సిడ్నీకి మోడీ జ్వరం
posted on Nov 17, 2014 10:18AM

ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో వున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం నాడు సిడ్నీలోని ఒలింపిక్ పార్క్ భారీ క్రీడా ప్రాంగణంలో అక్కడి ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ఈ సభకు ఆస్ట్రేలియాలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న 16 వేల మంది ప్రవాస భారతీయులు, భారత సంతతికి చెందినవారు హాజరు కానున్నారు. క్రీడా ప్రాంగణం బయట కూర్చుని 5 వేల మంది భారీ తెరల ద్వారా మోడీని వీక్షించడానికి ఏర్పాట్లు చేశారు. మోడీ సభకు హాజరయ్యే 220 మంది ప్రయాణికుల కోసం ‘మోడీ ఎక్స్‌ప్రెస్’ని విక్టోరియా మంత్రి మాథ్యూ గై సదర్న్ క్రాస్ స్టేషన్‌లో ప్రారంభించారు. త్రివర్ణ పతాకాన్ని గ్రీన్ సిగ్నల్ జెండాగా ఊపి రైలును ప్రారంభించారు. ఈ రైలు 800 కిలోమీటర్లు ప్రయాణించి సోమవారం ఉదయం సిడ్నీకి చేరింది. ఒక భారత ప్రధాని పేరుతో ఆస్ట్రేలియా ఒక రైలును నడపటం ఇదే ప్రథమం. ఈ ప్రత్యేక రైలు ప్రయాణికులకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఉచితంగా శాకాహార భోజనం సరఫరా చేయడం విశేషం. ప్రస్తుతం సిడ్నీలో ఎక్కడ చూసినా భారతీయులే కనిపిస్తున్నారు.