అయ్యో పాపం.. కేబినెట్ విస్తరణ లేనట్లే.. జగనన్నా మజాకా..

ఇదిగో అదిగో అంటుండగానే పుణ్యకాలం కాస్తా కరిగిపోతోంది. మంత్రి పదవులపై ఆశలు పెట్టు కున్న ఎమ్మెల్యేల ఆశలు అడియాశలుగానే మిగిలి పోతున్నాయి. ఇటు తెలంగాణలో, అటు ఏపీలోనూ ఇదే పరిస్థితి. ఉభయ తెలుగు రాష్ట్రలలోనూ ఎంతో కాలంగా మంత్రివర్గ విస్తరణ పునరుద్దరణ గురించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే వచ్చిన వార్తలు వచ్చినట్లే వెనక్కి వెళ్లి పోతున్నాయి.ఇలా తళుక్కుమని, ఆశావహులను ఒకింత మురిపించి మాయమై పోతున్నాయి. 

ఏపీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రి వర్గం 2019లో జూన్ 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేసింది. అదే సందర్భంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్ములాను ఎనౌన్స్ చేశారు. రెండున్నరేళ్ళ తర్వాత మొత్తానికి మొత్తంగా మంత్రివర్గాన్ని తీసేసి కొత్తవారికి అవకాశం కల్పిస్తామని అన్నారు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. అయినా, మంత్రివర్గ విస్తరణ గురించి ఉలుకు పలుకూ లేదు. అయితే ఒకసారి కొత్త మంత్రివర్గం కూర్పుకు సంబంధించి కసరత్తు మొదలైందని. ముఖ్యమంత్రి ఫినిషింగ్ టచెస్ ఇస్తున్నారని, ఇంకొకసారి మంత్రుల కోరికపై ఆరు నెలలు ఎక్స్టెన్షన్ ఇచ్చారని, ఇలా వార్తలైతే వస్తున్నాయి కానీ, అసలు ముహూర్తం మాత్రం రావడం లేదు. ఈ లోగా ఆశావహులు గుళ్ళో గోపురాల చుట్టూ తిరుగుతూ,జ్యోతిషులను ఆశ్రయిస్తున్నారు. పూజలు చేస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం, ఇప్పట్లో మంత్రి వర్గవిస్తరణ ఉండదు. అసలే ఉండక పోవచ్చును, ఉన్నా, చిన్న చిన్న మార్పులు చేర్పులే కానీ, పూర్తి స్థాయి పక్షాలన మాత్రం ఉండదని తెలుస్తోంది.   

ఏపీ కథ అలా ఉంటే, తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ కంటే ముందస్తు ఎన్నికల ముచ్చట ప్రముఖంగా వినిపిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 అసెంబ్లీ ఎన్నికల వరకు తెలంగాణ కింగ్, అంత వరకు ఆయనకు ఎదురన్నదే లేదు. అందుకే 2018లో ముందస్తుకు వెళ్లి, అదే ఊపులో సారూ .. కారూ .. పదహారు ..ఢిల్లీ సర్కారు వ్యూహంతో 2019 లోక్ సభ ఎన్నికలకు వెళ్ళారు. లోక్ సభ ఎన్నికల్లో కేంద్రంలో సంకీర్ణం వస్తే, రాష్ట్రాన్ని కేటీఆర్’కు అప్పగించి  తాను కేంద్రంలో చంక్రం తిప్పాలని కేసీఆర్ స్కెచ్ సిద్దం చేసుకున్నారు. అయితే, అక్కడ కథ అడ్డం తిరిగింది. కేంద్రంలో  సంకీర్ణం రాలేదు. బీజేపీ సొంత సీట్ల సంఖ్యే మ్యాజిక్ ఫిగర్ (272) దాటి 303 కు చేరింది. ఎన్డీఎ ఫిగర్ 350 క్రాస్ చేసింది. మరోవంక రాష్ట్రంలో కారును బ్రేకు పడింది. కారు టైరుకు పక్చరైంది. కారు పదహారు కల బేజారైంది. నెంబరు 9కి  చేరింది.బీజేపీ నాలుగు, కాంగ్రెస్ మూడు సీట్లు ఎగరేసుకు పోయాయి. చివరకు సొంత బిడ్డ కవిత కూడా ఓడి పోయారు. ఇక అక్కడి నుంచి కేసీఆర్ లెక్క తప్పుతూ వస్తోంది.

అయినా, కారణాలు వేరైనా కేటీఆర్ పట్టాభిషేకం చేసే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే, కేటీఆర్ పట్టాభిషేకం మాట ఎలా ఉన్నా, అందుకోసం చేసే ప్రతి ప్రయత్నం బెడిసి కొడుతున్నట్లు కనిపిస్తోంది. మరో వంక హుజూరాబాద్ పరాభవం తర్వాత ప్రజల్లో  ప్రభుత్వం పట్ల వ్యతిరేక పెరుగుతోంది. లెక్కలు తప్పుతున్నాయి. పార్టీలోనూ, చాప కింద నీరు చేరుతున్నది. తడి తగులుతోంది. కాళ్ళకింద నెల కదులుతోది. బుజ్జగింపులు తప్పడం లేదు.

అందుకే, మంత్రివర్గ విస్తరణ విషయంలోనూ ముఖ్యమంత్రి కొంత జంకు తున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి అయిపోగానే మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ ఉంటుందని అన్నారు. కానీ ఇప్పుడా ఆలోచన అటక ఎక్కిందనీ అంటున్నారు. అలాగే, ఈసారి కూడా ముఖ్యంత్రి ముదస్తుకు పోతారన్న ఊహాగానాలు వినవస్తునాయి.  ఆగస్టు తర్వాత అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తారని అంటున్నారు.అదే నిజమైతే కేసీఆర్ ఇక మంత్రి వర్గాన్ని విస్తరించకపోవచ్చని భావిస్తున్నారు. అయితే, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీ అనుకూలంగా వస్తే ఒకలా, వ్యతిరేకంగా వస్తే మరోలా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహం ఉంటుంది సన్నిహిత వర్గాల తాజా  సమాచారం. ఈ నేపద్యంలో, మార్చి 10న యూపీ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాతనే, మత్రివర్గ విస్తరణ కానీ,మరో నిర్ణయం గానీ ఉంటుందని, అంతవరకు, అంతా గప్ చిప్ .. అంటున్నారు.