త్వరలో ఏపీలో కొత్త సినిమా.. కొత్త జిల్లాల జాతర..

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ లో  ఏపీలో కొత్త సినిమా ప్రారంభం కాబోతోంది. ఆ సినిమాతో వచ్చే ఊపుతో ఇప్పుడున్న వ్యతిరేకత అంతా కూడా వాషవుట్ అవుతుందని జగన్ అండ్ కో అంచనా వేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇంతకీ ఆ సినిమా ఇతివృత్తం ఏంటంటే ఆంధ్రాలో ఇప్పుడున్న 13 జిల్లాలను రెట్టింపు చేసే సరికొత్త ప్రక్రియ. అంటే ఏపీని 26 జిల్లాలుగా విభజించబోతున్నారన్నమాట. కొంతకాలంగా ఇవిగో కొత్త జిల్లాలు, అవిగో కొత్త జిల్లాలు అంటూ ఊరించారు. ఆ ముహూర్తం కోసం ఇప్పటిదాకా వేచి చూశారు. ఇప్పటికి గానీ ఆ ముహూర్తం రాలేదన్నమాట. అన్నీ అనుకున్నట్టు కుదిరితే మరో రెండు రోజుల్లోనే కొత్త జిల్లాల నోటిఫికేషన్ వెలువడడం ఖాయమని అత్యంత విశ్వసనీయంగా తెలుస్తోంది. 

ఇక జిల్లాల ఏర్పాటుకు క్రైటీరియాను కూడా జగన్ బాబు చాలా సింపుల్ గా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. వేరే పట్టణాల జోలికిి వెెళ్లకుండా కేవలం లోక్ సభ నియోజకవర్గాలనే ఎంచుకొని ఎంతో జాగ్రత్తపడుతున్నట్టు సమాచారం. ఈ జాగ్రత్త పడడం ఎందుకంటే గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త జిల్లాల విషయంలోనూ అదేదో అద్భుత దీపంలా హైప్ క్రియేట్ చేసి అభాసుపాలయ్యారు. 10 జిల్లాలున్న తెలంగాణను 33 జిల్లాలుగా విభజించి.. ఇంతకీ తమది ఏ జిల్లానో ఆ జిల్లావాసులకే తెలియనంత కన్ఫ్యూజ్ క్రియేట్ చేశారు. ఈ జిల్లాల పెంపును ఓ ప్రసహనంగా మార్చి సొంత పార్టీ నేతల నుంచే గాక ప్రజల నుంచి కూడా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొని.. ఎందుకీ నిర్ణయం తీసుకున్నాన్రా బాబూ అంటూ జుట్టు పీక్కునే పరిస్థితి తెచ్చుకున్నారు. అలాంటి సిచ్యువేషన్ ఆంధ్రాలో రాకుండా ఉండేందుకు జగన్ కాస్త ఆచితూచే అడుగులు వేస్తున్నట్టు చెబుతున్నారు. అందుకే జిల్లాల విషయంలో ఎవరికీ విమర్శించే అవకాశం ఇవ్వకుండా ప్రతి లోక్ సభ నియోజకవర్గాన్ని ఓ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసే కసరత్తు దాదాపుగా పూర్తి కావచ్చిందని చెబుతున్నారు. ఆ లెక్కన 25 నియోజకవర్గాలకు 25 జిల్లాలవుతాయి. కాకపోతే దానికున్న విస్తృతి దృష్ట్యా అరకు పార్లమెంట్ నియోజకవర్గాన్ని రెండు జిల్లాలుగాా విభజించాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు. దీంతో 13 జిల్లాలు కాస్తా 26గా ఏర్పడబోతున్నాయన్నమాట. మరి కొత్త జిల్లాలతో జగన్ ఏం సాధించబోతున్నారనేదే చాలా ఆసక్తి రేపుతున్న అంశం. 

