మహ్మద్ సిరాజ్.. ఫిట్ నెస్ లో మహరాజ్

నరాలు తెగే ఉత్కంఠ, గోళ్లే కాదు.. వేళ్లే కొరికేసుకునేంత టెన్షన్.. ఇదీ ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లో భాగంగా ఐదో టెస్టు చివరి రోజు పరిస్థితి. చేతిలో నాలుగు వికెట్లు ఉండగా, కేవలం 35 పరుగులు చేస్తే విజయం వరించే స్థితిలో ఐదో రోజు ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేపట్టింది. నాలుగో రోజు ఆట తిలకించిన ఎవరైనా సరే ఇంగ్లాండ్ విజయం లాంఛనమే అన్న నిర్ణయానికి వచ్చేశారు. కానీ భారత్ ఆలోచనలు వేరేగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా మన హైదరాబాదీ స్టార్ బౌలర్ ఔను స్టార్ బౌలరే మహమ్మద్ సిరాజ్  టీమ్ ఇండియా విజయమే ఈ టెస్టు ఫలితం అన్న నమ్మకంతో ఉన్నాడు. అదే నమ్మకంతో బౌలింగ్ చేశాడు. అయితే మ్యాచ్ మాత్రం భారత్ కు అంత సునాయాసంగా చిక్కలేదు. చెమటోడ్పించింది. ఉత్కంఠ రేకెత్తించింది. నిరాశలో ముంచింది. ఆశలు చిగురింప చేసింది. చివరకు విజయం అందింది. అందుకు ముఖ్య కారకుడు నిస్సందేహంగా సిరాజ్ అనడంలో సందేహం లేదు. 
అన్నిటికీ మించి ఆదరణ తగ్గిపోతున్నదని అంతా భావిస్తున్న టెస్ట్ క్రికెట్ లోని మజా ఏమిటో ఈ టెస్టు మ్యాచ్ ప్రతి బంతిలోనూ కనిపించేలా చేసింది. టీ20లు టెస్టు క్రికెట్ ముందు బలాదూర్ అని నిరూపించింది. ఆరు పరుగుల ఆధిక్యతతో టీమ్ ఇండియా ఐదో టెస్టును గెలుచుకుని సిరీస్ ను సమంజసం చేసింది ఈ విజయం సిరాజ్ బౌలింగ్ హైలైట్. ఒక సంచలనం. ఈ టెస్ట్ సిరీస్ లోనే సిరాజ్ నిలకడగా వికెట్లు పడగొడుతూ వచ్చాడు. అంతే కాదు మొత్తం 23 వికెట్లు పడగొట్టి  అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ గా నిలిచాడు. అంతే కాదు ఇరు జట్లలోనూ కూడా సిరీస్ లోని ఐదు మ్యాచ్ లూ ఆడిన ఏకైక పేసర్ గా కూడా నిలిచాడు. ఫిట్ నెస్ విషయంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు.  ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో మబూమ్రా కేవలం మూడు మ్యాచ్ లే ఆడాడు. అలా బూమ్రా లేని రెండు మ్యాచ్ లలో కూడా సిరాజ్ ఇండియన్ బౌలింగ్ బాధ్యతను సమర్థంగా భుజాన మోశాడు.   
ఇక మళ్లీ చివరిదైన ఐదో టెస్ట్ వద్దకు వస్తే నాలుగో రోజు ఆటలో  ఇంగ్లాండ్ బ్యాటర్ బ్రూక్  ఇచ్చిన సునాయాసమైన క్యాచ్ ను బౌండరీ లైన్ వద్ద పట్టి కూడా నియంత్రించుకోలేక బౌండరీ లైన్ టచ్ చేసి గొప్ప అవకాశాన్ని జారవిడిచిన సిరాజ్.. తన ఐదు వికెట్ల ప్రదర్శనతో ఆ తప్పిదాన్ని అంతా మరిచిపోయేలా చేశాడు ఓటమి అంచు నుంచి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.  

మొత్తంగా  ఉత్కంఠ, ఉత్సాహం,  కోపం, నిట్టూర్పు ఇలా అన్ని రకాల మానసిక స్థితులను కలిగేలా చేసిన మ్యాచ్ ఇది. టి20, వన్డేలు తీసికట్టేననిపించిన టెస్ట్ మ్యాచ్ ఇది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu