అల్ బాగ్ధాదీ ఖేల్ ఖతమ్! ఐఎస్ఎస్ దుకాణం బంద్!

 

ఒక హింసాత్మక శకం ముగిసిందా? ఒక వికృత రక్తపు క్రీడ ముగింపుకొచ్చిందా? ఒక రాక్షస రాజ్యం కుప్పకూలిపోయిందా? పరిస్థితులు చూస్తుంటే అలాగే కనిపిస్తోంది! జరిగిన దాన్ని తలుచుకుంటే ఇదేం పెద్ద శుభవార్త కాదు! అయినా కూడా ఉగ్రవాదాన్ని వ్యతిరేకించే ప్రతీ ఒక్కరూ ఎంతో కొంత ఊరట పొందే సమాచరమే! ఐఎస్ఐఎస్ అధినేత, అరాచకానికి నిలువెత్తు రూపం, అబు బక్ర్ అల్ బాగ్ధాదీ తన ఓటమిని అంగీకరించాడట! ఐసిస్ కథ ముగిసినట్టేనని తన పైశాచిక గణాలకి 'వీడ్కోలు ఉపన్యాసం' పంపాడట!

 

'ఫేర్ వెల్ స్పీచ్'... ఇప్పుడు ఇరాక్ లో ఇంకా మిగిలిన అతి తక్కువ మంది ఐసిస్ రాక్షసుల చర్చల్లో వినిపిస్తోన్న పదం! ఈ ఫేర్ వెల్ స్పీచ్ పంపింది ఇస్లామిక్ స్టేట్ టాప్ లీడర్ అల్ బాగ్ధాదీ. ఎక్కడున్నాడో ఇప్పటికీ ఇంకా తెలియకపోయినా అతడు తన మిగిలిన సైనిక శేషానికి లాస్ట్ మెసేజ్ ఇచ్చాడట. అందులో తమ ఐసిస్ పని అయిపోయినట్టే అని చెప్పేశాడు! ఇరాకీ సేనలు అంతర్జాతీయ సైన్యం, అమెరికన్ సైన్యం మద్దతుతో అష్టదిగ్భంధనం చేయటంతో ఐఎస్ఐఎస్ కు ది ఎండ్ కార్డ్ పడింది. ఇంకా ఇరాక్ లోని మోసుల్ నగరంలో కొన్ని చోట్ల ఐసిస్ సైన్యం వున్నా అత్యధిక శాతం ఇరాకీ ప్రభుత్వం చేతికి చిక్కింది. మిగిలిన వారు సిరియాలోకి పారిపోతున్నారు.  

మొదట్నుంచీ ఆత్మాహుతి చేసుకుంటే స్వర్గం దక్కుతుంది, అక్కడ 72మంది కన్యలు జిహాదీలకు స్వాగతం పలుకుతారని చెబుతోన్న ఐసిస్ ఈ చివరి సందేశంలో కూడా అదే రిపీట్ చేసింది. అల్ బాగ్ధాదీ ఇంకా బతికి వున్న ఐసిస్ సేనల్ని ఎవరి దారిన వార్ని పారిపొమ్మన్నాడు. అరబ్బీ వారు కాకుండా ఇతర దేశాల నుంచీ వచ్చిన ఉన్మాద ఉగ్రవాదులైతే తమని తాము పేల్చేసుకొమ్మని చెప్పాడట. అలా చేస్తే స్వర్గంలో 72మంది గ్యారెంటీ అంటూ మరోసారి సెలవిచ్చాడట! ఇదంతా ఎక్కడున్నాడో తెలియని అల్ బాగ్ధాదీ నుంచి మోసుల్ లోని ఐసిస్ మత ప్రబోధకుల వద్దకి చేరిందట. వారు ఐసిస్ సైన్యానికి మసీదుల్లో, మదర్సాల్లో అంతిమ సందేశం వివరిస్తున్నారట!

 

అల్ బాగ్ధాదీ మాట విని ఎంత మంది ఆత్మాహుతులకు పాల్పడతారో అనుమానమే. అయితే , దేశ దేశాల నుంచీ వచ్చిన మతోన్మాద జిహాదీలకు ఇప్పుడు ముందు నుయ్యి , వెనుక గొయ్యిలా తయారైంది! వారు చావలంటే ఆత్మాహుతి చేసుకోవాలి. లేదంటే ఇరాకీ సైన్యం చంపుతుంది. లేదంటే నిర్భంధించి నరకం చూపుతుంది. ఎటు చూసినా జిహాదీల జీవితాల దాదాపూ నాశనం అయిపోయినట్టే! కాకపోతే, ప్రపంచాన్ని వణికించి, కోట్లాది మంది జీవితాలు దుర్భరం చేసిన అల్ బాగ్ధాదీ ఐసిస్ ఓటమి అంగీకరించాడు కాని తాను ఎక్కడున్నది ఇంకా బయట పెట్టలేదు. అతడ్ని ఇరాకీ సేనలు స్వర్గానికి పంపి... 72మంది కన్యలు నిజంగా అక్కడ వుంటారో లేదో స్పష్టంగా తెలుసుకునే ఏర్పాట్లు చేస్తేనే యుద్ధం సంపూర్ణంగా ముగిసినట్టు!