నెట్ న్యూట్రాలిటీపై లోక్‌సభలో రచ్చ

 

నెట్ న్యూట్రాలిటీ అంశం మీద లోక్‌సభలో చర్చ జరుగుతున్న సందర్భంగా లోక్‌సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ అంశం మీద మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నెట్ న్యూట్రాలిటీ మీద చట్టం తీసుకురావాలని సూచించారు. కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వం లొంగిపోతోందని విమర్శించారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యల మీద కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. నెట్ న్యూట్రాలిటీ విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో వుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ వర్గాలకు లొంగిపోలేదని, స్పెక్ట్రమ్ వేలంలో అధికంగా బిడ్లు రాబట్టిన ఘనత తమ ప్రభుత్వానిదేనని చెప్పారు. నెట్ న్యూట్రాలిటీ విషయంలో నిబంధనలను రూపొందిస్తున్నామని వివరించారు. రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు విమర్శించారు. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగి, గందరగోళం ఏర్పడింది.