషక విలువలున్న చిరుధాన్యాల ఉత్పత్తులను ప్రొత్సహించే మిల్లెట్ మండి, స్టార్టప్ హబ్.. సేంద్రీయ ఉత్పత్తులు, జీఐ ట్యాగ్ ఉత్పత్తులు, గిరిజన హస్తకళల ప్రదర్శనకు ఎకో బజార్.. బయో ఇన్‌పుట్స్‌, నర్సరీ మొక్కల విక్రయానికి ప్లాంట్ అండ్ ప్రొడ్యూస్.. 59 రైతు ఉత్పత్తిదారుల సంఘాల నుంచి నేరుగా ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు జోన్,ఫామ్-2-ఎంటర్‌ప్రైజ్ వంటి వివిధ విభాగాలను చూడవచ్చు. ఈ ఉత్సవంలో భాగంగా  ప్రతిరోజూ వైవిధ్యభరితమైన సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు. 

వీటిలో  భరతనాట్యం, కథక్,  కూచిపూడి వంటి శాస్త్రీయ నృత్యాలు..పేరిణి శివతాండవం, ఒగ్గు డోలు, మాధురి నృత్యం వంటి ప్రాంతీయ కళారూపాలు.. సంగీత కచేరీలు, హరికథ, బుర్రకథ వంటి వారసత్వ కళలు,  వివిధ రకాల సంగీత కచేరీలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ ప్రదర్శనలో సమాజ భాగస్వామ్య ముఖ్య ఆకర్షణగా నిలవనుంది. కుండల తయారీ, కూరగాయలపై చెక్కడాలు, విత్తన బంతుల తయారీ వంటి నేర్చుకుంటూ చేసే పనులు ద్వారా యువతలో పర్యావరణ పరిరక్షణపై అవగాహనను పెంపొందించేందుకు రూపొందించారు. 

ఆధునిక వ్యవసాయ పద్ధతులైన హైడ్రోపోనిక్స్, ఆక్వాపోనిక్స్, సహజ రంగుల వెలికితీతపై ప్రత్యక్ష ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. క్విజ్ పోటీ, ‘‘విష్‌ ట్రీ-మై ప్రామిస్‌ టు ఇండియా’’ వంటి ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఈ ఉత్సవం జ్ఞానాన్ని పంచుకునే వేదికగా కూడా నిలవనుంది. ఇందులో భాగంగా నిపుణుల ఆధ్వర్యంలో సహజ, సేంద్రీయ వ్యవసాయం, వాతావరణ మార్పులకు తట్టుకునే వ్యవసాయ సాంకేతికతలు, చిరు ధాన్యాల విలువ ఆధారిత ఉత్పత్తులు వంటి అంశాలపై ఐఐఎంఆర్‌, ఐఐఓఆర్‌ ఏపీఈడీఏ వంటి ప్రముఖ సంస్థలతో వర్క్‌షాప్‌లు, పరస్పర చర్చా సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు చామంతి, సెలోసియా, బంతిపూలు, పాయిన్‌సెట్టియాలు ఇతర కాలానుగుణ పూలతో రూపొందించిన విభిన్న నేపథ్య పుష్ప అలంకరణలు ఏర్పాటు చేశారు. సృజనాత్మకంగా అలంకరించిన  పుష్ప ప్రదర్శనలు ఉత్సాహభరితమైన పండుగ వాతావరణాన్ని కలిగిస్తాయి.

ఈ ఉద్యాన్ ఉత్సవ్ అందరికీ ఉచితంగా ప్రవేశాన్ని కల్పిస్తోంది. ప్రతిరోజూ ఉదయం 10.00 గంటల నుంచి రాత్రి 8.00 గంటల వరకు రాష్ట్రపతి నిలయం ప్రధాన పచ్చిక బయళ్లలో జరుగుతుంది. ప్రజలకు  గేట్ నంబర్ 2 ద్వారా ప్రవేశం కల్పించారు. సందర్శకులు తమ ప్రవేశాన్ని రాష్ట్రపతి భవన్ విజిట్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు లేదా విజిటర్ ఫెసిలిటేషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన కియాస్క్‌ల వద్ద నమోదు చేసుకోవచ్చు.
 
11 రోజుల పాటు నిర్వహించనున్న ఉత్సవానికి సంబంధించిన వివరాలను  రాష్ట్రపతి నిలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో   నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ (మేనేజ్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ సాగర్ హనుమాన్ సింగ్, వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ జాయింట్ డైరెక్టర్  జస్బీర్ సింగ్, మేనేజ్‌ డైరెక్టర్ డాక్టర్ శైలేంద్ర, రాష్ట్రపతి నిలయం మేనేజర్ డాక్టర్ కే రజనీ ప్రియ మీడియాకు తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ అనుగు నరసింహారెడ్డి, రాష్ట్రపతి నిలయం ప్రజా సంబంధాల అధికారి  కుమార్ సమ్రేష్ కూడా ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.


 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu