మనసులో మాట బయటపెట్టిన జయప్రద... చింత చచ్చినా పులుపు చావలేదన్న నెటిజన్లు
posted on Apr 4, 2024 11:25AM
ఎపిలో త్రికూటమి ఎన్నికల పొత్తు, సీట్ల సర్దుబాటు పూర్తయిన తర్వాత కూడా ఆశావహులు మాత్రం టికెట్లను ఆశిస్తున్నారు. ఒకప్పుడు యుపీ రాజకీయాల్లో సమాజ్ వాది పార్టీ తరపున చక్రం తిప్పిన ప్రముఖ సినీ నటి జయప్రద పుట్టిన గడ్డపై మమకారంతో రాజకీయాల్లో మళ్లీ రాణించాలని చూస్తున్నారు.
బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నటి జయప్రద తాజాగా తన మనసులోమాట బయటపెట్టారు. తనకు ఏపీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలనుందని తెలిపారు. ‘‘ఏపీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలనేది నా కోరిక, అయితే, ఇదంతా పార్టీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది’’ అని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా ఎన్డీఏ అభ్యర్థుల తరపున ప్రచారం చేయాలని కూడా ఉన్నట్టు జయప్రద పేర్కొన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మట్లాడారు.
అలనాటి నటి స్టేట్ మెంట్ తో రాజకీయాలు ఒక వ్యసనం అని మరోసారి నిరూపణ అయ్యింది. 1976లో విడుదలైన భూమి కోసం సినిమాలో మూడు నిమిషాలు నిడివికల ఒక పాట ద్వారా ఈమెను చిత్రసీమకు పరిచయం అయ్యింది. అలా మొదలైన ఈమె సినీ ప్రస్థానం 2005 వరకు మూడు దశాబ్దాలలో ఆరు భాషలలో తెలుగు, తమిళం, మలయాళము, కన్నడ, హిందీ, బెంగాలి 300కు పైగా సినిమాలలో నటించారు.
జయప్రద 1994లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్‌టి రామారావు ఆహ్వానం మేరకు ఆ పార్టీలో చేరారు. ఆమె 1996లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఆమె తెలుగు మహిళా అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు.2004 సార్వత్రిక ఎన్నికల సమయంలో యుపిలోని రాంపూర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి పోటీ చేసి 85వేల మెజారిటీతో ఎన్నికయ్యారు.
అదే పార్టీకి చెందిన ఆజం ఖాన్ తో విభేధాలు రావడంతో జయప్రద సమాజ్ వాది పార్టీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఇదే సమయంలో సమాజ్ వాది మాజీ ప్రదానకార్యదర్శి అమర్ సింగ్ తో కల్సి రాష్ట్రీయ లోక్ మంచ్ పార్టీని ఏర్పాటు చేశారు. అమర్ సింగ్ వ్యవస్థాపక అధ్యక్షులు అయితే జయప్రద ప్రదాన కార్యదర్శిగా వ్యవహరించారు. అయితే అనూహ్యంగా ఆ పార్టీ 2012 లో యుపి అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 403 స్థానాల్లో 360 అభ్యర్థులు పోటీ చేసినప్పటికీ ఒక్క స్థానం కూడా కైవసం చేసుకోలేకపోయింది
దీంతో జయప్రద అమర్ సింగ్ తో రాష్ట్రీయ లోక్ దళ్ లో చేరినప్పటికీ అక్కడ కూడా రాణించలేకపోయారు. ఆ పార్టీ నుంచి బిజ్నోర్ స్థానం నుంచి పోటీ చేసి పరాజయం చెందారు. అమర్ సింగ్ మరణం తర్వాత 2019లో జయప్రద బిజెపిలో చేరినప్పటికీ క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు.
అయితే, జయప్రద ఏపీ నుంచి బరిలోకి దిగే అవకాశం తక్కువేనని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో బీజేపీ.. టీడీపీ, జనసేనలతో పొత్తులో ఉంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థులను కూడా ప్రకటించింది. ఇక పొత్తులో భాగంగా బీజేపీ 6 లోక్‌సభ స్థానాలు, 10 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తోంది. టీడీపీ అభ్యర్థులు 144 అసెంబ్లీ స్థానాల్లో, 17 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తున్నారు. రెండు లోక్‌సభ, 21 అసెంబ్లీ సీట్లలో జనసేన తన అభ్యర్థులను బరిలో నిలిపింది. మే 13న ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. జూన్ 4న ఫలితాలు వెలువడతాయి.