ఆర్ఎస్ఎస్ ప్రాపకం కోసం మోడీ తంటాలు!

సార్వత్రిక ఎన్నికలకు ముందు, తర్వాతా కూడా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మోడీ విధానాల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉందన్న వార్తలు గట్టిగా వినిపించాయి. ఎన్నికల ముందు అయితే బీజేపీకి సంపూర్ణ మెజారిటీ వచ్చే అవకాశాలు ఇసుమంతైనా కనిపించడం లేదని ఆర్ఎస్ఎస్ పెద్దలే అన్నారు. ప్రధానిగా మోడీకి ప్రత్యామ్నాయాన్ని బీజేపీ చూసుకోవాలన్న బలమైన సంకేతాలు కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీకి పంపింది. 

ప్రధానిగా రెండో సారి ప్రమాణ స్వీకారం చేసిన తరువాత నుంచీ, అంటే 2019 ఎన్నికలలో బీజేపీ సొంతంగానే మ్యాజిక్ ఫిగర్ ను అధిగమించిన నాటి నుంచీ... కమలం పార్టీలో ప్రాధాన్యతలు మారిపోయాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ బీజేపీ ప్రభుత్వాలే ఉండాలన్న లక్ష్యంగా అడుగులు వేయడం ప్రారంభమైంది. ఆ క్రమంలో మిత్రపక్షాలలో సైతం చీలికలను ప్రోత్సహించింది. ఈ క్రమంలో పార్టీకి రాజకీయ మెంటార్ అయిన బీజేపీని ఖాతరు చేయడం మానేసింది. ఇందుకు కారణం.. పార్టీలో, ప్రభుత్వంలో ప్రధాని మోడీ తిరుగులేని ఆధిపత్యం చెలాయించడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీంతో ఆర్ఎస్ఎస్, బీజేపీ మధ్య గ్యాప్ పెరిగింది. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్, ప్రధాని మోడీ మధ్య అగాధం రోజు రోజుకూ పెరుగుతూ వచ్చింది.

పర్యవశానంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలు పరస్పర విమర్శలకు దిగిన సందర్భాలు కూడా చోటు చేసుకున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పని తీరు మీద తీవ్రస్థాయి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎన్నికలకు ముందు బీజేపీ అధ్యక్షుడు జె.పి. నడ్డా ఆరెస్సెస్‌ విమర్శలు గుప్పించారు.   బీజేపీ ఒక స్వతంత్రమైన పార్టీ అనీ, దాని వ్యవహారాలను అది నిర్వహించుకోగలదని నడ్డా వ్యాఖ్యానించడం జరిగింది.

అదంతా పక్కన పెడితే.. 2024 ఎన్నికలలో బీజేపీకి చావు దెబ్బ తగిలింది. గత రెండు ఎన్నికలలో ఘన విజయాలు సాధించిన ఆ పార్టీ ఇప్పుడు సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన స్థానాలను గెలుచుకోవడంలో విఫలమైంది. దీంతో అనివార్యంగా ఎన్డీయే భాగస్వామ్య పక్షాల మద్దతు, దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలోలా ఏకపక్ష నిర్ణాయాలు తీసుకునే సావకాశం కానీ అవకాశం కానీ మోడీకి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే ఇంత కాలం పార్టీపైనా, ప్రభుత్వంపైనా తిరుగులేని ఆధిపత్యం వహించిన మోడీకి ఇప్పుడు ఒక్కో అడుగూ ఆచి తూచి వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. భాగస్వామ్య పక్షాల డిమాండ్లకు తలొగ్గక తప్పని సరి కావడమే కాకుండా, ఆర్ఎస్ఎస్ తో గ్యాప్ లేకుండా చూసుకోవలసిన అగత్యం ఏర్పడింది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ అండ లేకుండా పార్టీ నుంచి సంపూర్ణ మద్దతు పొందడం సాధ్యం కాదు. అదీ లోక్ సభలో సంపూర్ణ మెజారిటీ లేని స్థితిలో  అలాంటి మద్దతు లభించడం దాదాపు అసంభవం. ఎందుకంటే బీజేపీలో అత్యధికులు ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్నవారే. అందుకే ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడీ అనివార్యంగా ఆర్ఎస్ఎస్ తో గ్యాప్ పూడ్చుకునే ప్రయత్నాలు ఆరంభించారు. అందులో భాగమే  ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో కేంద్ర ప్రభుత్వోద్యోగులు పాల్గనకుండా ఉన్న నిషేధాన్నితొలగించడం. 
గత ఐదు దశాబ్దాలుగా అమలులో ఉన్న ఈ నిషేధాన్ని ఎత్తివేయడం కోసం మోడీ గత పదేళ్లలో ఒక్కటంటే ఒక్క ప్రయత్నం చేయలేదు.  

ఇప్పుడు హడావుడిగా నిషేధాన్ని ఎత్తివేయడంతో సర్వత్రా మోడీ ఆర్ఎస్ఎస్ పట్ల తన విధేయతను  చాటు కోవడం కోసమేనని అంటున్నారు. ఆరెస్సెస్‌, జమాతే ఇస్లామీ వంటి సంస్థల కార్యకలాపాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకుండా నిషేధం విధిస్తూ 1966, 1970, 1980 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.    ఆ నిషేధాన్ని  జూలై 9న కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది.  ప్రభుత్వ వ్యవహారాల నుంచి రాజకీయ వ్యవహారాలను దూరంగా ఉంచాలన్న సదుద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగు లను పార్టీలు, పార్టీల అనుబంధ సంస్థల కార్యకలాపాల్లో పాల్గొనకుండా నిషేధించడం జరిగింది. ఇప్పుడు మోడీ తన స్వార్థ ప్రయోజనాల కోసం ఆ నిషేధాన్ని తొలగించడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతున్నది.