మోడీ..ఇంతలో ఎంత మార్పు... దటీజ్ చంద్రబాబు!

రాజకీయ వైరుధ్యంతో చంద్రబాబును ఇరుకున పెట్టి చోద్యం చూసిన వాళ్లే ఇప్పుడు ఆయన విజన్ కు దాసోహం అంటున్నారు. రాజకీయంగా సమస్యలు చుట్టుముట్టి ఆయన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కనీసం పట్టించుకోని వారంతా ఇప్పుడు ఆయన మద్దతు కోసం తపిస్తున్నారు. 

ఇంతలో ఎంత మార్పు. అవమానించిన వాళ్లే ఇప్పుడు అడుగులకు మడుగులొత్తుతున్నారు. రాజకీయంగా అణిచివేయాలని వ్యూహాలు పన్నిన వారే ఆయన ప్రాపకం కోసం పాకులాడుతున్నారు. కాలం అన్నిటినీ మార్చేస్తుంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు విషయంలో అదే జరిగింది. నెలల వ్యవధిలో జాతీయ రాజకీయాలలో ఆయన కేంద్ర బిందువుగా మారిపోయారు. అంతకు ముందు ఐదేళ్లు.. ఐదేళ్లనేమిటి? అంతకన్నా ఎక్కువ కాలమే ఆయనను  తక్కువ చేసి మాట్లాడిన వారు, తక్కువగా చూసిన వారు ఇప్పుడు ఆయన కరుణాకటాక్షాల కోసం అర్రులు చాస్తున్నారు. గతంలో ఆయన పట్ల అనుచితంగా వ్యవహరించిన వారే ఇప్పుడు చంద్రబాబును హీరోగా అభివర్ణిస్తున్నారు. 
కొన్ని నెలల కిందట జగన్ సర్కార్ చంద్రబాబును స్కిల్ కేసు అంటూ అక్రమంగా అరెస్టు చేసిన సమయంలో దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలూ, రాజకీయ నాయకులు ఆ అరెస్టును ఖండించలేదు. కనీసం ఆయనకు మద్దతుగా గళమెత్తలేదు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అందుకు మినహాయింపు అనుకోండి అది వేరే విషయం. 
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 15 విపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తిని ఒక రాష్ట్ర ప్రభుత్వం కక్ష పూరితంగా నిబంధనలకు తిలోదకాలిచ్చి అక్రమంగా అరెస్టు చేస్తే.. ప్రధాని నరేంద్రమోడీ కనీసం స్పందించలేదు. అక్రమ అరెస్టును ఖండించలేదు. తద్వారా జగన్ అరాచకత్వానికి పరోక్షంగా మద్దతు పలికారు. అంతకు ముందు.. అంటే 2019 ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏపీలో పర్యటించిన నరేంద్ర మోడీ చంద్రబాబు పేరు కూడా ప్రస్తావించకుండా లోకేష్ కా బాప్ అంటూ అవమానకరంగా ప్రసంగాలు చేశారు. అయితే అదంతా గతం. ఇటీవలి ఎన్నికలలో తెలుగుదేశం కూటమి సర్కార్ ఘన విజయం సాధించింది. అంతే కాదు.. ఎన్డీయే కూటమి మనుగడను శాసించగలిగేటన్ని స్థానాలను దక్కించుకుంది.  దీంతో ప్రధాని మోడీ ఒక్క సారిగా చంద్రబాబుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. అలా ఇవ్వక తప్పని పరిస్థితి ఆయనకు ఉంది. అందుకే గతంలో చంద్రబాబు పట్ల తాను వ్యవహరించిన తీరును పూర్తిగా మరిచిపోయి.. ఇప్పుడు బాబు భజన చేస్తున్నారు. 
గతంలో అంటే 2018 నుంచి ఏడాది పాటు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం అప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు ఎంతగా కేంద్రాన్ని కోరారు, ఎన్డీయే భాగస్వామ్యపక్షం అయినప్పటికీ, అప్పట్లో మోడీ  చచంద్రబాబు వినతులకు పూచిక పుల్ల విలువ ఇవ్వలేదు. ఒక రాష్ట్రముఖ్యమంత్రిగా కోరినప్పటికీ చంద్రబాబుకు కనీసం అప్పాయింట్ మెంట్ ఇవ్వలేదు. దీంతో విధిలేని పరిస్థితుల్లో చంద్రబాబు ఎన్డీయే నుంచి బయటకు వచ్చారు. హస్తిన వేదికగా ధర్నాలు చేశారు. అయినా ఫలితం లేకపోయింది.   
ఇప్పుడు రోజులు మారాయి. ఇక మోడీ ఎంత మాత్రం గతంలోలా చంద్రబాబును నిర్లక్ష్యం చేయలేరు.  నోరు తెరిచి అడగకుండానే.. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం ఇవ్వాల్సినవన్నీ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. 
2024 ఎన్నికల ముందే మోడీకి జ్ణానోదయం అయ్యింది. దత్తపుత్రుడు జగన్ ను నమ్ముకుంటే.. ఆయనతో పాటు తానూ మునగక తప్పదన్న తత్వం బోధపడింది. అందుకే  తెలుగుదేశం పార్టీతో పొత్తు అనివార్యమయ్యింది.  అంతే కాదు ఇప్పుడు ప్రధానిగా తాను తీసుకునే విధాన నిర్ణయాలకు చంద్రబాబు ఆమోదమూ తప్పని సరి అయిన పరిస్థితిలో ఆయన ఉన్నారు. అందుకే అవకాశం ఉన్నా లేకపోయినా, సందర్భం వచ్చినా రాకపోయినా మోడీ బాబును పొగడటానికే ప్రయత్నిస్తున్నారు. ఎన్డీయే సభలలో  చంద్రబాబుతో సన్నిహితంగా మెలిగి తమ మధ్య అరమరకలు లేవని చాటడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్డీయే సమావేశాలలో తన పక్కను చంద్రబాబు ఉండేలా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. చంద్రబాబు పక్కన నిలబడి ఫొటోలకు పోజులిస్తున్నారు. తాజాగా ఆదివారం (జూన్ 30) మోడీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో అరకు కాఫీ గురించి ప్రస్తావించారు. అది నిజంగా ఒక అద్భుతం అంటూ.. 2016లో తన విశాఖ పర్యటనలో చంద్రబాబుతో కలిసి అరకు కాఫీ తాగిన ఫొటోను షేర్ చేశారు.