దేశానికి మంచి రోజులు వస్తునట్లేనా?

 

 

మోడీ ప్రభుత్వానికి ఆగస్ట్ 28తో వంద రోజులు పూర్తయింది. కనుక, ఆయన ప్రభుత్వ పనితీరు, పాలనపై వివిధ సంస్థలు దేశ వ్యాప్తంగా జరిపిన ప్రజాభిప్రాయ సేకరణలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కొందరు ప్రజలు మోడీ చాలా సమర్ధంగా వ్యవహరిస్తున్నారని అభిప్రాయపడితే, మరి కొందరు ప్రజలను ఆకట్టుకోనేందుకే అతిగా దూకుడు ప్రదర్శిస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేసారు. అదేవిధంగా మోడీ ప్రధానిగా బాధ్యతలు చేప్పట్టిన తరువాత ప్రభుత్వంలో చలనం కనబడుతోందని కొంత మంది ప్రజలు అభిప్రాయపడగా, అది కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకు మోడీ చేస్తున్న గారడీ మాత్రమేనని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేసారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధానం పట్ల కూడా ప్రజల నుండి ఇటువంటి మిశ్రమ స్పందనే వ్యక్తం అయింది. ఏమయినప్పటికీ ఎన్డీయే ప్రభుత్వం అంటే కేవలం నరేంద్రమోడీ మాత్రమేననే విషయంలో ప్రజలలో పెద్దగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం కాకపోవడం విశేషం. అంటే మోడీ ప్రభుత్వంలో మిగిలిన మంత్రులందరికీ ప్రధాన బాధ్యతలు అప్పగించినప్పటికీ, విధాన నిర్ణయాలలో వారి పాత్ర నామమాత్రమేనని ప్రజలు భావిస్తున్నట్లు అర్ధమవుతోంది.

 

ఇదివరకు దేశాన్ని పాలించిన డా.మన్మోహన్ సింగ్ పరిపాలనను పూర్తిగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ చేతిలో పెట్టేసి తను పేరుకి ప్రధానిగా మిగిలిపోయి తీవ్ర అప్రతిష్ట మూట గట్టుకొంటే, నరేంద్ర మోడీ అందుకు పూర్తి భిన్నంగా మంత్రులను, చివరికి బీజేపీ పార్టీని కూడా పూర్తిగా తన చెప్పుచేతల్లోకి తెచ్చుకొని తనే పూర్తిగా అధికారం చెలాయిస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు. రాజకీయ విశ్లేషకులు ఈ పరిణామాన్ని చాలా ముందే ఊహించారు. కొందరు మోడీది నిరంకుశవాదం అని భావిస్తే, దాదాపు 125కోట్ల జనాభా ఉన్న అతి పెద్ద దేశానికి అటువంటి సమర్దుడయిన ప్రధానమంత్రి ఉండటం చాలా అవసరమేనని మరికొందరు భావిస్తున్నారు. ఏమయినప్పటికీ, మోడీ పాలనలో దేశం సర్వతోముఖాభివృద్ధి జరిగినట్లయితే ఆయనది అతివాదమా లేక నిరంకుశవాదమా? అనే విషయం ప్రతిపక్ష పార్టీలు తప్ప ప్రజలు పట్టించుకోకపోవచ్చును.

 

అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఎప్పుడూ తమ పరిపాలన అద్భుతంగానే సాగుతోందని, అంతకుముందు ఎన్నడూ కనీవినీ ఎరుగని అభివృద్ధి జరిగిపోతోందనే చెప్పుకొంటాయి. కనుక మోడీ ప్రభుత్వం కూడా ఆవిధంగానే చెప్పుకోవడం సహజమే. దేశంలో మొట్ట మొదటి సారిగా బుల్లెట్ రైళ్ళు ప్రవేశపెట్టాలనే ఆలోచన, గంగా నది ప్రక్షాళన, నదుల అనుసంధానం, దేశ వ్యాప్తంగా కొత్తగా ఐఐటీలు, వంద స్మార్ట్ సిటీల ఏర్పాటు వంటి ఆలోచనలన్నీ ఇదివరకెన్నడూ ప్రజలు ఊహించలేదు కనుక అవి అభివృద్ధి సంకేతాలని ప్రజలు, మోడీ ప్రభుత్వం కూడా భావించవచ్చును. కానీ మోడీ ఎన్నికల ప్రచార సమయంలో పదేపదే చెప్పినట్లు దేశానికి నిజంగానే మంచి రోజులు మొదలయ్యాయా లేదా అనేది సామాన్య ప్రజలు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు, మేధావులు దృవీకరించవలసి ఉంటుంది.

 

మోడీ ప్రధానిగా బాధ్యతలు చేప్పట్టి కేవలం 100 రోజులే అయినప్పటికీ, ఆయన ప్రభుత్వంలో, వివిధ వ్యవస్థలలో ఉన్న లోపాలను చక్కదిద్దేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్న విషయం ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. అయితే తక్షణమే వాటి ఫలితాలు కనబడకపోయినా, క్రమంగా పరిస్థితులలో మార్పు కనబడవచ్చునని ఆశించవచ్చును. మోడీ ప్రభుత్వం అధికారం చెప్పట్టినప్పుడు 53.4 శాతం ఉన్న జీడీపీ 53.7 శాతానికి పెరిగిందని ఆర్ధిక నిపుణులే ప్రకటించారు. అయితే కేవలం ఆ గణాంకాలతో సామాన్య ప్రజలకు ఒరిగేదేమీ ఉండదు కనుక బహుశః వారిని ఆకట్టుకొని ప్రసన్నం చేసుకోనేందుకే ‘ప్రధానమంత్రి ధనజన యోజన’ వంటి ప్రజాకర్షక పధకాలను మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టడం అనివార్యమయి ఉండవచ్చును. కానీ గత మూడు నెలలలో రైల్వే చార్జీల పెంపు, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదల వంటి అంశాలు మాత్రమే సామాన్య ప్రజలపై నేరుగా ప్రభావం చూపిస్తాయి కనుక, వారిలో మోడీ పాలన పట్ల కొంత అసంతృప్తి ఉండటం సహజమే. ఒకవేళ మోడీ ప్రభుత్వం చేప్పట్టిన చర్యల వలన ధరలు కూడా అదుపులోకి వచ్చినట్లయితే, వారూ సంతోషించవచ్చును.    

 

ఏమయినప్పటికీ గత యూపీయే పాలనతో పోలిస్తే మోడీ ప్రభుత్వం చాలా చురుకుగా, సమర్ధంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టంగా కనబడుతోంది, కనుక మోడీ చెప్పినట్లు దేశానికి మళ్ళీ మంచి రోజులు వస్తాయని ఆశిద్దాము. రాకపోతే కాంగ్రెస్ ఉండనే ఉంది.