జిల్లాల ఏర్పాటు ద్వారా ప్రజల దృష్టి అంతా కూడా వాటి మీదికి మళ్లుతుంది. మీడియా కూడా జిల్లాల ఏర్పాటుకు ప్రాధాన్యతనిస్తుంది. దీంతో ఇప్పుడు విపరీతంగా ఎదుర్కొంటున్న ప్రభుత్వ వ్యతిరేకత కాస్తా దారి మళ్లుతుంది. ఇది అన్నింటికన్నా జగన్ కు  టాప్ మోస్ట్ బెనిఫిట్ గా చెబుతున్నారు. ఇక మరో ముఖ్యమైన అంశం ఉద్యోగుల్లో పెరిగిపోయిన వ్యతిరేకత నుంచి కాస్తయినా గట్టెక్కడం. ఫిబ్రవరి 7 నుంచి సమ్మెకు వెళ్లి తీరతాం అంటున్న ఉద్యోగ సంఘాల నేతలను బుజ్జగించినా ప్రయోజనం కనిపించడం లేదు. దీంతో వారిని ఎలా దారికి తెచ్చుకోవాలనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై లోలోపల చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే పరిపాలన పడకేయడం ఖాయం. ప్రజా సమస్యలను అడ్రస్ చేసే నాథుడే లేకుండా పోతాడు. అదే జరిగితే జగన్ పరిస్థితి పెనం మీంచి పొయ్యిలో పడ్డట్టుగా తయారవుతుంది. అలాంటి ప్రమాదాలేవీ రాకుండా ఉండాలంటే జిల్లాల పెంపు మినహా గత్యంతరం లేదన్న అభిప్రాయానికి బిగ్ బాస్ వచ్చినట్లు చెబుతున్నారు. కొత్త జిల్లాలకు కొత్త కలెక్టర్లు, కొత్త ఎస్పీలతో పాటు జిల్లా స్థాయిల్లో ఆయా శాఖలకు చెందిన అందరు ఇతర బాసులూ వస్తారు. ఒకవేళ సమ్మె కొనసాగితే గనక కొత్త క్యాడర్ ను ఆపద్ధర్మ విధి నిర్వహణ కింద వినియోగించుకునే వెసులుపాటు దొరుకుతుంది. ఆ తరువాత రాష్ట్ర, జిల్లా స్థాయి ఉద్యోగుల సమస్యను గురించి తీరిగ్గా ఆలోచించుకోవచ్చు. 

ఇక జగన్ కొత్త సినిమా ఆశిస్తున్న మరో లాభమేంటంటే... కొత్త జిల్లాలకు కొత్త బాసుల మాదిరిగానే ఆయా జిల్లాల అభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు వస్తాయి. ఇప్పటికే  విపరీతంగా అప్పుల ఊబిలో కూరుకుపోయి, రాష్ట్రాన్ని దివాళా తీయించి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న జగన్ బాబుకు కేంద్రం నుంచి  అందే జిల్లా అభివృద్ధి నిధులు కొంతమేరకు ఉపశమనం కలిగిస్తాయని చెప్పవచ్చు. అదనపు అప్పుల కోసం అనుమతికి  ఇప్పటికే గొళ్లెం పెట్టిన ఢిల్లీ బాసులు కొత్త జిల్లాలు ఏర్పాటైతే నిధులు కేటాయించక తప్పదు. అలా వాటితో కొద్ది  రోజులపాటైనా నెట్టుకు రావచ్చు. కొత్త కార్యాలయాల ప్రారంభాలు, శంకుస్థాపనలు, రిబ్బన్ కట్టింగ్ లు అంటూ కొంతకాలం జరిగిపోతుంది. ప్రజలు కూడా తమకో కొత్త జిల్లా వచ్చిందన్న అంశాన్ని కొద్ది రోజులపాటైనా ఎంజాయ్ చేస్తారు. దీంతో జగన్ అండ్ టీమ్ కొంత రిలీఫ్ ఫీలయ్యే చాన్స్ దొరుకుతుంది. 

ఇక ఇటీవలే జగన్ జిల్లాకో విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. త్వరలోనే కొత్త జిల్లాలు ఏర్పాటవుతున్న దృష్ట్యా జిల్లాకో ఎయిర్ పోర్టు అంటే 26 ఎయిర్ పోర్టులు అవుతాయి. ప్రయాణం సాగేది గాల్లోనే అయినా మరి విమానాశ్రయాలను కనెక్ట్ చేసేది రోడ్లే కదా. ఇప్పటికే ఏపీలో రోడ్ల పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన పన్లేదు. రోడ్లు బాగు చేయకుండా, వాటికి నిధులు కేటాయించకుండా విమానాశ్రయాలు మాత్రం నిర్మిస్తామనడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఏపీ ప్రజలే నిర్ణయించుకుంటారు. పాత హామీలు ఇప్పటికే పడకేసిన పరిస్థితుల్లో కొత్త హామీలు, కొత్త జిల్లాలతో మరో కొత్త సినిమా తీయడం తప్ప జగన్ కు వేరే ప్రోగ్రామే కరవైందంటున్నారు విశ్లేషకులు.