నాగార్జున యూనివర్సిటీలో ఏపీ అసెంబ్లీ?
posted on Nov 17, 2014 10:39AM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలను గుంటూరు - విజయవాడ నగరాల మధ్యన వున్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. నాగార్జున వర్సిటీలో శాసనసభ సమావేశాల నిర్వహణకు వున్న అవకాశాలను పరిశీలించడానికి స్పీకర్ కోడెల శివప్రసాదరావు, గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు విశ్వవిద్యాలయాన్ని సందర్శించనున్నారు. యూనివర్సిటీని సందర్శించి పరిశీలించిన తర్వాత అధికారులతో మాట్లాడి ఈ విషయంలో నిర్ణయం తీసుకోనున్నట్టు స్పీకర్ కోడెల తెలిపారు. యూనివర్సిటీలో అత్యంత అధునాతన సౌకర్యాలతో నిర్మితమైన డైక్‌మెన్ ఆడిటోరియాన్ని ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు పరిశీలించనున్నారు. కొద్దిపాటి మార్పులు, చేర్పులతో ఆడిటోరియంలో అసెంబ్లీ నిర్వహణకు అవసరమైన సర్వహంగులూ ఉన్నట్టు తెలుస్తోంది. డిసెంబర్ మూడు, నాలుగు వారాల నడుమ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరిగే అవకాశం వుంది.