తెదేపా కార్యకర్తల కోసం నారా లోకేష్ సంక్షేమ యాత్ర

 

దేశంలో ప్రప్రధమంగా తెదేపాయే తన కార్యకర్తల సంక్షేమం కోసం నిధులు ఏర్పాటు చేసి వారి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. చాలా ఏళ్ళబట్టి తెదేపా తన కార్యకర్తలు, వారి కుటుంబాల కోసం, వివిధ సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తున్నప్పటికీ వాటన్నినీ నిరంతరంగా కొనసాగించేందుకు పటిష్టమయిన ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది మాత్రం నారా లోకేష్ అని చెప్పక తప్పదు. పార్టీ కార్యకర్తలకి రూ. 2 లక్షల ప్రమాద భీమా చేయాలనే ఆలోచన కూడా ఆయనదే.

 

ప్రస్తుతం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న ఆయన ఈరోజు నుండి ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలలో పర్యటించి, ప్రమాదాలలో మరణించిన 49 మంది కార్యకర్తల కుటుంబాలను కలిసి వారికి ఒక్కొక్కరికీ రూ.2లక్షల భీమా పరిహారం అందజేస్తారు. ముందుగా అయన చిత్తూరు జిల్లాలో కుప్పం నుండి ఈ కార్యక్రమాన్ని మొదలుపెడతారు. ఆ తరువాత జిల్లాలో మదనపల్లి, పుత్రమద్ది, శెట్టిపల్లె గ్రామాలలో మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను కలిసి వారికి చెక్కులు అందజేస్తారు.

 

రాత్రికి తిరుపతిలోనే బస చేసి రేపు కడప జిల్లాలో కేశవాపురం, అనంతపురం జిల్లాలో కండ్లగూడూరు, హోసూరు, డోన్ మండలాలో కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి చెక్కులు అందజేస్తారు. బుధవారం నాడు కర్నూలు జిల్లాలో కార్యకర్తల కుటుంబాలను కలిసి వారికి చెక్కులు అందజేస్తారు.