కాంగ్రెస్ దూకుడు

కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. కాంగ్రెస్ పార్టీ అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇందుకోసం గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత పటిష్ట పరిచేందుకు చర్చలు తీసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రసంగించిన తీరు....ప్రవర్తించిన విధానంతో కాంగ్రెస్ పార్టీకి తిరిగి జవసత్వాలు వచ్చినట్లేనని సీనియర్లు భావిస్తున్నారు. లోక్‌సభలో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంతో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకుల్లో ఆశలు రెట్టింపు అయ్యాయి.  రాహుల్ గాంధీ లోక్‌సభలో చేసిన ప్రసంగంతో యావత్ దేశం తమ వైపు చూస్తోందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు.

 

 

నిజానికి అంపశయ్య మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ లోక్‌సభలో చేసిన ప్రసంగం టానిక్‌లాంటిదే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో మరో ఏభై ఏళ్ల వరకూ అధికారం వైపు కాదు కదా... కనీసం ఒకటి రెండు స్ధానాలు కూడా గెలిచే పరిస్ధితి లేదని ఆ పార్టీలో ఉన్న నాయకులే చెబుతున్నారు. ఇలాంటి స్ధితిలో లోక్‌సభలో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం రాష్ట్రంలో పార్టీకి సంజీవనిలా పని చేస్తుందని పార్టీ సీనియర్ నాయకులు భావిస్తున్నారు. తాజాగా ఢిల్లీలో ఆదివారం నాడు జరిగిన సిడబ్ల్యూసీ సమావేశంలో సమస్త అధికారాలు పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకే కట్టపెట్టారు. ఇది ఓ విధంగా మంచి పరిణామం. వివిధ రాష్ట్రాల్లో ఏ ఏ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలో... ఎవరిని దూరం ఉంచాలో... ఎవరికి దగ్గర కావాలో.... పార్టీ అధ్యక్షుడు నిర్ణయించడం మంచి సంప్రదాయం.

 

 

దీని వల్ల క్షేత్ర స్ధాయిలో సమస్యలను పార్టీ జాతీయ అధ్యక్షుడికి తెలిసే అవకాశం ఉంటుంది. ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీలో ఆయా రాష్ట్రాలకు చెందిన పొత్తులు... స్నేహాలు... విరోధాలు... శత్రుత్వాలు... ఆయా రాష్ట్రాలకు చెందిన పిసిసిలే నిర్ణయించేవి. దీని వల్ల ఆయా రాష్ట్రాల్లో పార్టీ పటిష్టత కంటే నాయకుల వ్యక్తిగత ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం వచ్చేది. దీంతో కాంగ్రెస్ నాయకులు " వ్యక్తిగతంగా" లాభ పడ్డారు తప్ప పార్టీకి మాత్రం మేలు జరగలేదు. కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రాల ఇన్‌ఛార్జిలు... వారిచ్చిన నివేదికలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే వారు. దీంతో క్షేత్ర స్ధాయిలో ఏం జరుగుతోందో అధి నాయకత్వానికి తెలిసే అవకాశం ఉండేది కాదు. ఆయా రాష్ట్రాల ఇన్‌ఛార్జిల నివేదిక ప్రమాణికంగా టిక్కట్ల కేటాయింపు నుంచి పొత్తుల వరకూ కీలక నిర్ణయాలు జరిగిపోయేవి. ఇది పార్టీకి తీరని నష్టం కలిగిస్తోందని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ ఆ పాత పద్దతికి స్వస్తి పలకాలని నిర్ణయించినట్లుగా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే పొత్తుల ఖరారుపై నిర్ణయాన్నే కాదు.... పార్టీ ప్రచార బాధ్యతలను కూడా సిడబ్ల్యూసి పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకే అప్పగించింది.

 

 

సిడబ్ల్యూసి అంటే కాంగ్రెస్ పార్టీలో అత్యున్నతమైన కమిటీ. ఈ కమిటీ తీసుకున్న విధాన పరమైన నిర్ణయాలే పార్టీ అన్ని రాష్ట్రాల్లోనూ అవలంభిస్తుంది. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీలో దేశవ్యాప్తంగా 23 మంది మాత్రమే సిడబ్ల్యూసి సభ్యులుగా ఉన్నారు. ఆదివారం నాటి ఈ కీలక సమావేశంలో పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా చాలా ఉత్సాహంగా ప్రసంగించారని అంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని గద్దె దించుతామని ఆయన సిడబ్ల్యూసీ వేదికగా ప్రకటించారు. " బిజేపీకి కౌంట్ డౌన్ ప్రారంభమైంది " అని ఈ వేదిక నుంచి ప్రకటించారు. ఇది రాహుల్ గాంధీ అత్యుత్సాహం అనే కంటే పెరిగిన నమ్మకంగానే పరిగణించాలి. ఈ నమ్మకం... ఈ విశ్వాసం... ఈ లక్ష్య నిర్దేశాలకి వేదిక లోక్‌‌సభ కావడం... అది కూడా విభజనతో నష్టపోయిన  ఆంధ్రప్రదేశ్ స్ఫూర్తి కావడం కాకతాళీయమే అనుకోవాలి.